తమిళనాట దళపతి విజయ్ అపూర్వ విజయం గురించి దేశం మొత్తం చర్చ నడుస్తోంది. ఒక నటుడిగా రాజకీయ పార్టీ స్థాపించిన రెండేళ్లలోనే అత్యధిక సీట్లు నెగ్గి ప్రభంజం సృష్టించారాయన. అలాగే ఒంటరి పోరుతోనే అధికారం దిశగా అడుగులు వేస్తున్నారు. అయితే ఫలితాల్లో హంగ్ రావడంతో ప్రభుత్వ ఏర్పాటుపై ఉత్కంఠ కొనసాగుతోంది.
విజయ్ తమిళగ వెట్రి కగళం పార్టీ తమిళనాడు ఎన్నికల్లో 107 సీట్లు నెగ్గింది. డీఎంకే కూటమి 74, అన్నాడీఎంకే కూటమి 53 సీట్లు నెగ్గింది. ఇందులో డీఎంకే 59, కాంగ్రెస్ 5, వామపక్షాలు 2, వీసీకే 4, ఇతర మిత్రపక్షాలు 4 ఉన్నాయి. అన్నాడీఎంకే కూటమిలో అన్నాడీఎంకే 47, పీఎంకే 4, బీజేపీ 2, ఇతరులు 1 నెగ్గారు. మొత్తం 234 సీట్లు ఉన్న తమిళనాడులో ప్రభుత్వ ఏర్పాటునకు కావాల్సిన మ్యాజిక్ ఫిగర్ 118. అంటే మరో 11 సీట్ల దూరంలో టీవీకే నిలిచింది. ఈ తరుణంలో ప్రభుత్వం ఏర్పాటు ఎలా చేయనుందా? అనే చర్చ మొదలైంది. విజయ్ ముందు ఇప్పుడు కొన్ని ఆప్షన్స్ ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు..

మొదటి మార్గం.. ఎన్డీయే కూటమితో చేతులు కలపడం. సంఖ్యాపరంగా ఇది సులభమైనది, ఎందుకంటే రెండు పార్టీల కలయికతో మెజారిటీ వెంటనే వస్తుంది. కానీ బీజేపీతో అన్నాడీఎంకేకు ఉన్న సంబంధం విజయ్‌కు ఇమేజ్ సమస్యగా మారుతుంది. ఎందుకంటే ఆయన బీజేపీని సైద్ధాంతిక శత్రువుగా అభివర్ణించారు కాబట్టి.
రెండో మార్గం.. అన్నాడీఎంకేతోనే జట్టు కట్టడం. కానీ బీజేపీని వదిలేసి!. ఇది విజయ్‌కు క్లీన్ రూట్ ఇస్తుంది. యాంటీ-బీజేపీ వైఖరిని కొనసాగిస్తూనే.. ఇటు అన్నాడీఎంకే బేస్‌ను విజయ్ పొందగలరు. అయితే, ఎన్డీయే నుంచి బయటకు రావడం అన్నాడీఎంకేకు జాతీయ స్థాయిలో ప్రభావం చూపే కఠిన నిర్ణయం అవుతుంది.
మూడో మార్గం.. చిన్న పార్టీల మద్దతుతో టీవీకే ప్రభుత్వం ఏర్పడడం. తద్వారా విజయ్ తన స్వతంత్రతను నిలబెట్టుకుంటారు. “క్లీన్ బ్రేక్” ఇమేజ్ కొనసాగుతుంది. అయితే ఇలాంటి ప్రభుత్వం బలహీనంగా ఉంటుంది. చిన్న పార్టీల ఒత్తిడి ఎక్కువగా ఉండి.. స్థిరత్వం ప్రశ్నార్థకమవుతుంది.
నాలుగో మార్గం.. కాంగ్రెస్ బయటి నుంచి మద్దతు ఇవ్వడం. కాంగ్రెస్ డీఎంకే కూటమి నుంచి బయటకు వచ్చి టీవీకేకు మద్దతు ఇవ్వడం. తద్వారా విజయ్‌కు మెజారిటీ వస్తుంది. అలాగే బీజేపీతోనూ విజయ్‌కు దూరం కొనసాగుతుంది. అయితే ఈ కూటమిలో కాంగ్రెస్‌కు ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వాల్సి రావొచ్చు.

ఐదవ మార్గం.. రెయిన్‌బో కూటమి. చిన్న పార్టీలతో కలసి, అన్నాడీఎంకే లేదంటే కాంగ్రెస్ బయట మద్దతు ఇవ్వడం ద్వారా ప్రభుత్వం ఏర్పడుతుంది. ఇది విజయ్ స్వతంత్రతను నిలబెట్టుకునే మార్గం. కానీ ఇది కూడా సంక్లిష్టమైన కూటమి అవుతుంది, ఇలాంటి ప్రభుత్వ నిర్వహణ కష్టతరంగా మారుతుంది.
ఆరో మార్గం.. డీఎంకే మద్దతు పొందడం. ఇది అక్కడి రాజకీయాల్లో కలలో కూడా జరగని పరిణామమే అవుతుంది. విజయ్ మొదటి నుంచి డీఎంకేను రాజకీయ శత్రువుగా అభివర్ణించారు. కాబట్టి డీఎంకే మద్ధతు ప్రజల్లో ఆయన విశ్వసనీయతను దెబ్బ తీసే చాన్స్ ఉంది.
అయినప్పటికీ హంగ్ అసెంబ్లీ పరిస్థితుల నేపథ్యంలో అనూహ్యమైన కలయికలు జరగవచ్చనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ తరుణంలో విజయ్ నేతృత్వంలో టీవీకే నేడు కీలక సమావేశం నిర్వహించనుంది. నెగ్గిన అభ్యర్థులందరినీ ఈ సమావేశానికి ఆహ్వానించారాయన. పార్టీ కార్యాలయంలో జరగబోయే ఈ సమావేశం తర్వాతే ప్రభుత్వ ఏర్పాటు ప్రయత్నాలు ఓ కొలిక్కి వచ్చే అవకాశం కనిపిస్తోంది.


