దర్యాప్తునకు ముందే స్టే ఎలా ఇస్తారు..? 

Supreme Court Speaks About Amaravati Land Scam Case - Sakshi

ఇది ఆమోదం కాదు.. ఇలాంటి ఉత్తర్వులు నిలబడవు 

అమరావతి భూ కుంభకోణం కేసులో సుప్రీంకోర్టు 

అసాధారణ పరిస్థితులు ఉంటే తప్ప దర్యాప్తుపై స్టే ఇవ్వరాదు 

అత్యున్నత న్యాయస్థానం ఇదే విషయం పునరుద్ఘాటించింది 

చట్టం తన పని తాను చేసుకుపోవాల్సి ఉంటుంది 

వచ్చే వారమే పరిష్కరించాలని ఏపీ హైకోర్టుకు సూచన

సాక్షి, న్యూఢిల్లీ: ‘గత విచారణ సందర్భంగానే మీకు చెప్పాం. ఇలా దర్యాప్తు ప్రారంభం కూడా కాకముందే స్టే ఆర్డర్లు ఇవ్వడాన్ని మేం ఆమోదించం. అసాధారణ పరిస్థితులు ఉంటే తప్ప దర్యాప్తుపై స్టే ఇవ్వరాదని సుప్రీంకోర్టు పునరుద్ఘాటిస్తూ వచ్చినందునే ఇప్పుడు మేం హైకోర్టు ఉత్తర్వుల్లో జోక్యం చేసుకుంటున్నాం. సంబంధిత పిటిషన్‌ను హైకోర్టు త్వరితగతిన విచారించాల్సిన అవసరం ఉంది. వచ్చే వారమే ఈ పిటిషన్‌ను విని, పరిష్కరించాలని హైకోర్టుకు సూచిస్తున్నాం’ అని సుప్రీంకోర్టు ధర్మాసనం వ్యాఖ్యానించింది. గత ప్రభుత్వ హయాంలో అమరావతి ప్రాంతమైన గుంటూరు జిల్లా తుళ్లూరు మండలంలో ఎస్సీ, బీసీలకు చెందిన అసైన్డ్‌ భూములను ఏపీ ప్రభుత్వం రాజధాని కోసం తీసుకుంటే పరిహారం రాదని నమ్మించి.. రాజకీయ నాయకులు, అధికారులు కలిసి భూములు బదలాయించిన వ్యవహారంపై దర్యాప్తు జరుపుతుండగా ఏపీ హైకోర్టు స్టే విధించిన సంగతి తెలిసిందే. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాలు చేస్తూ పిటిషన్‌ దాఖలు చేసింది. ఈ పిటిషన్‌ను జస్టిస్‌ లావు నాగేశ్వరరావు నేతృత్వంలోని ధర్మాసనం గురువారం విచారించింది. ప్రభుత్వం తరుఫున సీనియర్‌ న్యాయవాదులు ముకుల్‌ రోహత్గీ, పి.ఎస్‌.నరసింహా, మెహఫూజ్‌ నజ్కీ వాదనలు వినిపించారు. 

పరిష్కరించకపోతే మళ్లీ మీ వద్దకు.. 
తొలుత ముకుల్‌రోహత్గీ వాదనలు వినిపిస్తూ ‘ఒక వారం రోజుల్లోనే తుది విచారణ చేపట్టి ఉత్తర్వులు ఇస్తామని సెప్టెంబర్‌ 11 నాటి విచారణ సందర్భంగా ధర్మాసనం పేర్కొంది’ అంటూ ప్రస్తావించారు. ఈ సందర్భంలో జస్టిస్‌ లావు నాగేశ్వరరావు స్పందిస్తూ ‘హైకోర్టులో విచారణ ఎప్పుడు ఉంది?’ అని ప్రశ్నించారు. దీనికి ప్రభుత్వం తరఫు న్యాయవాదులు సమాధానం ఇస్తూ ‘హైకోర్టు విచారణ తేదీ ఇవ్వలేదు..’ అని నివేదించారు. ఈ నేపథ్యంలో ‘హైకోర్టు వచ్చే వారం సంబంధిత పిటిషన్‌ను పరిష్కరించాలని అడుగుతాం’ అని ధర్మాసనం పేర్కొంది. ఈ దశలో ముకుల్‌ రోహత్గీ వాదనలు వినిపిస్తూ ‘అందుకు సమ్మతమే.. ఈ పిటిషన్‌ను ఇక్కడ పెండింగ్‌లో ఉంచండి..’ అని కోరగా.. ధర్మాసనం ఎందుకని ప్రశ్నించింది. ‘ఎందుకంటే అక్కడ పరిష్కరించకపోతే మళ్లీ మీ వద్దకు రావాలి. హైకోర్టు ఉత్తర్వులు పూర్తిగా చట్టవిరుద్ధం..’ అని రోహత్గీ నివేదించారు. 

దర్యాప్తు ముందే స్టే ఇస్తారా? 
ప్రతివాది తరఫు సీనియర్‌ న్యాయవాది సిద్ధార్థ లూత్రా వాదనలు వినిపించేందుకు ప్రయత్నించగా జస్టిస్‌ లావు నాగేశ్వరరావు జోక్యం చేసుకుంటూ ‘అది మధ్యంతర ఉత్తర్వు మాత్రమే కాబట్టి వచ్చే వారం పరిష్కరించాలని మేం హైకోర్టుకు సూచిస్తున్నాం.. కేసును పరిష్కరించనివ్వండి’ అని ఉత్తర్వు వెలువరించి ముగించబోయారు. ప్రతివాది తరఫు న్యాయవాది సిద్ధార్థ లూత్రా మాట్లాడుతూ ‘హైకోర్టు దర్యాప్తుపై స్టే ఇచ్చి ఉండాల్సింది కాదన్న మీ అబ్జర్వేషన్‌ను ఉత్తర్వుల్లో నమోదు చేస్తే దాని ప్రభావం హైకోర్టు విచారణపై పడుతుంది’ అని నివేదించారు. అయితే దానిని ఉత్తర్వుల నుంచి తొలగిస్తామని, ఈ పిటిషన్‌ను ఇక్కడ పెండింగ్‌లో ఉంచుతున్నామని కోర్టు పేర్కొంది.  

ఇలాంటి ఉత్తర్వులు నిలబడటం కష్టం 
ప్రతివాది తరఫు న్యాయవాది సిద్ధార్థ లూత్రా మరో నివేదనను ధర్మాసనం ముందుం చారు. ‘వారం సమయం మాత్రమే ఇవ్వడం వల్ల ఇబ్బంది ఉంటుంది. రెండు వారాలు గడువు ఇవ్వండి..’ అని కోరారు. దీనికి ధర్మాసనం స్పందిస్తూ ‘ముందుగా ఉత్తర్వులు రానివ్వండి.. వచ్చాక ఇక్కడ మూడు వారాలు ఆగి విచారణ జరుపుదాం.. తొందర ఏం లేదు.. దానిలో ఆందోళన అక్కర్లేదు..’ అని పేర్కొంది. ఈ సమయంలో సిద్ధార్థ లూత్రా తిరిగి వాదనలు వినిపిస్తూ దర్యాప్తు అంశాన్ని ప్రస్తావించారు. వాంగ్మూలాలు నమోదు చేస్తోందని నివేదించారు. ఈ సందర్భంలో జస్టిస్‌ లావు నాగేశ్వరరావు జోక్యం చేసుకుంటూ ‘అదేమైనా కావొచ్చు. కానీ ఇలాంటి (దర్యాప్తుపై హైకోర్టు స్టే ఇవ్వడం) ఉత్తర్వులు నిలబడడం చాలా కష్టం. అది మీకు తెలుసు. మీరు నిపుణులు కూడా. ఒకసారి ఫిర్యాదు నమోదైన తర్వాత దర్యాప్తు ప్రారంభం కాకుండానే ఇందులో కేసు ఏముంది? అంటూ హైకోర్టు స్టే ఇవ్వడం ఏంటి?’ అని ప్రశ్నించారు. ‘2014కు సంబంధించి ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేస్తోంది..’ అని లూత్రా నివేదించగా, ‘మేం ఏం సహాయం చేయలేం. యంత్రాంగం ముందుకు నడవాల్సి ఉంటుంది. చట్టం తన పని తాను చేసుకుపోవాల్సి ఉంటుంది..’ అని న్యాయమూర్తి వ్యాఖ్యానించారు. ‘మేం పదే పదే చెబుతున్నాం. సాధారణ పరిస్థితుల్లో స్టే ఇవ్వకూడదు..’ అని పేర్కొన్నారు. తదుపరి విచారణను ఈనెల 28కి వాయిదా వేశారు. 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top