ముంబైలో ‘రెంట్‌ ఏ ట్యాక్సీ’ పథకం 

Rent a Bike to Solve Traffic Jam Problem in Mumbai - Sakshi

పెరుగుతున్న ట్రాఫిక్‌ జామ్‌లకు ప్రత్యామ్నాయంగా..

మెట్రో పనులతో ఇరుకుగా మారిన ముంబై రోడ్లు

ట్యాక్సీలు, ఆటోలతో ప్రయాణం మరింత దుర్లభం

యాప్‌ ఆధారిత సేవలు అందిస్తామంటున్న ఓ ప్రైవేట్‌ కంపెనీ

త్వరలో నిర్ణయం తీసుకుంటామన్న రవాణా శాఖ కమిషనర్‌

సాక్షి, ముంబై: దేశ ఆర్థిక రాజధాని ముంబైలో రోజురోజుకూ జఠిలమవుతున్న ట్రాఫిక్‌ జామ్‌ సమస్యను పరిష్కరించేందుకు ‘రెంట్‌ ఏ బైక్‌’ అనే నూతన విధానాన్ని ఓ ప్రైవేటు కంపెనీ తెరమీదకు తెచ్చింది. అందుకు సంబంధించిన ప్రతిపాదన రవాణ శాఖకు పంపించింది. దీనిపై త్వరలో స్టేట్‌ ట్రాన్స్‌పోర్టు అథారిటీ (ఎస్‌టీఏ) సమావేశం ఏర్పాటుచేసి తుది నిర్ణయం తీసుకుంటుందని రాష్ట్ర రవాణ శాఖ కమిషనర్‌ అవినాశ్‌ ఢాకణే తెలిపారు.

ముంబైలో జరుగుతున్న మెట్రో పనులు వల్ల గత కొన్ని నెలలుగా రోడ్లన్నీ ఇరుకుగా మారాయి. ఫలితంగా వాహనాల వేగం మందగించి తరచూ ట్రాఫిక్‌ జామ్‌ సమస్య తలెత్తుతోంది. దీని ప్రభావం ముంబైకర్ల విలువైన సమయం, వ్యయంపై పడుతోంది. రోడ్లపై ప్రైవేటు కార్లు, ట్యాక్సీలు, ఆటోల సంఖ్య తగ్గించాలంటే రెంట్‌ ఏ బైక్‌ పథకం ఎంతో దోహదపడుతుందని ప్రైవేటు కంపెనీ ప్రతిపాదిస్తోంది. ఈ కంపెనీ అధికార వర్గాలు అందించిన వివరాల ప్రకారం రెంట్‌ ఏ బైక్‌ పథకం యాప్‌ బేస్డ్‌ సేవా తరహాలో ఉంటుంది. ఈ బైక్‌ల సేవలు రైల్వే స్టేషన్‌ నుంచి కార్యాలయాలకు చేరుకునే విధంగా ఉంటాయి. రోజు, వారం, నెల ఇలా వేర్వేరు రోజుల కోసం ఈ బైక్‌లు హెల్మెట్‌తోపాటు అందజేస్తాయి. బైక్‌ లైసెన్స్‌ ఉన్నవారు మాత్రమే ఈ సేవలను వినియోగించుకోవచ్చు.

చదవండి: (ఆదిత్య ఠాక్రే సంకల్పం: ఉద్యాన వనంలో ‘ట్రీ–హౌస్‌’.. ప్రత్యేకతలివే..) 

లోకల్‌ రైలు దిగిన ప్రయాణికులు స్టేషన్‌ బయట అందుబాటులో ఉన్న రెంట్‌ ఏ బైక్‌ సేవలను వినియోగించుకోవచ్చు. సాధారణంగా లోకల్‌ రైలు దిగిన ప్రయాణికులు, ఉద్యోగులు, వ్యాపారులు షేర్‌ ట్యాక్సీలు, ఆటోలలో తమ కార్యాలయాలకు చేరుకుంటారు. ఆలస్యమైతే లేదా అత్యవసరమైతే సొంతంగా ట్యాక్సీలో లేదా ఆటోలో వెళతారు. దీంతో రోడ్డుపైకి ఎక్కువ వాహనాలు రావడంవల్ల ట్రాఫిక్‌ జామ్‌ సమస్య తలెత్తుతోంది. ఫలితంగా తమ గమ్యస్థానాలకు సకాలంలో చేరుకోలేకపోతున్నారు. అంతేగాకుండా ట్రాఫిక్‌ జామ్‌లో చిక్కుకోవడంవల్ల చార్జీలు కూడా ఎక్కువే అవుతాయి.

ఇది మధ్యతరగతి వారికి ఆర్థికంగా భారం కూడా. అదే బైక్‌ను రెంట్‌కు తీసుకుంటే విలువైన సమయం ఆదా కావడంతోపాటు తక్కువ చార్జీలకే తమ గమ్యస్థానాలకు చేరుకోవచ్చని ప్రైవేటు కంపెనీ అంటోంది. అంతేగాకుండా ట్యాక్సీ, యాప్‌ ఆధారిత ప్రైవేటు ఓలా, ఉబెర్‌టాంటి ఫోర్‌ వీలర్స్‌తో పోలిస్తే టూ వీలర్‌ ప్రయాణం వేగంగా, చార్జీలు గిట్టుబాటు అయ్యే విధంగా ఉంటుందని పేర్కొంది. 

‘ర్యాపిడో’ వ్యవహారం ఇంకా తేలలేదు... 
ఇదిలాఉండగా 2020 ఆగస్టులోనే ర్యాపిడో అనే కంపెనీ ముంబైలో ట్యాక్సీ సేవలు ప్రారంభించాలని నిర్ణయం తీసుకుంది. కానీ ఆ సేవలకు సంబం ధించిన బ్యాడ్జీ, లైసెన్స్‌ లేకపోవడంతో ప్రాంతీయ రవాణా కార్యాలయం (ఆర్టీఓ) స్పందించలేదు. అనుమతులు లేకుండా  ట్యాక్సీ సేవలు ప్రారంభిస్తే ర్యాపిడో కంపెనీపై, డ్రైవర్లపై కఠిన చర్యలు తీసు కుంటామని ఆర్టీఓ హెచ్చరించింది. దీంతో ఈ పథ కం అటకెక్కింది. అయితే బైక్‌ టాక్సీ సేవలు కొనసాగుతుండగా, రెంటెడ్‌ బైక్‌ సేవలు మాత్రం అందుబాటులోకి రాలేదు. అప్పటికే కరోనా కారణంగా ట్యాక్సీ, ఆటో డ్రైవర్లు, యజమానులు తీవ్రంగా నష్టపోయారు.

తరుచూ పెరుగుతున్న సీఎన్‌జీ ధరలతో చార్జీలు పెంచివ్వాలని డిమాండ్‌ చేస్తున్నారు. ఇలాంటి సందర్భంలో రెంట్‌ ఏ బైక్‌ సేవలు ప్రారంభిస్తే ట్యాక్సీ, ఆటోలలో ప్రయాణించే వారి సంఖ్య గణనీయంగా తగ్గిపోతుంది. అయితే ఎస్‌టీఏ దీనిపై క్షుణ్ణంగా ఆలోచించి సంబంధిత ఆర్టీఓ అధికారులతో సమగ్ర విచారణ జరిపి తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. ఆదరాబాదరగా నిర్ణయం తీసుకుంటే ఆ తరువాత వచ్చే విమర్శలు, ఆటో, ట్యాక్సీ డ్రైవర్ల నుంచి వచ్చే వ్యతిరేకతను చవిచూడాల్సి వస్తుంది. 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top