ఎందుకీ ఆత్మహత్యల పరంపర?.. రాజస్తాన్‌ కోటాలో ఏం జరుగుతోంది? | Sakshi
Sakshi News home page

ఎందుకీ ఆత్మహత్యల పరంపర?.. రాజస్తాన్‌ కోటాలో ఏం జరుగుతోంది?

Published Sat, Aug 12 2023 3:44 AM

Rajasthan: Medical Aspirant Dies By Suicide In Kota - Sakshi

రాజస్తాన్‌లోని కోటా. ప్రవేశ పరీక్షల కోచింగ్‌కు పెట్టింది పేరు. ఇప్పుడు విద్యార్థి ఆత్మహత్యలకు కోటలా మారింది. వారం రోజుల్లో ముగ్గురు విద్యార్థులు ఆత్మహత్యకు పాల్పడ్డారు.   ఈ ఏడాది ఇప్పటివరకు 18 మంది నిండు ప్రాణాలను తీసుకున్నారు.   ఈ ఆత్మహత్యలకి కారణలేంటి ?   విద్యార్థుల ఆత్మహత్యల్ని నివారించలేరా? 

కోటాలో ఏ కోచింగ్‌ సెంటర్‌లో అడుగుపెట్టినా కళ్లు చెదురుతాయి. పెద్ద రిసెప్షన్‌ హాలు, లగ్జరీ ఫరీ్నచర్, గోడలకి పెయింటింగ్‌లు, సీసీటీవీ కెమెరాలు, బయోమెట్రిక్‌ సిస్టమ్, ఫైవ్‌ స్టార్‌ హోటల్స్‌ని తలపించేలా సకల సదుపాయాలు. ఇంజనీర్లు, డాక్టర్లు కావాలని ఆశతో కలలు కనే విద్యార్థులకు కావల్సిన సదుపాయాలు అన్నీ ఉన్నాయి. ఈ ఏడాది ప్రవేశ పరీక్షలకు ప్రిపేర్‌ అవడానికి దేశం నలుమూలల నుంచి 3 లక్షల మంది విద్యార్థులు చేరారు.

ఐఐటీ, ఐఐఎంలలో అత్యధిక మందికి సీటు లభిస్తున్నప్పటికీ చాలా మందిలో భవిష్యత్‌పై భరోసా కూడా కరువు అవుతోంది. రాను రాను విద్యార్థుల ఆత్మహత్యలు పెరిగిపోతున్నాయి. కొందరు హాస్టల్‌ భవనంపై నుంచి దూకి, మరికొందరు సీలింగ్‌ ఫ్యాన్‌కి ఉరి వేసుకొని , కొందరు సూసైడ్‌ నోట్‌ రాసి మరికొందరు మౌనంగా కన్నవారికి కడుపుకోత మిగిల్చి వెళ్లిపోతున్నారు.  

ఉత్తరప్రదేశ్‌లోని రామ్‌పూర్‌కు చెందిన బహదూర్, రాజస్తాన్‌ జలోర్‌కు చెందిన పుషే్పంద్ర సింగ్‌ , బిహార్‌కు చెందిన భార్గవ్‌ మిశ్రా,  యూపీకి చెందిన మంజోత్‌ చాబ్రా, ఇప్పుడు యూపీలోని అజమ్‌గఢ్‌కు చెందిన మనీశ్‌ ప్రజాపతి .. గత కొద్ది రోజుల్లో కోటాలో ఆత్మహత్య చేసుకున్న విద్యార్థులు వీరంతా. అందరూ 16 నుంచి 19 ఏళ్ల వయసు మధ్య­నున్న వారే. మనీష్‌ నాలుగు నెలల క్రితమే కోటాలో ఇంజనీరింగ్‌ కోచింగ్‌లో జాయిన్‌ అయ్యాడు. బుధవారమే అతని తండ్రి వచ్చి కొడుకుని చూసి క్షేమసమాచారాలు అడిగి తిరుగు ప్రయాణమయ్యారు. ఆయన తన ఊరు చేరకుండానే మనీశ్‌ ఆత్మహత్య చేసుకున్నాడని ఫోన్‌ వచి్చంది. అంతే ఆ తండ్రి కుప్పకూలిపోయాడు. ఈ మధ్య కాలంలో కోటాలో విద్యార్థుల ఆత్మహత్యలు ఆందోళన కలిగిస్తున్నా­యి. గత 12 ఏళ్లలో 150 మంది విద్యార్థులు కోటాలో ఆత్మహత్య చేసుకున్నట్టు గణాంకాలు వెల్ల­డిç­Ü్తున్నాయి. కరోనా మహమ్మారి తర్వాత కోచింగ్‌ సెంటర్‌లు ప్రారంభమయ్యాక 2021లో నలుగురు ఆత్మహత్యకు పాల్పడితే,  2022లో 20 మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఏడాది ఇప్పటికే 18 మంది బలవన్మరణం చెందారు.  

ప్రధాని హోదాకు తగని ప్రసంగం
గురువారం లోక్‌సభలో ప్రధాని మోదీ ప్రసంగంపై కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ వాద్రా మండిపడ్డారు. ప్రధాని మోదీ రెండు గంటల ప్రసంగమంతా హాస్యం, వ్యంగ్యం, అసందర్భ వ్యాఖ్యలతోనే గడిచిపోయిందని వ్యాఖ్యానించారు. ‘మణిపూర్‌ లాంటి తీవ్రమైన, సున్నితమైన అంశంపై మాట్లాడేటప్పుడు నవ్వడం, ఎగతాళి చేయడం ప్రధాని హోదాలో ఉన్న వ్యక్తికి తగదు’అని ఆమె శుక్రవారం ట్వీట్‌ చేశారు.  

► ఇది పోటీ ప్రపంచం. వంద సీట్లు ఉంటే లక్ష మంది పరీక్ష రాస్తున్నారు. అంత పోటీని తట్టుకొని విజయం సాధించడం సులభం కాదు. అందుకే విద్యార్థులు ప్రెషర్‌ కుక్కర్‌లో పెట్టినట్టుగా తీవ్రమైన ఒత్తిడికి లోనవుతున్నారు. తాము కన్న కలలు కల్లలవుతాయన్న భయంతో నిండు ప్రాణాలు తీసేసుకుంటున్నారు.  
► కోటాలో ఆత్మహత్య చేసుకుంటున్న విద్యార్థుల్లో యూపీ, బిహార్‌ వంటి రాష్ట్రాలకు చెందినవారే ఎక్కువ. ఆ  విద్యార్థులు వారి స్కూల్లో ఫస్ట్‌ ర్యాంకర్స్‌. దీంతో తల్లిదండ్రులు గంపెడాశలతో అప్పో సప్పో చేసి కోటాలో చేరి్పస్తున్నారు. తమ స్కూల్లో హీరోగా వెలిగిన విద్యారి్థకి అక్కడికి రాగానే తాను లక్షల మందిలో ఒకడినన్న వాస్తవం తెలుస్తుంది. మిగిలిన విద్యార్థులతో నెగ్గుకు రాలేక, తల్లిదండ్రుల్ని నిరాశపరచలేక ఆత్మహత్యకి పాల్పడుతున్నారు.  
► కోటాలో కోచింగ్‌ తీసుకునే విద్యార్థులు రోజుకి 16–18 గంటల చదవాలి. ఉదయం 6.30 నుంచి మళ్లీ అర్థరాత్రి 2 వరకు తరగతులు ఉంటాయి. అంటే విద్యార్థి పడుకోవడానికి ఇచ్చే సమయం కేవలం నాలుగు గంటలు. మధ్యలో తల్లిదండ్రులతో ఫోన్‌లో మాట్లాడడానికి అవకాశం ఇస్తారు. ‘‘ఏదో ఒకరోజు బాగా నిద్ర వచ్చి పావుగంట ఎక్కువ సేపు పడుకుంటే గిల్టీగా ఫీలవుతాను. తోటి వారి కంటే వెనకబడిపోతానన్న భయం వేస్తుంది. ఆ రోజంతా ఏడుస్తూనే ఉంటాను’’ అని ఐఐటీకి ప్రిపేర్‌ అవుతున్న సమర్‌ అనే విద్యార్థి చెప్పాడు. కంటినిండా నిద్రకి కూడా నోచుకోని చదువుల భారం వారి ప్రాణాలు తోడేస్తోంది.  
► కోటాలో విద్యార్థుల ఆత్మహత్యలు కోవిడ్‌ తర్వాత మరింత ఎక్కువయ్యాయి. కరోనా సమయంలో విద్యార్థులకి చదివే అలవాటు తప్పిపోయింది. దానికి తోడు కోవిడ్‌ సోకిన వారిలో మానసిక సమస్యలు ఎక్కువయ్యాయి. చదువుల ఒత్తిడి మరింతగా కుంగదీస్తోంది. ఆత్మహత్యకు పురిగొల్పుతోంది.  
► కోటాలో కోచింగ్‌కే ఏడాదికి 2 లక్షల నుంచి 5 లక్షల రూపాయల దాకా అవుతుంది. నిరుపేద కుటుంబాల విద్యార్థులకి తల్లిదండ్రులు చేసిన అప్పే ఎప్పుడూ కళ్ల ముందు కనిపిస్తోంది. ఆ లేత మనసులపై ఒత్తిడి పెంచుతుంది. దీంతో కోచింగ్‌ సెంటర్ల పరీక్షల్లో ఫెయిలైనా జీవితాన్ని అంతం చేసుకుంటున్నారు.


ఆత్మహత్యకి నివారణ మార్గాలేంటి ?  
విద్యార్థుల వరస ఆత్మహత్యలతో కోచింగ్‌ సిటీ కోటాపై వ్యతిరేకత పెరిగిపోతూ ఉండడంతో రాజస్తాన్‌ ప్రభుత్వం కొన్ని చర్యలు తీసుకుంది. 24/7 పనిచేసే హెల్ప్‌లైన్‌ నెంబర్లు, పోలీసుల ప్రత్యేక బూత్‌లు ఏర్పాటు చేశారు. కొన్ని కోచింగ్‌ సెంటర్లు ప్రత్యేకంగా కౌన్సెలర్లను నియమించి ఒత్తిడిలో ఉన్న విద్యార్థులకు కౌన్సెలింగ్‌ ఇప్పిస్తోంది. మానసిక ప్రశాంతతనిచ్చే యోగా, ధ్యానం, జుంబా డ్యాన్స్‌లు వంటి క్లాసులు కూడా కొన్ని కోచింగ్‌ సెంటర్లలో కనిపిస్తున్నాయి. అయితే ఈ చర్యలు సరిపోవని అనూ గుప్తా అనే టీచర్‌ చెబుతున్నారు.

కోచింగ్‌ సెంటర్‌ యాజమాన్యాలు 24 గంటలూ పోటీ పరీక్షల్లో టెక్నిక్కులను బోధించడానికే ప్రాధాన్యం ఇస్తున్నారే తప్ప జీవితంలో వచ్చే సమస్యల్ని ఎలా ఎదుర్కోవాలో, పోటీ ప్రపంచంలో ఎదురయ్యే అడ్డంకుల్ని అధిగమించే పోరాటస్ఫూర్తిని విద్యార్థుల్లో కలి్పంచడం లేదని అనూ పేర్కొన్నారు. ఎలాగైనా బతకగలమన్న ధీమా విద్యార్థుల్లో నింపినప్పుడే ఆత్మహత్యల్ని నివారించవచ్చునని అభిప్రాయపడ్డారు. విద్యార్థులు చదువు మీద పెట్టే సమయానికి, ఇతర కార్యక్రమాలకి ఇచ్చే సమయానికి మధ్య సమతుల్యత ఉండాలని అహ్లా మాత్రా అనే సైకాలజిస్ట్‌ చెప్పారు.

రోజుకి 18 గంటలు చదువు రుద్దేయడం వల్ల మెంటల్‌ బ్యాలెన్స్‌ కోల్పోయే ప్రమాదం ఉందని హెచ్చరించారు. తల్లిదండ్రులు పిల్లల్ని కోటా ఫ్యాక్టరీకి పంపించే ముడి పదార్థాలుగా చూస్తున్నారని ఇప్పుడు వారిపై పెట్టుబడి పెడితే భవిష్యత్‌లో వారు ఉపయోగపడతారన్న ధోరణి నుంచి బయటకు రావాలని అవిజిత్‌ పాఠక్‌ అనే సైకాలిజిస్టు సూచించారు. విద్యార్థులపై ఒత్తిడి తగ్గించడానికి రాజస్థాన్‌ ప్రభుత్వం ప్రైవేటు విద్యా సంస్థల నియంత్రణ బిల్లుని తీసుకురావాలని భావిస్తోంది.ఆ బిల్లు వెంటనే తీసుకువచ్చి విద్యార్థుల ఆత్మహత్యల్ని నివారించాలనే డిమాండ్లు వినిపిస్తున్నాయి.  
– సాక్షి, నేషనల్‌ డెస్క్‌  

Advertisement
Advertisement