పంజాబ్‌ మంత్రి అరోరా అరెస్ట్‌  | Punjab minister Sanjeev Arora arrested by ED after raids | Sakshi
Sakshi News home page

పంజాబ్‌ మంత్రి అరోరా అరెస్ట్‌ 

May 9 2026 10:45 PM | Updated on May 10 2026 12:19 PM

Punjab minister Sanjeev Arora arrested by ED after raids

మనీలాండరింగ్‌ కేసులో ఈడీ అదుపులో 

తీవ్రంగా ఖండించిన ఆమ్‌ఆద్మీ పార్టీ

న్యూఢిల్లీ: రూ.100 కోట్ల జీఎస్‌టీ కుంభకోణం మనీలాండరింగ్‌ కేసులో పంజాబ్‌ మంత్రి సంజీవ్‌ అరోరా(62)ను ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌(ఈడీ)అధికారులు శనివారం అరెస్ట్‌ చేశారు. అంతకుముందు, ఆయనకు సంబంధించిన సంస్థల్లో అధికారులు తనిఖీలు చేపట్టారు. గురుగ్రామ్‌లో ఉన్న హాంప్టన్‌ స్కై రియాలిటీ లిమిటెడ్‌తోపాటు ఢిల్లీలోని రెండు చోట్ల సోదాలు జరిపారు. అయితే, అరోరా విచారణలో తమకు సహకరించడం లేదని ఈడీ అధికారులు అంటున్నారు. ఢిల్లీలో కేసు నమోదైనందున ఆయన్ను ఢిల్లీకి తీసుకొచ్చి కోర్టులో హాజరు పరుస్తామన్నారు. అరోరాపై ఫెమా కేసు కూడా ఉంది. 

ఈ కేసులో ఏప్రిల్‌ 19వ తేదీన ఆరోరా ఆస్తులను అటాచ్‌ చేసింది. రాజ్యసభ ఎంపీగా ఉన్న అరోరా మంత్రిగా బాధ్యతలు చేపట్టిన ఏడాదిలోనే ఆప్‌ ప్రభుత్వంలో కీలకంగా మారారు. సీఎం మాన్‌ ఆయనకు పరిశ్రమలు, వాణిజ్యం, పెట్టుబడులు, విద్యుత్, వంటి ముఖ్యమైన శాఖలను కేటాయించింది. రూ.100 కోట్ల విలువైన మొబైల్‌ ఫోన్లను కొనుగోలు చేసినట్లు తప్పుడు జీఎస్‌టీ బిల్లులు పెట్టారని, దుబాయ్‌ నుంచి నిధులను అక్రమంగా దేశంలోకి తీసుకువచ్చేందుకు అరోరా ఈ పథకం వేశారని ఈడీ ఆరోపిస్తోంది. తమ మంత్రి అరోరాను ఈడీ అరెస్ట్‌ చేయడంపై సీఎం భగవంత్‌ సింగ్‌ మాన్‌ స్పందించారు. ఈడీ–బీజేపీ అనైతిక సంబంధం పతనం ఇక్కడి నుంచి మొదలుకానుందంటూ వ్యాఖ్యానించారు.  

ఔరంగజేబ్‌లా మోదీ వ్యవహరిస్తున్నారు: కేజ్రీవాల్‌ 
పంజాబ్‌ మంత్రి అరోరా అరెస్ట్‌పై ఆప్‌ చీఫ్‌ అరవింద్‌ కేజ్రీవాల్‌ తీవ్రంగా స్పందించారు. ప్రధాని మోదీని ఆయన మొఘల్‌ చక్రవర్తి ఔరంగజేబుతో పోల్చారు. ‘ఇప్పటికే అక్రమంగా దేశంలోని అనేక ప్రాంతాలను ఆక్రమించుకున్న మోదీ జీ ఇప్పుడు పంజాబ్‌కు చేరుకున్నారు’అంటూ వ్యాఖ్యానించారు. ఆప్‌ నేతలను భయపెట్టి బీజేపీలోకి రప్పించుకునేందుకు దర్యాప్తు విభాగాలను కేంద్రం దుర్వినియోగం చేస్తోంది. బెంగాల్‌ ఎన్నికలు ముగిసిన దగ్గర్నుంచి ప్రతిరోజూ మోదీ జీ పంజాబ్‌లో ఈడీ దాడులు చేయిస్తున్నారు. గత కొన్నేళ్లుగా మోదీ పంజాబ్‌ను, పంజాబీలను తక్కువ చేసి చూస్తున్నారు’అంటూ ఆరోపించారు. 

పంజాబ్‌లో రోజులు దగ్గరపడ్డాయనే తెలిసి..: బీజేపీ 
ఆప్‌ విమర్శలకు బీజేపీ దీటుగా బదులిచ్చింది. ‘ఆప్‌ అవినీతిలో కూరుకుపోయింది. అవినీతి నేతలను అరెస్ట్‌ చేసినప్పుడల్లా ఆప్‌ నానా హంగామా చేస్తోంది’అని పేర్కొంది. ‘పంజాబ్‌లో ఔరంగజేబ్‌లా వ్యవహరిస్తున్నది కేజ్రీవాల్‌ తప్ప, మోదీ కాదు. రాష్ట్రంలో పార్టీ పాలనకు రోజులు దగ్గరపడ్డాయని తెలిసే ఇలాంటి ఆరోపణలకు దిగుతున్నారు’అంటూ ఆ పార్టీ నేత ఆర్‌పీ సింగ్‌ మండిపడ్డారు. పంజాబ్‌ పోలీసు శాఖ హత్యలు, డ్రగ్స్‌ మాఫియా, ఇసుక మాఫియా లాంటి వాటిపై చర్యలు తీసుకోవడం మాని రాజకీయ ప్రత్యర్థులను లక్ష్యంగా చేసుకున్నారని విమర్శించారు. అక్రమాలకు పాల్పడిన వారిపై ఈడీ చర్యలు తీసుకోవడంలో ఎలాంటి తప్పూ లేదన్నారు.  
 

Advertisement
 
Advertisement
Advertisement