భారత్‌ జోడో యాత్రలో విషాదం.. కుప్పకూలిన కాంగ్రెస్‌ ఎంపీ.. గుండెపోటుతో కన్నుమూత

Punjab Congress MP died of heart attack Bharat Jodo Yatra - Sakshi

ఛండీగఢ్‌: కాంగ్రెస్‌ పార్టీ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భారత్‌ జోడో యాత్రలో విషాదం చోటు చేసుకుంది. కాంగ్రెస్‌ నేత, జలంధర్‌ ఎంపీ సంటోఖ్‌ సింగ్‌ చౌదరి గుండె పోటుతో కన్నుమూశారు. శనివారం ఉదయం యాత్ర మొదలైన కాసేపటికే ఈ పరిణామం చోటు చేసుకుంది. 

లూథియానా ఫిలౌర్‌ నుంచి రాహుల్‌ గాంధీతో కలిసి కాలి నడకన బయలుదేరిన కాసేపటికే సంటోఖ్‌ సింగ్‌ కుప్పకూలిపోయారు. గుండె వేగంగా కొట్టుకోవడంతో.. వెంటనే ఆయన్ని ఆంబులెన్స్‌లో ఫగ్వారాలోని ఓ ఆస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే ఆయన కన్నుమూసినట్లు తెలుస్తోంది. గుండె పోటుతోనే ఆయన చనిపోయినట్లు వైద్యులు ధృవీకరించారు. విషయం తెలిసిన వెంటనే కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ యాత్రకు బ్రేక్‌ వేశారు. హుటాహుటిన ఆస్పత్రికి బయల్దేరారు. 

ఇదిలా ఉంటే.. సంటోశ్‌ సింగ్‌ చౌదరి మరణం పార్టీకి తీరని లోటని పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఒక ప్రకటనలో పేర్కొన్నారు. మరోవైపు పంజాబ్‌ సీఎం భగవంత్‌ మాన్‌, మాజీ సీఎం కెప్టెన్‌ అమరీందర్‌ సింగ్‌లు కూడా ఎంపీ మృతిపై ట్విటర్‌ ద్వారా తమ సంతాపం తెలియజేశారు.

సంటోఖ్‌ సింగ్‌ చౌదరి(76).. గతంలో పంజాబ్‌ కేబినెట్‌లోనూ పని చేశారు. 2014, 2019 ఎన్నికల్లో ఆయన ఎంపీగా తెలుపొందారు. 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top