Prime Ministers Museum Inaugurated By PM Modi, Full Speech In Telugu - Sakshi
Sakshi News home page

PM Modi: ప్రజాస్వామ్య బలోపేతం దేశానికి గర్వకారణం

Apr 14 2022 5:06 PM | Updated on Apr 15 2022 4:58 AM

Prime Ministers Museum Inaugurated By PM Modi Full Speech - Sakshi

మ్యూజియంలో వాజ్‌పేయి ప్రసంగం వింటున్న మోదీ

ప్రధానమంత్రుల మ్యూజియం

ప్రారంభోత్సవంలో ప్రధాని మోదీ

న్యూఢిల్లీ: మన దేశం నేటి ఉన్నత స్థితికి చేరడం వెనుక స్వాతంత్య్రానంతరం ఏర్పడిన అన్ని ప్రభుత్వాల కృషి ఉందని ప్రధాని మోదీ అన్నారు. ఒకట్రెండు మినహాయింపులు తప్పిస్తే ప్రజాస్వామ్య విధానాలను బలోపేతం చేయడంలో దేశం గర్వించదగ్గ సంప్రదాయాన్ని నెలకొల్పిందని చెప్పారు. గురువారం మోదీ ప్రధానమంత్రి సంగ్రహాలయ(ప్రధానమంత్రుల మ్యూజియం)ను ఇప్పటి వరకు పనిచేసిన 14 మంది ప్రధానులకు అంకితం చేశారు.

మొదటి టికెట్‌ కొనుగోలు చేసి మ్యూజియంలోకి అడుగుపెట్టిన ప్రధాని మోదీ ఈ సందర్భంగా మాట్లాడారు. రాజ్యాంగ నిర్మాత బీఆర్‌ అంబేడ్కర్‌ జయంతి రోజున ఈ మ్యూజియాన్ని ప్రారంభించడం ఎంతో సముచితమన్నారు. పలువురు మాజీ ప్రధానమంత్రుల కుటుంబసభ్యులు పాల్గొన్న ఈ కార్యక్రమానికి గాంధీ కుటుంబం హాజరు కాలేదని ప్రధాని కార్యాలయం తెలిపింది. కార్యక్రమానికి హాజరైన దివంగత ప్రధాని పీవీ నరసింహారావు కుమార్తె సురభి వాణీదేవి తన తండ్రి కళ్లద్దాలను మ్యూజియంకు అందజేశారు.  దివంగత నేతకు కాంగ్రెస్‌ సముచిత గౌరవం ఇవ్వలేదంటూ ఈ కార్యక్రమంలో పాల్గొన్న పీవీ మనవడు, బీజేపీ నేత ఎన్‌వీ సుభాష్‌ ఆవేదన వ్యక్తం చేశారు.

అంబేడ్కర్‌కు నివాళులు..
భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ జయంతి సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గురువారం పార్లమెంట్‌ ప్రాంగణంలో ఘన నివాళులర్పించారు. పార్లమెంట్‌లో అంబేడ్కర్‌కు నివాళి కార్యక్రమంలో రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్, ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్య నాయుడు, లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లా తదితరులు పాల్గొన్నారు.  డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ జయంతి సందర్భంగా దేశవ్యాప్తంగా పలువురు నేతలు, ప్రముఖులు ఘనంగా నివాళులర్పించారు. ఆయన సేవలను స్మరించుకున్నారు. రాజ్యాంగం అనే బలమైన పునాదిని బీఆర్‌ అంబేడ్కర్‌ మన దేశానికి ఇచ్చారని కాంగ్రెస్‌ పార్టీ నేత, ఎంపీ రాహుల్‌ గాంధీ పేర్కొన్నారు.

మ్యూజియం ప్రత్యేకతలు
► ఢిల్లీలోని తీన్ మూర్తి ఎస్టేట్ లో 15,600 చదరపు మీటర్ల వైశాల్యంతో రెండు బ్లాకులు, 43 గ్యాలరీలతో ఈ సంగ్రహాలయాన్ని నిర్మించారు. 
► రైజింగ్ ఇండియా కథ స్ఫూర్తిగా ఈ మ్యూజియానికి డిజైన్ చేశారు. 
► భారత స్వాతంత్ర్య సంగ్రామం, రాజ్యాంగ నిర్మాణం, ప్రధానులు ఎదుర్కొన్న వివిధ సవాళ్లు, దేశాన్ని ముందుకు తీసుకెళ్లిన వైనాన్ని మ్యూజియంలో చూపించనున్నారు. 
► వాటితో పాటు దివంగత ప్రధానులు ఉపయోగించిన వస్తువులనూ మ్యూజియంలో ప్రదర్శనకు ఉంచుతారు. 
► నేత తరానికి ఆనాటి ప్రధానుల సేవలు, నాయకత్వ పటిమ, దార్శనికత, విజయాల గురించి తెలియజేసేందుకు ప్రధానమంత్రి సంగ్రహాలయ ఎంతో దోహదం చేయనుంది.
► టికెట్‌ ధర 100 రూపాయలు. విదేశీయులకు మాత్రం 750 రూపాయలు. 
► ఐదు నుంచి 12 ఏళ్లలోపు పిల్లకు మాత్రం సగం ధర ఉంటుంది. 
► విద్యాసంస్థల తరపున వెళ్తే మాత్రం.. 25 శాతం డిస్కౌంట్‌ వర్తిస్తుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement