బెంగాల్‌లో సువర్ణాధ్యాయం మొదలు | PM Narendra Modi at victory rally at BJP office in Delhi | Sakshi
Sakshi News home page

బెంగాల్‌లో సువర్ణాధ్యాయం మొదలు

May 5 2026 5:31 AM | Updated on May 5 2026 5:31 AM

PM Narendra Modi at victory rally at BJP office in Delhi

సంప్రదాయ బెంగాలీ దోతీ కుర్తాలో అభివాదం చేస్తున్న ప్రధాని మోదీ. చిత్రంలో నితిన్‌ నబిన్‌

గంగామాత ఆశీస్సులతో చరిత్రాత్మక విజయం

ఢిల్లీలో బీజేపీ కార్యాలయంలో విజయోత్సవ సభలో ప్రధాని మోదీ 

అస్సాంలో హాట్రిక్‌పై హర్షం.. పుదుచ్చేరిలో ఎన్డీఏను విశ్వసించారని కితాబు 

పశ్చిమాసియా సంక్షోభాన్ని భారత్‌ సమర్థంగా ఎదుర్కొంటోందని వెల్లడి 

అంగ్‌.. బంగ్‌.. కలింగ్‌లను కలిపి భారత్‌ వృద్ధిని మరింత ముందుకు తీసుకెళ్తామని స్పష్టీకరణ 

కాంగ్రెస్, టీఎంసీ, డీఎంకేలు మహిళల ఆగ్రహాన్ని రుచి చూశాయని చురకలు

సాక్షి, న్యూఢిల్లీ: పశ్చిమ బెంగాల్‌లో దశాబ్దాల నిరీక్షణ తర్వాత సువర్ణాధ్యాయం మొదలైందని ప్రధాని నరేంద్ర మోదీ ఉద్ఘాటించారు. హింస, భయం, బుజ్జగింపు రాజకీయాలకు స్వస్తి పలికి బెంగాల్‌ను అభివృద్ధి పథంలో నడిపిస్తామన్నారు. ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలతోపాటు పలు రాష్ట్రాల ఉప ఎన్నికల్లో ఎన్డీఏ సాధించిన చరిత్రాత్మక విజయాలను ఆయన అపూర్వం, అద్వితీయంగా అభివర్ణించారు. అసెంబ్లీ ఎన్నికల ఫలితాల నేపథ్యంలో సోమవారం ఢిల్లీలోని బీజేపీ జాతీయ ప్రధాన కార్యాలయంలో భారీ విజయోత్సవ సభ నిర్వహించారు. ఈ సభలో పార్టీ జాతీయ అధ్యక్షుడు నితిన్‌ నబిన్, రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌తో కలిసి మోదీ పాల్గొన్నారు. పార్టీ జాతీయ అధ్యక్షుడిగా నితిన్‌ నబిన్‌ బాధ్యతలు చేపట్టిన తొలి ఎన్నికల్లోనే కార్యకర్తలకు ఆయన ఇచ్చిన మార్గదర్శనం సత్తా చాటిందని మోదీ ప్రశంసించారు. 

ప్రజలే దేవుళ్లు.. 
బెంగాల్, అస్సాం, తమిళనాడు, పుదుచ్చేరి, కేరళ రాష్ట్రాల ప్రజలకు, బీజేపీ కార్యకర్తలకు మోదీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. మహారాష్ట్ర, గుజరాత్, నాగాలాండ్, త్రిపుర ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులకు పట్టం కట్టిన ప్రజలకు సైతం కృతజ్ఞతలు చెప్పారు. రాజకీయాల్లో గెలుపోటములు సహజమే అయినా, ‘మదర్‌ ఆఫ్‌ డెమోక్రసీ’కి భారత్‌ ఎందుకు మాతృభూమిగా ఉందో ఈ ఐదు రాష్ట్రాల ఎన్నికలు ప్రపంచానికి చాటిచెప్పాయన్నారు. గతేడాది బిహార్‌ ఎన్నికల సమయంలో గంగోత్రి నుంచి గంగాసాగర్‌ వరకు ఎన్డీఏ ప్రభంజనం విస్తరిస్తుందని తాను చెప్పిన మాటలు నేడు నిజమయ్యాయని చెప్పారు. గంగామాతతోపాటు బ్రహ్మపుత్ర, కామాఖ్యా మాతల ఆశీర్వాదం తమపై మెండుగా ఉందన్నారు. అందుకే అస్సాం చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా బీజేపీకి హ్యాట్రిక్‌ విజయం సాధ్యమైందన్నారు. పుదుచ్చేరిలో గత ఐదేళ్లలో ఎన్డీఏ అమలు చేసిన విజన్‌కు ప్రజలు సంపూర్ణ మద్దతు ఇ చ్చారన్నారు. ప్రస్తుతం దేశంలో 23 రాష్ట్రాల్లో ఎన్డీఏ ప్రభుత్వాలు ఉన్నాయని, ‘నాగరిక్‌ దేవో భవ’(ప్రజలే దేవుళ్లు) అనే మంత్రంతో తాము పనిచేస్తున్నామని స్పష్టం చేశారు.  

శ్యామాప్రసాద్‌ కల సాకారం 
పశ్చిమ బెంగాల్‌ను భారత్‌లో అంతర్భాగంగా ఉంచేందుకు డాక్టర్‌ శ్యామాప్రసాద్‌ ముఖర్జీ తన జీవితాన్ని ధారపోశారని మోదీ గుర్తుచేశారు. 1951లో ‘దేశం కోసం జీవించాలి, దేశం కోసం మరణించాలి’అన్న ఆశయంతో ఆయన ప్రారంభించిన ప్రస్థానం, నేటి చారిత్రక విజయంతో ఆయన కల సాకారమైందన్నారు. బెంగాల్‌ చరిత్రలో కొత్త అధ్యాయం మొదలైందని, నేటి నుంచి భయం నుంచి విముక్తి పొందిందని ‘బాంగ్లాయ్‌ పోరిబోర్తన్‌ హోయే గెచే’(బెంగాల్‌లో మార్పు వచ్చేసింది) అని నినదించారు. వందేమాతరం 150వ వసంతంలో భరతమాతకు, బంకించంద్ర ఛటర్జీకి, అరవిందుడికీ బెంగాల్‌ ఓటర్లు చారిత్రక నివాళి అర్పించారన్నారు. ఇకపై అభివృద్ధి, విశ్వాసం, కొత్త ఆశలు బెంగాల్‌లో అడుగులో అడుగు వేసుకుంటూ నడుస్తాయన్నారు. యువతకు ఉద్యోగాలు, మహిళలకు పూర్తి రక్షణ కల్పిస్తామన్నారు. రాష్ట్రంలో చొరబాటుదారుల ఆటకట్టిస్తామని, చట్టవ్యతిరేక కార్యకలాపాలపై ఉక్కుపాదం మోపుతామని హెచ్చరించారు. బీజేపీ ప్రభుత్వం తొలి కేబినెట్‌లోనే పేదలకు ఉచిత వైద్యం అందించే ‘ఆయుష్మాన్‌ భారత్‌’పథకానికి పచ్చజెండా ఊపుతామని స్పష్టం చేశారు.  

అంగ్, బంగ్, కలింగ్‌...
ప్రపంచవ్యాప్తంగా ఒకవైపు యుద్ధ సైరన్లు మోగుతూ, అస్థిరత, అరాచకం రాజ్యమేలుతున్న తరుణంలో, పశ్చిమాసియా సంక్షోభం వెంటాడుతున్నా.. భారత ప్రజలు మాత్రం స్థిరత్వం కోసం ఓటు వేశారని మోదీ విశ్లేషించారు. వికసిత భారత్‌ లక్ష్యంగా దేశం ఏకతాటిపై నిలబడి సంక్షోభాలను సమర్థంగా ఎదుర్కొంటోందని చెప్పారు. ప్రాచీన భారతదేశంలో అంగ్‌ (బిహార్‌), బంగ్‌ (బెంగాల్‌), కలింగ్‌ (ఒడిశా) రాష్ట్రాలు ఆర్థిక, రాజకీయ, వాణిజ్య మూలస్తంభాలుగా ఉండేవని గుర్తుచేశారు. ఆసియా ఖండం మొత్తం కళింగ ఓడరేవుల ద్వారా వాణిజ్యం సాగేదని, బెంగాల్‌ సాంస్కృతిక కేంద్రంగా ఉండేదని గుర్తుచేశారు. బానిసత్వంలో ఆ స్తంభాలు బలహీనపడ్డాయని, ఇప్పుడు మళ్లీ ఆ మూడు ప్రాంతాల ప్రజలు బీజేపీని ఎంచుకోవడం ద్వారా వికసిత భారత్‌కు బాటలు వేస్తున్నారని మోదీ సంతోషం వ్యక్తం చేశారు.

మహిళా వ్యతిరేకులకు గుణపాఠం
పార్లమెంటులో మహిళా రిజర్వేషన్‌ బిల్లును అడ్డుకునేందుకు ప్రయత్నించిన రాజకీయ పక్షాలు మహిళల ఆగ్రహానికి గురికాక తప్పదని తాను ముందే హెచ్చరించానని గుర్తుచేశారు. అన్నట్లుగానే కాంగ్రెస్, టీఎంసీ, డీఎంకే ఆ ఆగ్రహాన్ని రుచి చూశాయన్నారు. మహిళా విరోధిగా ముద్రపడిన సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ)కి సైతం యూపీలో మహిళలు తగిన బుద్ధి చెబుతారని జోస్యం చెప్పారు. కేరళలో కమ్యూనిస్టుల పదేళ్ల దుష్పరిపాలనను ప్రజలు తిరస్కరించారని, అయితే వచ్చే ఎన్నికల్లో అక్కడ కాంగ్రెస్‌కు కూడా మహిళలు తగిన సమాధానం ఇస్తారన్నారు. నేడు దేశంలో ఒక్క రాష్ట్రంలో కూడా కమ్యూనిస్టు ప్రభుత్వం లేకపోవడం కేవలం రాజకీయ మార్పు కాదని, ప్రజల ఆలోచనా విధానంలో వచ్చిన భారీ మార్పు అని మోదీ విశ్లేషించారు. యావత్‌ ప్రపంచం, దేశం కమ్యూనిజాన్ని, అడవుల్లో అంతరించిపోతున్న మావోయిజాన్ని తిరస్కరించినప్పటికీ, కాంగ్రెస్‌ మాత్రం అదే భావజాలాన్ని అక్కున చేర్చుకుంటూ విపరీత దిశలో పయనిస్తోందని ధ్వజమెత్తారు. విపక్షాలవి కేవలం విభజన రాజకీయాలైతే, తమవి విశ్వాసం నింపే రాజకీయాలని వ్యాఖ్యానించారు. కుటుంబ, వారసత్వ రాజకీయాలకు కాలం చెల్లిందన్నారు.

మోదీపై చెక్కుచెదరని విశ్వాసం: నితిన్‌ నబిన్‌
12 ఏళ్ల సుదీర్ఘ పాలన తర్వాత కూడా ప్రధాని మోదీ నాయకత్వంపై, మోదీ గ్యారంటీపై ప్రజల్లో నమ్మకం ఏమాత్రం చెక్కుచెదరలేదనడానికి ఈ విజయాలే నిదర్శనమని బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్‌ నబిన్‌ అన్నారు. శ్యామాప్రసాద్‌ ముఖర్జీ జన్మభూమి అయిన బెంగాల్‌ను మోదీ బీజేపీ మయం చేశారని కొనియాడారు. విజయోత్సవ సంబరాల అనంతరం మంగళవారం నుంచే బీజేపీ శ్రేణులు మళ్లీ రెట్టింపు ఉత్సాహంతో ప్రజాసేవలో, దేశ నిర్మాణంలో నిమగ్నమవుతాయని చెప్పారు. సమావేశం ప్రారంభంలో మోదీకి పూలమాల వేసి సత్కరించేందుకు నబిన్‌ ముందుకు రాగా, ఆ మాలను మోదీ ఆప్యాయంగా తిరిగి నబిన్‌ మెడలోనే వేసి నాయకుల పట్ల తనకున్న గౌరవాన్ని, నిరాడంబరతను చాటుకున్నారు.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement