సైనిక ఘర్షణలు సమస్యల్ని పరిష్కరించలేవు  | PM Narendra Modi Holds Bilateral Talks With Austrian Federal Chancellor | Sakshi
Sakshi News home page

సైనిక ఘర్షణలు సమస్యల్ని పరిష్కరించలేవు 

Apr 17 2026 5:06 AM | Updated on Apr 17 2026 6:15 AM

PM Narendra Modi Holds Bilateral Talks With Austrian Federal Chancellor

యుద్ధాలతో యావత్‌ ప్రపంచం కష్టాల్లో 

ఆస్ట్రియా చాన్స్‌లర్‌ స్టాకర్‌తో భేటీలో ప్రధాని మోదీ వ్యాఖ్య 

స్టాకర్‌తో విస్తృతస్థాయి ద్వైపాక్షిక చర్చలు

న్యూఢిల్లీ: పెను యుద్ధాల ధాటికి ప్రపంచదేశాలన్నీ ప్రతికూల ప్రభావాల బారిన పడుతున్నాయని ప్రధాని నరేంద్ర మోదీ ఆవేదన వ్యక్తంచేశారు. నాలుగు దశాబ్దాల తర్వాత తొలిసారిగా భారత్‌లో పర్యటనకు విచ్చేసిన ఆ్రస్టియా చాన్స్‌లర్‌ క్రిస్టియన్‌ స్టాకర్‌తో ప్రధాని మోదీ ద్వైపాక్షిక చర్చల సందర్భంగా సైనిక ఘర్షణల అంశం ప్రధానంగా ప్రస్తావనకు వచ్చింది. పశ్చిమాసియా పెను సంక్షోభం, ఉక్రెయిన్‌ యుద్ధం కారణంగా ప్రపంచార్థికంపై పడుతున్న ప్రతికూల ప్రభావాలను ఆస్ట్రియా, భారత్‌ సమష్టిగా సమర్థవంతంగా ఎదుర్కోబోతున్నాయని ఇరునేతలు ప్రకటించారు. 

నాలుగు రోజుల పర్యటనలో భాగంగా మంగళవారం స్టాకర్‌ ఢిల్లీకి చేరుకున్న విషయం విదితమే. యూరప్‌బయట స్టాకర్‌ తొలి అధికారిక పర్యటన ఇదే కావడం విశేషం. గురువారం ఢిల్లీలో మోదీతో స్టాకర్‌ పలు కీలకాంశాలపై ద్వైపాక్షిక చర్చలు జరిపారు. ‘‘సైనిక చర్యలు, ఘర్షణలు సమస్యలకు పరిష్కారం చూపలేవు. ఉక్రెయిన్‌లో కావొచ్చు, పశ్చిమాసియాలో కావొచ్చు మేం ఎల్లప్పుడూ దృఢ, సుస్థిర, శాశ్వత శాంతినే కాంక్షిస్తున్నాం. అంతర్జాతీయ సవాళ్లకు పరిష్కారాలు చూపేలా ఐక్యరాజ్య సమితి వంటి అంతర్జాతీయ కూటముల్లో భారీ సంస్కరణలు అత్యావశ్యకం. సమష్టిగా ఉగ్రవాదాన్ని రూపుమాపుదాం’’అని మోదీ అన్నారు. 

ఆరు ఒప్పందాలు ఖరారు 
భేటీ సందర్భంగా ఇరుదేశాల మధ్య కీలక రంగాలకు సంబంధించి ఆరు ఒప్పందాలు ఖరారయ్యాయి. ఇరుదేశాల మధ్య భారీ పెట్టుబడుల ప్రవాహం సాకారమయ్యేలా ఫాస్ట్‌ ట్రాక్‌ మెకానిజంను ఏర్పాటుచేయాలని నిర్ణయించారు. సైనికాంశాల్లోనూ సహకారంపై మరో ఒప్పందం కుదిరింది. జనవరిలో కుదిరిన ఇండియా–యూరోపియన్‌ యూనియన్‌ రక్షణ, భద్రతా భాగస్వామ్యంలో సహకారాన్ని మరింత ప్రోత్సహించుకోవాలని ఇరుదేశాలు నిర్ణయించాయి. ఉగ్రవ్యతిరేక కార్యకలాపాలను ఉమ్మడిగా నిర్వహించేందుకు వీలుగా ఒక సంయుక్త నిర్వహణ బృందాన్ని ఏర్పాటుచేయాలని ఇరునేతలు ఏకాభిప్రాయానికి వచ్చారు. ‘‘భారత్‌–ఈయూ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందంతో భారత్‌–ఆ్రస్టియాల మధ్య ఆర్థికవ్యవహారాలు మరింత ఊపందుకోనున్నాయి. ద్వైపాక్షిక వాణిజ్యం సైతం మెరుగుపడుతోంది’’అని స్టాకర్‌ అన్నారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement