స్కూల్ బడ్జెట్, అభివృద్ధిపై వారిదే తుది నిర్ణయం
కేంద్రం నిర్ణయం..
త్వరలోనే దేశవ్యాప్తంగా అమలు
15 లక్షల ప్రభుత్వ స్కూళ్ల నిర్వహణలో పెను మార్పులు
సాక్షి, న్యూఢిల్లీ: ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు మార్చే దిశగా కేంద్ర ప్రభుత్వం చరిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. దేశవ్యాప్తంగా 15 లక్షల ప్రభుత్వ స్కూళ్ల నిర్వహణ, బడ్జెట్ బాధ్యతలను ఇకపై నేరుగా విద్యార్థుల తల్లిదండ్రులకే అప్పగించనుంది. బడులను కేవలం ప్రభుత్వ సంస్థలుగానే కాకుండా సామాజిక ఆస్తులుగా అభివృద్ధి చేయడమే ఈ విధానం లక్ష్యం. జాతీయ విద్యా విధానం(ఈఎన్‌సీ)–2020, విద్యా హక్కు చట్టం(ఆర్‌టీఈ)–2009 ఆధారంగా విద్యాశాఖ రూపొందించిన కొత్త మార్గదర్శకాలు మే 2026 నుంచి అమల్లోకి రానున్నాయి.
చెక్‌బుక్ పవర్
కొత్తగా తీసుకొచ్చిన అతిపెద్ద మార్పు చెక్‌బుక్ పవర్. ఇకపై ప్రధానోపాధ్యాయుడు, స్కూల్ మేనేజ్‌మెంట్ కమిటీ (ఎస్‌ఎంసీ) అధ్యక్షుడు (తల్లిదండ్రుల్లో ఒకరు) పేరిట స్కూలుకు ఉమ్మడి బ్యాంకు ఖాతా ఉంటుంది. తల్లిదండ్రుల అనుమతి లేకుండా నిధులను వాడటం సాధ్యం కాదు. పాఠశాలలో రూ.30 లక్షల లోపు నిర్మాణ పనులను పబ్లిక్ వర్క్స్ డిపార్ట్‌మెంట్ (పీడబ్ల్యూడీ) అనుమతి లేకుండానే ఎస్‌ఎంసీలు నేరుగా చేపట్టవచ్చు. ప్రైవేట్ కంపెనీల నుంచి కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ నిధులను సేకరించేందుకు కూడా అనుమతి కల్పించారు.
ప్రతి పైసాకు లెక్క చెప్పాల్సిందే
నిధుల వినియోగంలో పారదర్శకత సాధించేందుకు ప్రభుత్వ ఆడిట్‌తో పాటు వార్షిక సోషల్ ఆడిట్‌ను తప్పనిసరి చేశారు. స్కూల్‌కు వచ్చే ప్రతి పైసా ఖర్చుల వివరాలను పబ్లిక్ నోటీస్ బోర్డుపై బహిరంగంగా ప్రదర్శించాలి. జీరో టాలరెన్స్ విధానాన్ని పాటిస్తూ, ఏవైనా అవకతవకలు జరిగితే పోలీస్, ఆరోగ్య శాఖలతో కలిసి నేరుగా చర్యలు తీసుకునే అధికారం ఎస్‌ఎంసీకి ఇచ్చారు.
కమిటీ స్వరూపం ఇదీ
→ 75% తల్లిదండ్రులే: కమిటీలోని మొత్తం సభ్యులలో మూడు వంతుల మంది విద్యార్థుల తల్లిదండ్రులే ఉంటారు.
→ 50% మహిళలు: కమిటీలో సగం మంది సభ్యులు తప్పనిసరిగా మహిళలే అయి ఉండాలి.
→ 25% ఇతర సభ్యులు: పాఠశాల ఉపాధ్యాయులు, స్థానిక కౌన్సిలర్ లేదా పంచాయతీ సభ్యులు, పూర్వ విద్యార్థులు, స్థానిక విద్యావేత్తలు మిగతా పావు శాతం ఉంటారు.
→ పదవీకాలం: ఈ కమిటీని రెండేళ్ల కాలవ్యవధికి ఎన్నుకుంటారు. ప్రతి నెలా విధిగా ఒకసారి సమావేశమవ్వాలి.


