NEET UG 2021: ర్యాంక్‌ సాధించే మార్గం!

NEET UG 2021: Subject Wise Preparation Tips To Get Best Score, Rank in Telugu - Sakshi

ఆగస్ట్‌ 1వ తేదీన నీట్‌–యూజీ–2021

జాతీయ స్థాయిలో వైద్య కోర్సుల్లో ప్రవేశాలకు మార్గం నీట్‌ స్కోర్‌

ఇప్పటి నుంచే సీరియస్‌ ప్రిపరేషన్‌ ప్రారంభించాలంటున్న నిపుణులు

నేషనల్‌ ఎలిజిబిలిటీ కమ్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌–అండర్‌ గ్రాడ్యుయేట్‌.. సంక్షిప్తంగా.. నీట్‌–యూజీ! జాతీయ స్థాయిలో.. సెంట్రల్‌ యూనివర్సిటీలు, స్టేట్‌ యూనివర్సిటీలు, ఇతర అన్ని మెడికల్‌ ఇన్‌స్టిట్యూట్స్‌లో.. ఎంబీబీఎస్, బీడీఎస్‌లతోపాటు ఆయుష్‌ కోర్సుల్లో చేరాలంటే.. నీట్‌–యూజీ ఎంట్రన్స్‌లో స్కోరే ప్రధానం! నీట్‌లో సాధించిన స్కోర్‌ ఆధారంగానే మెడికల్‌ కోర్సుల్లో ప్రవేశం కల్పిస్తారు. అందుకే.. ఇంటర్మీడియెట్‌ బైపీసీ అర్హతగా నిర్వహించే ఈ పరీక్షకు.. ఏటేటా పోటీ పెరుగుతోంది. నీట్‌–యూజీ–2021 తేదీని నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ అధికారికంగా ప్రకటించింది. ఆగస్ట్‌ 1వ తేదీన ఈ పరీక్ష జరుగుతుందని పేర్కొంది. ఈ నేపథ్యంలో.. నీట్‌–యూజీ 2021 విధి విధానాలు.. పరీక్ష ప్యాట్రన్‌.. ఈ టెస్ట్‌లో మంచి స్కోర్‌ సాధించడానికి నిపుణుల సలహాలు..

ఎంబీబీఎస్, బీడీఎస్‌.. దేశంలో లక్షల మంది విద్యార్థుల కల. తమ డాక్టర్‌ కలను సాకారం చేసుకునే దిశగా.. నీట్‌ యూజీలో ర్యాంకు సాధిం చేందుకు ఇంటర్‌ తొలిరోజు నుంచే కృషి చేస్తుంటారు. ఇంతటి కీలకమైన నీట్‌–యూజీ –2021 తేదీని నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ(ఎన్‌టీఏ) ఇటీవల వెల్లడించింది. దీంతో విద్యార్థులు ఈ పరీక్షలో స్కోర్‌ సాధించే దిశగా కసరత్తు ముమ్మరం చేయాల్సిన సమయం ఆసన్నమైందని చెప్పొచ్చు. 

మొత్తం పదకొండు భాషలు
నీట్‌–యూజీని తెలుగు సహా మొత్తం పదకొండు భాషల్లో నిర్వహించనున్నట్లు నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ స్పష్టం చేసింది. విద్యార్థులు దరఖాస్తు సమ యంలోనే తమకు ఆసక్తి ఉన్న భాషను ఎంచు కుంటే.. ఆ భాషలోనే పరీక్ష పేపర్‌ను అందిస్తారు. 

ఒక్కసారే.. ఆఫ్‌లైన్‌లోనే
నీట్‌ను కూడా జేఈఈ మెయిన్‌ మాదిరిగానే ఒకటి కంటే ఎక్కువసార్లు నిర్వహించే అవకాశముందనే వార్తలు ఇటీవల వినిపించాయి. వీటన్నింటికీ ఫుల్‌స్టాప్‌ పెడుతూ.. గతేడాది మాదిరిగానే నీట్‌ ఈ ఏడాది ఒక్కసారి మాత్రమే జరుగుతుందని ఎన్‌టీఏ స్పష్టం చేసింది. అది కూడా ఆఫ్‌లైన్‌ విధా నంలో పెన్‌ పేపర్‌ పద్ధతిలో నిర్వహించనున్న ట్లు పేర్కొంది. దీంతో విద్యార్థులకు పరీక్ష నిర్వహణపై ఒక స్పష్టత వచ్చింది. కాబట్టి ఇప్పుడిక ఎలాంటి ఆందోళన లేకుండా.. పూర్తిగా ప్రిపరేషన్‌కు ఉప క్రమించాలని నిపుణులు సూచిస్తున్నారు.

180 ప్రశ్నలు.. 720 మార్కులు
నీట్‌ యూజీకి అర్హత ఇంటర్మీడియెట్‌ బైపీసీ. ఈ పరీక్ష మొత్తం మూడు విభాగాల్లో 180 ప్రశ్నలకు ఆబ్జెక్టివ్‌ (బహుళైచ్ఛిక ప్రశ్నలు) విధానంలో జరుగుతుంది.  ఒక్కో ప్రశ్నకు నాలుగు మార్కులు చొప్పున 720 మార్కులకు నీట్‌ పరీక్ష ఉంటుంది. వివరాలు..

సిలబస్‌ కుదింపు కష్టమే
కొవిడ్‌ కారణంగా ఇంటర్మీడియెట్, సీబీఎస్‌ఈ +2 స్థాయిలో సిలబస్‌ను తగ్గించిన సంగతి తెలిసిందే. దాంతో నీట్‌ సిలబస్‌ను కూడా కుదిస్తారా? అనే సందేహం విద్యార్థుల్లో వ్యక్తమవుతోంది. కాని నీట్‌ సిలబస్‌ గతేడాది మాదిరిగానే యథాతథంగా ఉంటుందని, ఎలాంటి మార్పులు ఉండవని కొన్ని రోజుల క్రితం కేంద్ర విద్యా శాఖ మంత్రి ట్వీట్‌ ద్వారా తెలిపారు.  జేఈఈ–మెయిన్‌ మాదిరిగానే నీట్‌లోనూ ఛాయిస్‌ విధానం ఉంటుందా అనే వాదన కూడా వినిపిస్తోంది. దీనిపైనా మరో వారం రోజుల్లో స్పష్టత వచ్చే అవకాశం ఉంది.

అవగాహన ముఖ్యం
నీట్‌–యూజీ–2021కు తేదీ వెల్లడైంది. కాబట్టి ఇప్పటి నుంచి అందుబాటులో ఉన్న సమయాన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకోవాలి. ఇంటర్‌ పరీక్షల ప్రిపరేషన్‌తో సమన్వయం చేసుకుంటూ.. నిర్దిష్ట ప్రణాళికతో ముందుకు సాగాల్సి ఉంటుంది. తొలుత అభ్యర్థులు నీట్‌ సిలబస్‌పై పూర్తి స్థాయి అవగాహన తెచ్చుకోవాలి. ఆ తర్వాతే ప్రిపరేషన్‌కు ఉపక్రమించాలి. సిలబస్‌లో పేర్కొన్న దానికి అదనంగా ఇతర అంశాలను చదవాల్సిన అవసరం లేదు. నీట్, బోర్డ్‌ సిలబస్‌లో కొన్ని కామన్‌ టాపిక్స్‌ ఉంటాయి. ఆయా అంశాలను మొదట బోర్డు ఎగ్జామ్స్‌ కోణంలో ప్రిపేరవ్వాలి. దీనివల్ల ఎంతో విలువైన సమయం ఆదా అవుతుంది. 

టైమ్‌ ప్లాన్‌ కూడా
► నీట్‌ విద్యార్థులు ఆయా సబ్జెక్టుల ప్రిపరేషన్‌ కోసం ముందుగానే నిర్దిష్ట సమయ ప్రణాళికను రూపొందించుకోవాలి. దానికి కట్టుబడి ప్రిపరేషన్‌ సాగించాలి. 
► ప్రిపరేషన్‌ టైమ్‌ టేబుల్‌ను తప్పనిసరిగా  ఏరోజుకారోజు అనుసరించాలి. 
► నీట్‌ సిలబస్‌కు అనుగుణంగా ఆయా సబ్జెక్ట్‌లకు కేటాయించాల్సిన సమయాన్ని నిర్దేశించుకోవాలి. 
► నిర్దిష్ట సమయంలో సిలబస్‌ను పూర్తి చేసేలా ముందుకు కదలాలి. 
► ఈ సమయంలో అభ్యర్థులంతా స్వీయ సామర్థ్యాలపై స్పష్టతతో వ్యవహరించాలి.
► ప్రతి సబ్జెక్టుకూ సమానంగా సమయం కేటాయించుకోవాలి. 
► ప్రతి రోజు చదవాల్సిన టాపిక్స్‌ను ముందుగానే విభజించుకుని.. దానికి అనుగుణంగా అధ్యయనం చేయాలి. 
► ప్రతి రోజు మాక్‌ టెస్టులకు హాజరవ్వాలి. ఫలితంగా స్వీయ సామర్థ్యాలపై అవగాహన వస్తుంది. ఇంకా ఏఏ సబ్జెక్ట్‌లలో పట్టు సాధించాలనే దానిపై స్పష్టత లభిస్తుంది. 
► సబ్జెక్ట్‌ పరంగా బలహీనంగా ఉన్న అంశాలపై ప్రత్యేకంగా దృష్టిపెట్టాలి. 
► పరీక్షకు రెండు నెలల ముందు కొత్త చాప్టర్లు, అంశాల జోలికి వెళ్లకూడదు.  ఈ సమయాన్ని పూర్తిగా రివిజన్‌కే కేటాయించాలి.
► మోడల్‌ ప్రశ్న పత్రాలను ప్రాక్టీస్‌ చేయాలి. 
► డైరెక్ట్‌ కొశ్చన్స్‌ కంటే ఇన్‌ డైరెక్ట్‌ కొశ్చన్స్‌నే ఎక్కువ అడుగుతున్న విషయాన్ని గుర్తించాలి. దీనికి అనుగుణంగా మోడల్‌ టెస్ట్‌లను వీలైనంత ఎక్కువగా ప్రాక్టీస్‌ చేయాలి. 
► ఇంటర్‌ పరీక్షలకు నెల రోజుల ముందు వరకు నీట్‌ ప్రిపరేషన్‌ను సమాంతరంగా కొనసాగించొచ్చు. 
► ఇంటర్మీడియెట్‌ పరీక్షలకు నెల రోజుల ముందు నుంచి పూర్తిగా బోర్డ్‌ పరీక్షలకే సమయం కేటాయించాలి.
► ఇంటర్మీడియెట్‌ పరీక్షలు పూర్తయ్యాక.. తిరిగి నీట్‌కు పూర్తిస్థాయిలో ప్రిపరేషన్‌ సాగించాలి.
► ప్రిపరేషన్‌ సమయంలోనే షార్ట్‌ నోట్స్‌ రూపొందించుకోవాలి. ఇది రివిజన్‌కు ఎంతో ఉపయుక్తంగా ఉంటుంది. 

సబ్జెక్టుల వారీగా నిపుణుల ప్రిపరేషన్‌ టిప్స్‌

ఫిజిక్స్‌.. ఈ టాపిక్స్‌ ప్రధానం
నీట్‌ ఫిజిక్స్‌ విభాగంలో మంచి స్కోర్‌ సాధించాలంటే.. ఆప్టిక్స్, మెకానిక్స్, హీట్‌ అండ్‌ థర్మోడైనమిక్స్, ఎలక్ట్రానిక్‌ డివైజెస్, కరెంట్‌ ఎలక్ట్రిసిటీ, మోడరన్‌ ఫిజిక్స్‌ చాప్టర్లపై ప్రత్యేక దృష్టిపెట్టాలి. ఎన్‌సీఈఆర్‌టీ పుస్తకాల్లో అధ్యాయానికి చివర ఇచ్చిన ప్రశ్నలను సాధించాలి. అవకలనం, సమాకలనం అనువర్తనాలపై పట్టు సాధించాలి. ఇంటర్‌ రెండేళ్ల పాఠ్యాంశాలకు సమాన ప్రాధాన్యం ఇవ్వాలి. పైన పేర్కొన్న చాప్టర్లతోపాటు మిగిలిన సిలబస్‌ అంశాలను అధ్యయనం చేయాలి. గత రెండేళ్ల ప్రశ్నల సరళిని పరిశీలిస్తే.. రొటేషనల్‌ డైనమిక్స్, సిగ్మా పార్టికల్స్‌పై ఎక్కువగా దృష్టిపెట్టాలని అర్థం అవుతోంది.  అదేవిధంగా ఎలక్ట్రోమ్యాగ్నటిజం, ఇండక్షన్, కరెంట్‌ ఎలక్ట్రిసిటీ వంటి చాప్టర్లు విద్యార్థులకు అంత త్వరగా ఎక్కవు. వీటిని చదవడంతోపాటు ప్రాక్టీస్‌కు ప్రాధాన్యం ఇవ్వాలని గుర్తించాలి. 
- ఎన్‌.నరసింహమూర్తి, సబ్జెక్ట్‌ నిపుణులు

కెమిస్ట్రీ.. పునశ్చరణ
జనరల్‌ ఆర్గానిక్‌ కెమిస్ట్రీ, మోల్‌ కాన్సెప్ట్, కెమికల్‌ బాండింగ్, ఎలక్ట్రోకెమిస్ట్రీ,  కోఆర్డినేషన్‌ కాంపౌండ్, ఈక్విలిబ్రియమ్, పాలిమర్‌లు, బయో మాలిక్యూల్స్, పరమాణు నిర్మాణం, సాలిడ్‌ స్టేట్, ద్రావణాలు, సర్ఫేజ్‌ కెమిస్ట్రీ తదితరాలను కెమిస్ట్రీలో కీలక పాఠ్యాంశాలుగా పేర్కొవచ్చు. ఆర్గానిక్‌ కెమిస్ట్రీలో.. ఐసోమెరిసమ్, సమ్మేళనాల తయారీ, ధర్మాలపై ఎక్కువగా ప్రశ్నలు వస్తున్నాయి. కెమిస్ట్రీలో విద్యార్థులు చర్యలు, సమీకరణాలను మర్చిపోతుంటారు. కాబట్టి వాటిని ఎప్పటికప్పుడు పునఃశ్చరణ చేయాలి. ఇనార్గానిక్‌ కెమిస్ట్రీలో.. వివిధ మూలకాలు, వాటి సమ్మేళనాల ధర్మాలను అధ్యయనం చేయాలి.  కెమిస్ట్రీలో.. ఫిజికల్, ఆర్గానిక్, ఇనార్గానిక్‌ కెమిస్ట్రీలను వాటి వాటి స్వభావాల ఆధారంగా ప్రిపేరవ్వాలి. ఫిజికల్‌ కెమిస్ట్రీ విషయానికొస్తే... ఇందులో ఫార్ములాలతో సొంత నోట్స్‌ రూపొందిం చుకోవాలి. ఫలితంగా ఫార్ములాను అన్వయించే నైపుణ్యాలు సొంతమవుతాయి. పీరియాడిక్‌ టేబుల్‌పై పట్టు సాధిస్తే.. ఇనార్గానిక్‌ కెమిస్ట్రీలో మంచి మార్కులు సాధించొచ్చు. పునశ్చరణ చేస్తూ, మాదిరి ప్రశ్నలు సాధించడం ద్వారా.. పరీక్షకు కావల్సిన సన్నద్ధత లభిస్తుంది. 
- విజయ్‌ కిశోర్, కెమిస్ట్రీ సబ్జెక్ట్‌ నిపుణులు

బయాలజీ.. కాన్సెప్ట్‌లపై పట్టు
నీట్‌–యూజీ పరీక్షలో కీలకంగా భావించే విభాగంగా బయాలజీని పేర్కొనొచ్చు. ఇంటర్‌ బైపీసీ విద్యార్థులు ఫిజిక్స్, కెమిస్ట్రీ కంటే బయాలజీపై ఎక్కువ పట్టు కలిగి ఉంటారు. నీట్‌ బయాలజీలో రాణించాలంటే.. ఫిజియాలజీ ఆఫ్‌ ప్లాంట్స్‌ అండ్‌ యానిమల్స్, మార్ఫాలజీ, జెనిటిక్స్‌ అండ్‌ ఎవల్యూషన్, సెల్‌ బయాలజీ, బయోటెక్నాలజీ, హ్యూమన్‌ ఫిజియాలజీ, డైవర్సిటీ ఆఫ్‌ లివింగ్‌ ఆర్గానిజమ్‌లను ముఖ్య చాప్టర్లుగా భావించి చదవాలి. అన్ని అంశాలకు సంబంధించి కాన్సెప్ట్ట్‌లపై పట్టు సాధించాలి. ఎకాలజీలో ఆర్గనైజేషన్స్‌ అండ్‌ పాపులేషన్, ఎకోసిస్టమ్‌పై ప్రశ్నలు వస్తున్నాయి. వీటితోపాటు బయోడైవర్సిటీ, ఎన్విరాన్‌మెంట్‌ ఇష్యూస్‌ పాఠ్యాంశాలపై ఫోకస్‌ చేయడం లాభిస్తుంది. ప్లాంట్‌ ఫిజియాలజీలో.. ప్లాంట్‌ గ్రోత్‌ అండ్‌ డెవలప్‌మెంట్, మొక్కల హార్మోనులు, ట్రాన్స్‌పోర్ట్‌ ఇన్‌ ప్లాంట్స్, మినరల్‌ న్యూట్రిషన్‌ చాప్టర్లను ప్రిపేరవ్వాలి. సెల్‌ స్ట్రక్చర్స్‌ అండ్‌ ఫంక్షన్స్‌లో కణ విభజన(సమ విభజన, క్షయకరణ విభజన)లోని వివిధ దశల్లో జరిగే మార్పులు, కణచక్రం తదితరాలను అధ్యయనం చేయాలి. బయోమాలిక్యూల్స్‌ నుంచి కంటెంట్‌ సంబంధిత ప్రశ్నలు వస్తాయి. రీప్రొడక్షన్‌ నుంచి దాదాపు 10 ప్రశ్నల వరకు అడుగుతున్నారు. మానవ ప్రత్యుత్పత్తి వ్యవస్థను బాగా అధ్యయనం చేయాలి. మాలిక్యులర్‌ బేసిస్‌ ఆఫ్‌ ఇన్‌హెరిటన్స్‌లో రెప్లికేషన్, ట్రాన్‌స్క్రిప్షన్, ట్రాన్స్‌లేషన్, రెగ్యులేషన్‌లపై దృష్టిపెట్టాలి. నీట్‌లో ఇంటర్‌ సిలబస్‌లో లేని అంశాలను గుర్తించి.. వాటికోసం ప్రత్యేక సమయం కేటాయించాలి.
- బి.రాజేంద్ర, బోటనీ సబ్జెక్ట్‌ నిపుణులు

జువాలజీలో ఇలా
జువాలజీలో గత రెండేళ్ల ప్రశ్న పత్రాలను పరిగణనలోకి తీసుకుంటే..  మొత్తం 45 ప్రశ్నల్లో హ్యూమన్‌ ఫిజియాలజీ నుంచి 14, ఎకాలజీ నుంచి 10–12, జెనిటిక్స్, ఎవల్యూషన్‌ కలిపి 6 ప్రశ్నలు వరకు వస్తున్నాయి. కాబట్టి విద్యార్థులు ఆయా పాఠ్యాంశాలపై ప్రత్యేక దృష్టిపెట్టాలి. ఎన్‌సీఈఆర్‌టీతోపాటు ఇంటర్‌ పుస్తకాల నుంచీ ప్రశ్నలు అడుగుతున్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకుని గత ప్రశ్న పత్రాలను, ఇంటర్‌లో ఆయా చాప్టర్స్‌ చివరలో అడిగే ప్రశ్నలను సాధన చేయాలి. ఎన్‌సీఈఆర్‌టీ, ఇంటర్‌ పుస్తకాలను క్షుణ్నంగా చదవాలి. ఇలా చేస్తే ఆశించిన ర్యాంకు సొంతమవడం ఖాయం.
- కె.శ్రీనివాస్, జువాలజీ సబ్జెక్ట్‌ నిపుణులు

అనలిటికల్‌ అప్రోచ్‌తో ఎంతో మేలు
నీట్‌ ప్రిపరేషన్‌ క్రమంలో అనలిటికల్‌ అప్రోచ్‌తో సాగితే..ఎలాంటి ప్రశ్నలకైనా సమాధానం ఇచ్చే సంసిద్ధత లభిస్తుంది. ప్రతి రోజు తాము చదివిన అంశాలతో షార్ట్‌ నోట్స్‌ రూపొందించుకోవడం, ఇన్‌స్టిట్యూట్‌లు నిర్వహించే వీక్లీ టెస్ట్‌లు, మోడల్‌ టెస్ట్‌లకు హాజరు కావడం కూడా ఎంతో మేలు చేస్తుంది. 
– అనంత పరాక్రమ్‌ భార్గవ్, నీట్‌–2020 11వ ర్యాంకు

నీట్‌–యూజీ(2021) సమాచారం
► నీట్‌ పరీక్ష తేదీ: ఆగస్ట్‌ 1, 2021
► పరీక్ష వ్యవధి: మూడు గంటలు(పెన్, పేపర్‌ విధానంలో)
► అర్హత: బైపీసీ గ్రూప్‌తో ఇంటర్మీడియెట్‌ తత్సమాన కోర్సులు ఉత్తీర్ణులై ఉండాలి. ద్వితీయ సంవత్సరం విద్యార్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. 
► నీట్‌కు బైపీసీతో ఉత్తీర్ణత అని పేర్కొన్నప్పటికీ.. ప్రవేశాల సమయంలో కొన్ని ఇన్‌స్టిట్యూట్‌లు బైపీసీ గ్రూప్‌ సబ్జెక్ట్‌లలో 50 శాతం మార్కులు పొంది ఉండాలనే నిబంధన విధిస్తున్నాయి.
► వయో పరిమితి: కనిష్ట వయోపరిమితి 17 ఏళ్లు, గరిష్ట వయో పరిమితి 25 ఏళ్లు.
► దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి.
► పూర్తి నోటిఫికేషన్‌ ఏప్రిల్‌ మొదటి వారంలో వెల్లడయ్యే అవకాశం ఉంది. 
► పూర్తి వివరాలకు వెబ్‌సైట్స్‌: https://ntaneet.nic.in, https://nta.ac.in

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top