దక్షిణ భారతదేశంలో తొలిసారి.. | Monkey Fertility Control Center Establishing In Nirmal | Sakshi
Sakshi News home page

ఇక కోతులకూ కు.ని.

Dec 7 2020 8:02 AM | Updated on Dec 7 2020 8:06 AM

Monkey Fertility Control Center Establishing In Nirmal - Sakshi

చించోలి(బి) సమీపంలోని హరితవనంలో నిర్మించిన ఎంఆర్‌ఆర్‌సీ 

సాక్షి, నిర్మల్ ‌: కనిపించిన చెట్టునల్లా మనిషి నరుక్కుంటూ పోవడంతో వానరానికి తీరని కష్టమొచ్చింది. వనాలు అంతరించి పోతుండటంతో అవి జనాల్లోకి వచ్చాయి. ఒకప్పుడు పచ్చని చెట్లపై.. నచ్చిన పండ్లు తింటూ అడవుల్లో హాయిగా బతికిన కోతులు.. ఇప్పుడు ఇళ్ల ముందు పడేసిన ఎంగిలి మెతుకులను ఏరుకుని తింటున్నాయి. ఆకలికి తాళలేక కొన్నిచోట్ల ఇళ్లలోకి చొరబడుతున్నాయి. పంటచేలపైనా దాడి చేస్తున్నాయి. దీనిపై నాలుగేళ్ల క్రితమే రాష్ట్ర ప్రభుత్వం దృష్టిసారించింది. సాక్షాత్తు సీఎం కేసీఆర్‌ పలు సభలు, సమావేశాల్లో కోతుల వల్ల దెబ్బతింటున్న పంటలపైన మాట్లాడారు.

ఇల్లు పీకి పందిరి వేసినట్లే
అటవీశాఖ 2016లో నిర్మల్‌ జిల్లా సారంగపూర్‌ మండలంలోని చించోలి(బి) శివారులోని అటవీ ప్రాంతంలో పైలట్‌ ప్రాజెక్టుగా కోతుల సంతాన నియంత్రణ కేంద్రానికి స్థల నిర్ధారణ చేసింది. ఆ కేంద్రం ఎట్టకేలకు ఈ నెల 8న(మంగళవారం) రాష్ట్ర అటవీశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి చేతుల మీదుగా ప్రారంభం కానుంది. ఇది దక్షిణ భారత్‌లోనే తొలి కేంద్రం కానుంది. ఉమ్మడి జిల్లాల వారీగా చూస్తే.. ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం జిల్లాల్లో వీటి సంఖ్య విపరీతంగా ఉంది. ఒక్కో జిల్లాలో ప్రతీ సీజన్‌లో దాదాపు 200–300 ఎకరాల వరకు పంట నష్టం చేస్తున్నట్లు అంచనా వేస్తున్నారు. పెంకులు ఉన్న ఇంటిపై కోతులు పడ్డాయంటే ఇక ఇల్లు పీకి పందిరి వేసినట్లే. కూరగాయలు, పండ్ల తోటలకు కోతులతో మరింత నష్టం జరుగుతోంది.

దేశంలో రెండో రాష్ట్రం..
మన రాష్ట్రంలో ఉన్నట్లే దేశవ్యాప్తంగా చాలా రాష్ట్రాల్లో కోతుల సంఖ్య విపరీతంగా ఇబ్బంది పెడుతోంది. విరివిగా ఆపిల్‌పండ్లను పండించే హిమాచల్‌ప్రదేశ్‌లో వానరాలతో నష్టాలు పెరగడంతో అక్కడి ప్రభుత్వం వాటి సంతానోత్పత్తి నియంత్రణకు కేంద్రాలను ఏర్పాటు చేసింది. రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇదే విధానాన్ని అనుసరించాలని నిర్ణయించింది. నిర్మల్‌ జిల్లా కేంద్రానికి సమీపంలో సారంగపూర్‌ మండలం చించోలి(బి) వద్ద అటవీ ప్రాంతంలో 2016లో మంకీ రెస్క్యూ అండ్‌ రిహాబిలిటేషన్‌ సెంటర్‌(ఎంఆర్‌ఆర్‌సీ) ఏర్పాటుకు శంకుస్థాపన చేశారు. ఎట్టకేలకు ఈ ఏడాది పూర్తయ్యాయి.

కేంద్రంలో ఏర్పాట్లు ఇలా..
చించోలి(బి) వద్ద ఉన్న గండిరామన్న హరితవనంలో నిర్మించిన ఈ కేంద్రం లో ఒకేసారి 50 కోతులను ఉంచేలా ఎన్‌క్లోజర్స్‌ను ఏర్పాటు చేశారు. వారం పది రోజులుగా ట్రయల్స్‌లో భాగంగా 27 కోతులకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేశారు. ఆపరేషన్‌ చేసిన తర్వాత మూడు రోజుల వరకు కేంద్రంలో ఉంచి, మళ్లీ అటవీ ప్రాంతంలో వదిలేస్తారు. ప్రస్తుతానికి కోతులను ఇక్కడికి తీసుకురావాలి్సన బాధ్యత సంబంధిత గ్రామపంచాయతీలు, మున్సిపాలిటీలదే.

ట్రయల్స్‌ ప్రారంభించాం
ఇప్పటికే కోతుల ట్యూబెక్టమీ, వేసక్టమీ ఆపరేషన్‌ ట్రయల్స్‌ ప్రారంభించాం. రోజుకు ఆడ కోతులైతే 25–30 వరకు, మగ కోతులైతే 50 వరకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేయవచ్చు. మూడు రోజుల వరకు కేంద్రంలోనే ఉంచి, ఆ తర్వాత అటవీ ప్రాంతంలో వదిలివేయవచ్చు. ఈనెల 8న అధికారికంగా ప్రారంభమైన తర్వాత రోజూ ఆపరేషన్లు కొనసాగిస్తాం. 
– డాక్టర్‌ శ్రీకర్‌రాజు, 

ఏడాదికి రెండు కాన్పులు...
కోతులతో ఇబ్బందులు తగ్గాలంటే.. ముందుగా వాటి సంతతిని నియంత్రించాలని ప్రభుత్వం నిర్ణయించింది.  కోతుల గర్భధారణ కాలం (గర్భం నుంచి ప్రసవం వరకు) 164 రోజులు. అంటే సగటున ఐదు నెలలకో వానరం పుడుతోంది. మన ప్రాంతాల్లో నివసించే కోతుల జీవితకాలం 15–20 ఏళ్ల మధ్య ఉంటుంది. ఈ లెక్కన ఒక్కో ఆడ కోతి ఏడాదికి రెండు చొప్పున పిల్లలకు జన్మనిస్తూ పోతుండటంతో వాటి సంఖ్య విపరీతంగా పెరుగుతోంది.
వెటర్నరీ డాక్టర్, ఎంఆర్‌ఆర్‌సీ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement