కర్నాటక: బీజేపీకి ఊహించని షాక్‌.. జేడీఎస్‌లో చేరిన సీనియర్‌ నేత

MLC Ayanur Manjunath Quit BJP Party And Joined In JDS - Sakshi

బెంగళూరు: కర్నాటకలో అసెంబ్లీ ఎన్నికల వేళ రాజకీయ సమీకరణాలు శరవేగంగా మారుతున్నాయి. నేతలు ఒక పార్టీ నుంచి మరో పార్టీకి జంప్‌ చేస్తున్నారు. ఈ క్రమంలో అధికార బీజేపీకి వరుస షాక్‌లు తగులుతున్నాయి. తాజాగా బీజేపీ సీనియర్‌ నేత ఎమ్మెల్సీ అయనూర్‌ మంజునాథ్‌.. కాషాయ పార్టీకి రాజీనామా చేశారు. అనంతరం జేడీఎస్‌లో చేరారు. దీంతో, బీజేపీకి ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. 

వివరాల ‍ప్రకారం.. బీజేపీ సీనియర్‌ నేత ఎమ్మెల్సీ అయనూర్‌ మంజునాథ్‌ తన ఎమ్మెల్సీ పదవికి, పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి కూడా రాజీనామా చేశారు. అనంతరం, జేడీఎస్‌ నేత కుమారస్వామి ఆధ్వర్యంతో జేడీఎస్‌లో చేరారు. ఈ క్రమంలోనే తాను శివమొగ్గ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీలో నిలుస్తున్నట్టు వెల్లడించారు.  ఏప్రిల్‌ 20న ఒక పార్టీ తరఫున తాను నామినేషన్‌ వేస్తున్నట్లు తెలిపారు. ఇదిలా ఉండగా.. తన అభిమానులు, శ్రేయోభిలాషులతో చర్చించిన తర్వాతే తాను బీజేపీని వీడుతున్నట్టు వెల్లడించారు. అలాగే, తన నియోజకవర్గ ప్రజలు, నాయకుల కోరిక మేరకు ఎన్నికల్లో పోటీ చేయనున్నట్టు స్పష్టం చేశారు. 

కాగా, బీజేపీ ఇప్పటి వరకు ప్రకటించిన అభ్యర్థుల లిస్టులో అయనూర్‌ మంజునాథ్‌ పేరు లేదు. ఈ ఎన్నికల్లో ఆయనకు టికెట్‌ దక్కే అవకాశం లేకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇక, కర్ణాటక అసెంబ్లీలోని 224 స్థానాలకు గాను బీజేపీ ఇప్పటికే 222 సీట్లకు అభ్యర్థులను ప్రకటించింది. అయితే శివమొగ్గ, మాన్వి స్థానాల్లో ఎవరు పోటీలో ఉంటారనే విషయంపై ఇంకా ఎలాంటి ప్రకటన చేయలేదు.

మరోవైపు.. కర్నాటకలో అసెంబ్లీ ఎన్నికలకు అభ్యర్థులను ప్రకటించిన సమయం నుంచి బీజేపీకి వరుసగా వరుసగా ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. కమలం పార్టీకి ఇప్పటికే మాజీ సీఎం జగదీష్‌‌ షెట్టర్‌, లింగాయత్‌ సామాజిక వర్గానికి చెందిన ప్రముఖ నాయకుడు లక్ష్మణ్‌ సవదితోపాటు పలువురు నాయకులు రాజీనామా చేసిన విషయం తెలిసిందే. దీంతో, వీరి ప్రభావం బీజేపీపై ఎంతమేర పడనుందో​ ఎన్నికల ఫలితాల అనంతరం తెలుస్తుంది. 

ఇది కూడా చదవండి: మమతా బెనర్జీకి మరో షాక్‌

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top