సాక్షి, చెన్నై: అసెంబ్లీ ఫలితాల తర్వాత తమిళనాడు రాజకీయాల్లో సమీకరణాలు శరవేగంగా మారుతున్నాయి. ప్రభుత్వ ఏర్పాటు ప్రయత్నాల్లో టీవీకే ఇతర పార్టీలతో కీలక మంతనాలు జరుపుతోంది. మరోవైపు దారుణ పరాజయం నేపథ్యంలో ముఖ్యమంత్రి పదవికి ఎంకే స్టాలిన్ రాజీనామా చేశారు.
తమిళనాడు ముఖ్యమంత్రి పదవికి స్టాలిన్ రాజీనామా చేశారు. మంగళవారం ఆయన తన రాజీనామా లేఖను గవర్నర్‌కు పంపారు. ఓటమిపై స్పందించిన స్టాలిన్.. ప్రజలు ఇచ్చిన తీర్పును శిరసావహిస్తానని చెప్పారు. ప్రధాన ప్రతిపక్షం బాధ్యతను ఇక మీదట డీఎంకే సమర్థవంతంగా నిర్వర్తిస్తుందని తెలిపారు.
తమిళనాడు ఎన్నికల్లో డీఎంకే ఘోర ఓటమి పాలైంది. కేవలం 59 స్థానాల్లో ఆ పార్టీ అభ్యర్థులు నెగ్గారు. కొలతూర్‌లో డీఎంకే అధినేత స్టాలిన్ సహా మంత్రులంతా దాదాపుగా ఓటమి పాలయ్యారు. చెపాక్‌లో డిప్యూటీ సీఎం, ఆయన తనయుడు ఉదయనిధి మాత్రం నెగ్గారు. ఇవాళ స్టాలిన్ అధ్యక్షతన డీఎంకే సమావేశం జరగనుంది. ఓటమిపై సమీక్ష, భవిష్యత్ కార్యాచరణను ఈ భేటీలో చర్చించనున్నారు. అలాగే ప్రతిపక్ష నేతగా స్టాలిన్ తనయుడు ఉదయనిధిని ఎన్నుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.


