అలా రాని పక్షంలో లాక్‌డౌన్‌కు సిద్ధంకండి: సీఎం | Maharashtra CM Asks Officials To Start Preparing For Lockdown | Sakshi
Sakshi News home page

అలా రాని పక్షంలో లాక్‌డౌన్‌కు సిద్ధంకండి: సీఎం

Mar 30 2021 3:43 AM | Updated on Mar 30 2021 9:07 AM

Maharashtra CM Asks Officials To Start Preparing For Lockdown - Sakshi

సాక్షి, ముంబై: రాష్ట్రంలో కరోనా వ్యాప్తి తగ్గని పక్షంలో లాక్‌డౌన్‌తోనైనా వైరస్‌ వ్యాప్తిని నియంత్రణలోకి తేవాలని మంత్రులు, అధికారులకు ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ ఠాక్రే ఆదేశాలు జారీచేశారు. రోజురోజుకు పెరుగుతున్న కరోనా రోగుల సంఖ్య, కల్పించాల్సిన మౌలిక సదుపాయాలపై సోమవారం ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు. ఒకవేళ లాక్‌డౌన్‌ పెట్టాల్సి వస్తే అమలు తీరుపై చర్చించేందుకు ఆరోగ్య శాఖ మంత్రి రాజేశ్‌ టోపే, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సీతారాం కుంటే, టాస్క్‌ ఫోర్స్‌కు చెందిన డాక్టర్లు, సంబంధిత సీనియర్‌ ప్రభుత్వ అధికారులతో చర్చించారు.

కరోనా నిబంధనలు కఠినంగా అమలు కాని పక్షంలో రాబోయే రోజుల్లో లాక్‌డౌన్‌ అమలుచేసి వైరస్‌ను నియంత్రించాలనే దానిపై చర్చించారు. మంత్రాలయలో అలాగే గవర్నమెంట్, సెమీ గవర్నమెంట్‌ కార్యాలయాల్లో విజిటర్లకు పూర్తిగా నిషేధం విధించాలని, కార్యాలయాల్లో, వివిధ వ్యాపార సంస్థల్లో 50 శాతం సిబ్బంది హాజరయ్యేలా చర్యలు తీసుకోవాలన్నారు. అయినప్పటికీ కరోనా నియంత్రణలోకి రాని పక్షంలో లాక్‌డౌన్‌కు సిద్ధం కావాలని ఉద్ధవ్‌ ఠాక్రే స్పష్టం చేశారు.  


3 లక్షల యాక్టీవ్‌ కేసులు.. 
కరోనా రోగుల సంఖ్య ఇలాగే పెరుగుతూ పోతుంటే, దీని ప్రభావం కీలకమైన ఆరోగ్య సేవలపై పడే ప్రమాదముందని ఆరోగ్య శాఖ చీఫ్‌ సెక్రటరీ డాక్టర్‌ ప్రదీప్‌ వ్యాస్‌ సీఎం దృష్టికి తీసుకోచ్చారు. బెడ్లు, వెంటీటేటర్లు, ఆక్సిజన్‌ల కొరత తీవ్రంగా ఏర్పడి సామాన్య రోగులకు ఇబ్బందులు సృష్టించే ప్రమాదముందని అన్నారు. ప్రస్తుతం 3.57 లక్షల ఐసోలేషన్‌ బెడ్లలో 1.07 లక్షల రోగులున్నారు. మిగిలిన బెడ్లు కూడా త్వరలో పూర్తయ్యే అవకాశాలున్నాయి.  అదేవిధంగా 60,349 ఆక్సిజన్‌ బెడ్లలో 12,701 బెడ్లపై, అలాగే 19,930 బెడ్లలో 8,342 బెడ్లపై ఇదివరకే రోగులున్నారు. 9,030 వెంటిలేటర్లలో 1,881పై రోగులున్నారు.

కొన్ని జిల్లాలో బెడ్లు అందుబాటులో లేకపోవడంవల్ల రోగుల సంఖ్య అవకాశముందన్నారు. గత సంవత్సరం సెప్టెంబర్‌ 17వ తేదీన మూడు లక్షల యాక్టివ్‌ కేసులుండగా 31,351 మృతి చెందారు. ఈ ఏడాది మార్చి 27వ తేదీన 3,03,475 యాక్టివ్‌ కేసులుండగా 54,073 మృతులుండటంతో ఆందోళన మరింత ఎక్కువైంది. పరిస్థితి ఇలాగే ఉంటే మృతుల సంఖ్య పెరిగే అవకాశముంది. అందుకు సకాలంలో పరీక్షలు నిర్వహించుకుని ఆస్పత్రిలో చేరడానికి జాప్యం చేయడం, హోం క్వారంటైన్‌లో ఉండకపోవడం లాంటి నియమాలు పాటించకుంటే ప్రమాద తీవ్రత మరింత పెరగనుందని టాస్క్‌ఫోర్స్‌ వైద్యులు తెలిపారు. గత సంవత్సరం సెప్టెంబర్‌లో ఒకరోజు 24,619 రోగులను గుర్తించారు. ఈ ఏడాది మార్చి 27వ తేదీన 35,726 రోగులను గుర్తించారు.ఈ సంఖ్య 24 గంటల్లోనే 40 వేలకు చేరిందని వైద్యులు వివరించారు. 

వైద్య సేవల్లో కొరత ఉండొద్దు
లాక్‌డౌన్‌ అమలుచేసే పరిస్థితిని తీసుకురావద్దని పదేపదే హెచ్చరిస్తున్నప్పటీ అనేక మంది దీన్ని సీరియస్‌గా తీసుకోవడం లేదని సీఎం ఆవేదన వ్యక్తం చేశారు. ‘‘ప్రైవేటు కార్యాలయాల్లో హాజరు శాతంపై నియమాలు పాటించడం లేదు. మార్కెట్లలో, లోకల్‌ రైళ్లలో, బెస్ట్‌ బస్సుల్లో భౌతిక దూరం పాటించడం లేదు. అనేక చోట్ల నియమా లు ఉల్లంఘన జరుగుతున్నాయి. కరోనా పాజిటివ్‌ వస్తే క్వారంటైన్‌కు తరలిస్తారు. అక్కడ సదుపాయాలు ఉండవనే భయంతో అనేక మంది బయటకు చెప్పడం లేదు. ఇలాంటి అపోహలకు స్వస్తి చెప్పాలి’’ అని సీఎం సూచించారు.

ఆరోగ్య సేవలు కొరత లేకుండా చూసుకోవలన్నారు. ప్రస్తుతం కరోనా వైరస్‌ 10–18 ఏళ్ల వయసున్న వారి సంఖ్య అధికంగా ఉంది. భవిష్యత్తులో వీరి మృతి శాతం పెరిగే ప్రమాదముందన్నారు. సీతా రాం కుంటే మాట్లాడుతూ.. రాష్ట్రంలో కరొనా టీకా ఇచ్చే కార్యక్రమం వేగంగా సాగుతుందని తెలిపారు. గత కొద్ది రోజులుగా పరీక్షలు నిర్వహించుకునే వారి సంఖ్య మెరుగ్గా ఉందన్నారు. కరోనా టీకా కేంద్రాల సంఖ్య పెంచాలని సూచిం చినట్లు ఆయన చెప్పారు. అయితే అప్పటివరకు నిర్ణీత సమయంలో నైట్‌ కర్ఫ్యూ, 144 సెక్షన్‌ అమలుచేయాలని ముఖ్యమంత్రి సూచించారు. సాధ్యమైనంత వరకు ఉద్యోగులకు ఇంటి నుంచి పనిచేసే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement