పోటాపోటీగా ‘లైవ్‌లా, బార్‌ అండ్‌ బెంచ్‌’

LiveLaw Bar And Bench Websites: Revolutionised Legal Peporting - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : ‘నేనిక్కడ మీకొకటి చెప్పదల్చుకున్నాను. ఈ పిటిషన్లన్నింటిని ఇక్కడ పరిశీలించడం కన్నా, వీటిని ‘లైవ్‌లా’ వెబ్‌సైట్లోనో, మరో చోటనో పరిశీలించడమో మంచిది’ అని సుప్రీం కోర్టు న్యాయమూర్తి డీవై చంద్రచూడ్‌ వ్యాఖ్యానించారు. విశేష ప్రజాదరణ పొందుతున్న న్యాయ వెబ్‌సైట్‌ ‘లైవ్‌లా’ గురించి న్యాయమూర్తి ఉద్దేశపూర్వకంగానే మాట్లాడినట్లు స్పష్టమవుతోంది.

‘లైవ్‌లా’తో పాటు ‘బార్‌ అండ్‌ బెంచ్‌’ వెబ్‌సైట్‌ వివిధ కోర్టుల్లో కొనసాగుతున్న వివిధ కేసులు, పిటిషన్ల విచారణ సహా కోర్టు సర్వ కార్యకాలాపాల గురించి ఎప్పటికప్పుడు సమాచారాన్ని అప్‌లోడ్‌ చేస్తున్నాయి. కోర్టుల తీర్పులు, ఉత్తర్వులే కాకుండా పిటిషన్లు, విజ్ఞప్తులు, వాటికి సంబంధించిన పూర్వ సమాచారాన్ని దాదాపు లైవ్‌గా అందిస్తున్నాయని చెప్పవచ్చు. కోర్టు లోపలకి టీవీ కెమేరాలను అనుమతించరు కనుక, కెమేరాలు లేకుండానే ఈ వెబ్‌సైట్లు ప్రత్యక్ష ప్రసారాలను చేస్తున్నాయని చెప్పవచ్చు. ఏ ముఖ్యమైన కేసుకు సంబంధించి అయినా సరే కోర్టు తీర్పు చెబుతుండగానే ‘ట్వీట్ల’ రూపంలో ఈ వెబ్‌సైట్లు ప్రజలకు సమాచారాన్ని అందిస్తున్నారు. ఇంతవరకు తీర్పులే బయటకు వచ్చేవి. పిటిషన్లు, పిటిషన్లలోని అంశాలు ఒక్క న్యాయవాదులకే అందుబాటులో ఉండేవి. ఇప్పుడవన్నీ కూడా ఈ వెబ్‌సైట్ల ద్వారా ఎప్పటికప్పుడు ప్రజల ముందు సాక్షాత్కరిస్తున్నాయి. ఈ రెండు వెబ్‌సైట్లను జడ్జీలు, న్యాయవాదులు, కక్షిదారులే వీక్షిస్తున్నారనుకుంటే పొరపాటే. కోట్లాది మంది సోషల్‌ మీడియా ఫాలోవర్లు, సామాజిక కార్యకర్తలు, లా విద్యార్థులతోపాటు ఆసక్తిగల సామాన్యులు కూడా వీక్షిస్తున్నారు. సమాజంలో కోర్టుల ఆవశ్యకతను, వాటి పాత్రను సముచితంగా అర్థం చేసుకొని పారదర్శకంగా సమాచారాన్ని అందిస్తుండడంతోనే ఈ రెండు వెబ్‌సైట్లకు అంత ఆదరణ పెరిగింది.


‘బార్‌ అండ్‌ బెంచ్‌’ సహ వ్యవస్థాపకురాలు పల్లవి సాజులా, ‘లైవ్‌లా’ ప్రతినిధి ఎంఏ రషీద్

2010 నుంచి కోర్టు తీర్పుల అప్‌లోడింగ్‌
భారత్‌లో వివిధ కోర్టుల తీర్పులను ఆన్‌లైన్‌లో అప్‌లోడ్‌ చేయడం చాలా ఆలస్యంగా 2010లో ప్రారంభమైంది. ఆ తర్వాత వచ్చిన ఈ రెండు వెబ్‌సైట్లు కక్షిదారులకు కూడా ఎంతో ఉపయోగపడుతున్నాయి. తమ కేసుల విచారణకు కోర్టులకు హాజరైన వారికి అక్కడి వాదనలు ఏమిటో ఓ మానాన అర్థం అయ్యేవి కావు. ఈ వెబ్‌సైట్ల రాకతో పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ‘లైవ్‌లా లేదా బార్‌ అండ్‌ బెంచ్‌’ వెబ్‌సైట్లను ప్రతి రోజు ఉదయం, సాయంత్రం చూస్తామని ఇద్దరు హైకోర్టు జడ్జీలు చెప్పడం విశేషం. ఈ మధ్య వీటిని చూస్తున్న న్యాయవాదులే కాకుండా లిటిగెంట్లు కూడా న్యాయపరమైన పాయింట్లను లేవనెత్తుతున్నారని, అది ఒకరకంగా ఇబ్బందిగా ఉంటుందని, అందుకని తాము కూడా రోజూ చూస్తున్నామని చెప్పారు. ప్రస్తుతం ఆంగ్ల భాషలో మాత్రమే అందుబాటులో ఉన్న ఈ రెండు వెబ్‌సైట్లు ఇతర భాషల్లో కూడా వస్తే బాగుండని పాఠకులు సూచిస్తున్నారు.

2018లో సుప్రీం కోర్టు లోపలికి మొబైల్స్‌ అనుమతి
బార్‌ అండ్‌ బెంచ్‌ వెబ్‌సైట్‌ 2010లోనే తన కార్యకలాపాలను ప్రారంభించినప్పటికీ  2015లో ట్వీట్ల ద్వారా పాపులర్‌ అయింది. ఆ సైట్‌కు సంబంధించిన లీగల్‌ రిపోర్టర్లు ట్వీట్ల ద్వారా కేసుల వివరాలు బయటకు తెలియజేసేవారు. 2018 వరకు సుప్రీం కోర్టులో లీగల్‌ రిపోర్టర్ల మొబైల్‌ ఫోన్లను అనుమతించేవారు కాదు. వారి బాధలను అర్థం చేసుకున్న అప్పటి చీఫ్‌ జస్టిస్‌ దీపక్‌ మిశ్రాతో పరిస్థితి మారిపోయింది.

ఆవిర్భావం వెనక మిత్రులు
బెంగళూరులోని జాతీయ న్యాయ కళాశాలలో చదువుకున్న శిశిర రుద్రప్ప, బిపుల్‌ మైనాలి, అభిషేక్‌ పర్శీరా అనే మిత్రులు ‘బార్‌ అండ్‌ బెంచ్‌’ పత్రికను 2009లో స్థాపించారు. 2010 తర్వాత అది ఆన్‌లైన్‌ వెబ్‌సైట్‌గా మారింది. బార్‌ అండ్‌ బెంచ్‌ స్థాపించిన మూడేళ్లకు ‘లైవ్‌లా’ వెబ్‌సైట్‌ను ఎంఏ రషీద్, రఘుల్‌ సుదీశ్, రిచా కచ్‌వాహను 2012లో ప్రారంభించారు. ఇప్పుడు ఈ రెండు వెబ్‌సైట్లకు మూడు లక్షల మంది ట్విటర్‌ ఫాలోవర్లు ఉన్నారు. (చదవండి: కరోనా వ్యాక్సిన్‌పై సుబ్రమణియన్‌ స్వామి కీలక వ్యాఖ్యలు)

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top