ఇది పెద్ద దెబ్బే.. ‘లెఫ్ట్‌’ కళ తప్పింది! | Left Parties Face Existential Crisis After Kerala Drubbing | Sakshi
Sakshi News home page

ఇది పెద్ద దెబ్బే.. ‘లెఫ్ట్‌’ కళ తప్పింది!

May 5 2026 7:47 AM | Updated on May 5 2026 8:50 AM

Left Parties Face Existential Crisis After Kerala Drubbing

న్యూఢిల్లీ: కమ్యూనిస్ట్‌ పార్టీ ఆఫ్‌ ఇండియా(సీపీఐ). ఒకప్పుడు కీలకమైన, బలమైన పార్టీ. దేశానికి స్వాతంత్య్రం వచ్చాక 1951–52లో జరిగిన మొట్టమొదటి ఎన్నికల్లో అత్యధిక సీట్లు సాధించిన ప్రతిపక్షం. ఆ తర్వాత పశి్చమ బెంగాల్‌కు 23 ఏళ్ల పాటు సీఎంగా పనిచేసిన సీపీఎం నేత జ్యోతిబసుకు యునైటెడ్‌ ఫ్రంట్‌ ప్రభుత్వంలో 1996లో ప్రధానమంత్రి పదవిని చేపట్టే అవకాశం సైతం వచ్చింది అయితే, పార్టీ పొలిట్‌బ్యూరో అందుకు వ్యతిరేకత తెలపడంతో ఆయన వెనక్కి తగ్గారు. ఆ తర్వాత ఈ నిర్ణయాన్ని చారిత్రక తప్పిదంగా ఆ పార్టీయే ఒప్పుకుంది.

తిరిగి 2008లో, మన్మోహన్‌ సింగ్‌ సారథ్యంలోని యూపీఏ ప్రభుత్వానికి 60 మంది సభ్యులున్న వామపక్ష కూటమి మద్దతు ఉపసంహరించుకుంది. భారత్‌– అమెరికా అణు ఒప్పందమే ఇందుకు కారణం. అప్పట్లో వామపక్షాలు కేరళ, పశ్చిమబెంగాల్, త్రిపురల్లో అధికారంలో ఉన్నాయి. ఆ తర్వాత కేవలం 20 ఏళ్ల కాలంలోనే దేశంలో కమ్యూనిస్టుల ప్రాభవం పూర్తిగా తుడిచిపెట్టుకుపోయే స్థితికి చేరుకుంది. ఓటర్లు వామపక్ష భావనను వీడి క్రమక్రమంగా దూరంగా వెళ్లిపోతుండటమే ఇందుకు ప్రధాన కారణం. కేరళలో పినరయి విజయన్‌ సారథ్యంలోని లెఫ్ట్‌ డెమోక్రాటిక్‌ ఫ్రంట్‌(ఎల్డీఎఫ్‌) ఓటమి కమ్యూనిస్టులకు తాజాగా పెద్ద దెబ్బ. దీంతో, 1970 తర్వాత దేశంలో కమ్యూనిస్ట్‌లు మొదటిసారిగా అధికారం కోల్పోవడం గమనార్హం. 

చారిత్రక విజయం.. 
దేశ రాజకీయ చరిత్రలో వామపక్షాలది విశిష్టమైన స్థానం. 1951–52లో దేశంలో జరిగిన మొదటి సాధారణ ఎన్నికల్లో, లోక్‌సభలోని ప్రతిపక్ష పార్టీలన్నింటిలోనూ అత్యధిక స్థానాలను గెలుచుకున్నది కమ్యూనిస్ట్‌ పార్టీ ఆఫ్‌ ఇండియా (సీపీఐ) మాత్రమే. కేవలం ఐదేళ్ల తర్వాత, 1957లో కేరళ ఎన్నికల్లో విజయం సాధించి, ప్రపంచంలోనే ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన మొట్టమొదటి కమ్యూనిస్ట్‌ ప్రభుత్వంగా నిలిచి వామపక్షాలు చరిత్ర సృష్టించాయి.

కంచు కోటలు బెంగాల్, త్రిపుర 
1977లో పశి్చమ బెంగాల్‌లో సీపీఎం అధికారాన్ని దక్కించుకుంది. దేశంలో ఏదైనా ఒక రాష్ట్రంలో ఒకే పార్టీ సుదీర్ఘకాలం పాటు పాలించిన రికార్డు సృష్టించింది. ఆ పార్టీ నేత జ్యోతి బసు ముఖ్యమంత్రిగా 23 ఏళ్లపాటు కొనసాగారు. ఆ తర్వాత 2000లో బుద్ధదేవ్‌ భట్టాచార్య బాధ్యతలు చేపట్టారు. మరో 11 ఏళ్ల పాటు అక్కడ వామపక్షాల పాలన సాగింది. కేరళలో అధికారం మారుతూ వచ్చినప్పటికీ, త్రిపురలో మాత్రం వామపక్షాలు సుస్థిర విజయాన్ని అందుకున్నాయి. 1993లో త్రిపురలో 60 స్థానాలకు గాను 44 స్థానాలను గెలుచుకుని క్లీన్‌ స్వీప్‌ చేశాయి. దశరథ్‌ దేబ్‌ 1998 వరకు, ఆపై మాణిక్‌ సర్కార్‌ వరుసగా 20 ఏళ్ల పాటు ముఖ్యమంత్రిగా కొనసాగారు. 

క్షీణత..ఆపై పతనం: 
వామపక్షాల క్షీణత ముందుగానే మొదలైనప్పటికీ, 2011లో అది పతనం దిశగా సాగింది. నందిగ్రామ్, సింగూర్‌ భూసేకరణ నిరసనలతోపాటు మార్పు నినాదంతో ముందుకు వచి్చన మమతా బెనర్జీ సారథ్యంలోని తృణమూల్‌ కాంగ్రెస్‌(టీఎంసీ) ప్రజలను తనవైపు తిప్పుకోవడంలో విజయం సాధించింది. 294 స్థానాలున్న బెంగాల్‌ అసెంబ్లీలో 2006లో వామపక్ష కూటమికి 235 సీట్లుండేవి. టీఎంసీ దెబ్బకు వామపక్ష కూటమి బలం 62 స్థానాలకు పడిపోయింది. ఆ తర్వాత త్రిపురలో కూడా కమ్యూనిస్టులకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. 2014లో కేంద్రంలో బీజేపీ అధికారంలోకి రావడం దేశ రాజకీయాల్లో కీలక పరిణామం. అప్పట్లో దేశవ్యాప్తంగా వచి్చన కాషాయ అనుకూల పవనాల తాకిడికి వామపక్షాల కంచుకోట త్రిపుర కూడా కూలిపోయింది. అసెంబ్లీలోని 60 స్థానాల్లో బీజేపీ 36 గెలుచుకోగా, కమ్యూనిస్టుల బలం 50 నుంచి కేవలం 16కి పడిపోయింది. 

ఆ ఒక్కటీ పోయింది 
ఆ తర్వాత కాలంలో వామపక్షాలకు ఊరటగా నిలిచింది కేరళ మాత్రమే. 2016లో పినరయి విజయన్‌ ఆధ్వర్యంలో అధికారంలోకి వచ్చిన లెఫ్ట్‌ ఫ్రంట్, 2021లో కూడా మళ్లీ గెలిచి కేరళలో ఐదేళ్లకోసారి ప్రభుత్వం మారుతుందనే ఆనవాయితీని తిరగరాసింది. అయితే, తాజా ఎన్నికల్లో వామపక్షాలు దక్షిణాది రాష్ట్రాన్ని కూడా కోల్పోయాయి. మొత్తం 140 నియోజకవర్గాల్లో కాంగ్రెస్‌ నేతృత్వంలోని యూడీఎఫ్‌ మెజారిటీ సీట్లను గెల్చుకుంది. 
 

Advertisement
 
Advertisement
Advertisement