హిజాబ్‌పై కర్ణాటక ప్రభుత్వం కీలక నిర్ణయం | Karnataka Government Key Decision On Hijab Ban, Allows Religious Symbols In Schools And Colleges | Sakshi
Sakshi News home page

హిజాబ్‌పై కర్ణాటక ప్రభుత్వం కీలక నిర్ణయం

May 14 2026 9:25 AM | Updated on May 14 2026 10:24 AM

Karnataka government's key decision on hijab

బెంగళూరు: కర్ణాటక ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇక నుంచి పాఠశాలలు, కళాశాలల్లో  విద్యార్థులు నిర్దేశిత యూనిఫాంలతో పాటు హిజాబ్, రుద్రాక్ష, జనివర (పవిత్ర జంధ్యం), ఇతర మత విశ్వాస చిహ్నాలను ధరించడానికి అనుమతిస్తూ  ఉత్తర్వులు జారీ చేసింది. విద్యార్థులు ఇవి కలిగి ఉన్నారని నెపంతో విద్యాలయాల్లో అనుమతి ఎట్టి పరిస్థితుల్లో నిరాకరించకూడదని తెలిపింది. మతపరమైన దుస్తుల అంశంలో 2022లో విధించిన ఆంక్షలను అధికారికంగా రద్దు చేసింది.

విద్యార్థులకు మతపరమైన గుర్తింపు చిహ్నాలను స్వేచ్ఛగా ధరించే విధంగా ఈ నూతన విధానం అనుమతిస్తోందని అధికారులు తెలిపారు. ఈ నిర్ణయం అన్ని వర్గాల వారి  మత సంప్రదాయాలను  సమానంగా చూసే ఒక గొప్ప చర్యగా పేర్కొన్నారు.


హిజాబ్‌ వివాదం ఏంటి

2021 డిసెంబరులో కర్ణాటకలోని ఉడిపి జిల్లాకు చెందిన ఒక ప్రభుత్వ ప్రీ-యూనివర్శిటీ కళాశాలలో ఆరుగురు ముస్లిం విద్యార్థినులు హిజాబ్ (శిరోవస్త్రం) ధరించి తరగతులకు హాజరవ్వగా, యాజమాన్యం వారిని అనుమతించలేదు. ఇది యూనిఫాం నిబంధనలకు విరుద్ధమని కళాశాల పేర్కొంది. 

దీంతో విద్యార్థినులు తమ మతపరమైన హక్కుల కోసం నిరసనకు దిగగా, దీనికి ప్రతిచర్యగా కొందరు ఇతర విద్యార్థులు కాషాయ కండువాలు ధరించి కళాశాలకు రావడం మొదలుపెట్టారు. ఇది ఉద్రిక్తతలకు దారితీసింది, ఫలితంగా రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు, ఆందోళనలు జరిగాయి.

దీంతో కర్ణాటక ప్రభుత్వం  ఫిబ్రవరి 5, 2022న ఒక ఉత్తర్వు జారీ చేసింది. దీని ప్రకారం విద్యాసంస్థలు నిర్ణయించిన యూనిఫాంను విద్యార్థులు తప్పనిసరిగా పాటించాలని సమానత్వం, సమగ్రత మరియు ప్రజా శాంతికి భంగం కలిగించే దుస్తులను ధరించకూడదని ఆదేశాలు జారీ చేసింది.
 

తాజాగా ప్రభుత్వం ఆ ఉత్తర్వును రద్దు చేసింది. అయితే ప్రభుత్వ నిర్ణయంపై మిశ్రమ స్పందన వస్తోంది. కొంతమంది ఈ నిర్ణయాన్ని మత స్వేచ్ఛ మరియు విద్యార్థులకు సమాన హోదా కల్పించే దిశగా ఒక ప్రగతిశీల చర్యగా ప్రశంసిస్తున్నారు.

విమర్శకులు ఇది దేశ ఏకరూపతకు, వ్యక్తిగత భావ ప్రకటనకు మధ్య ఉన్న గీతను చెరిపివేస్తుందని వాదిస్తున్నారు. హిజాబ్ వంటి కనిపించే వస్త్రాలను, సాధారణంగా కనపడకుండా ఉంచే జంధ్యం వంటి వాటితో సమానం చేయవచ్చా అని వారు ప్రశ్నిస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement