ఎట్టకేలకు 'విజిల్‌' మోత | Joseph Vijay to be sworn in as Tamil Nadu CM | Sakshi
Sakshi News home page

ఎట్టకేలకు 'విజిల్‌' మోత

May 10 2026 1:25 AM | Updated on May 10 2026 1:25 AM

Joseph Vijay to be sworn in as Tamil Nadu CM

శనివారం తమిళనాడు గవర్నర్‌ రాజేంద్ర విశ్వనాథ్‌ అర్లేకర్‌కు పుష్పగుచ్ఛం అందజేస్తున్న టీవీకే అధినేత విజయ్‌

నేడే తమిళనాడు సీఎంగా జోసెఫ్‌ విజయ్‌ ప్రమాణం 

ఉదయం 10 గంటలకు నెహ్రూ స్టేడియంలో సంరంభం

వీసీకే, ఐయూఎంఎల్, లెఫ్ట్‌ పార్టీల మద్దతుతో మేజిక్‌ ఫిగర్‌ దాటిన టీవీకే 

చివరకు గవర్నర్‌ గ్రీన్‌సిగ్నల్‌.. ఈ మేరకు లోక్‌భవన్‌ అధికారిక ప్రకటన 

సంబరాల్లో టీవీకే శ్రేణులు.. సస్పెన్స్‌ థ్రిల్లర్‌కి శుభం కార్డు

సాక్షి, చెన్నై: తమిళనాడులో నూతన ప్రభుత్వ ఏర్పాటులో నెలకొన్న సందిగ్ధ నిశ్శబ్ద వాతావరణంలో విజయ్‌ విజిల్‌ ఎట్టకేలకు గట్టిగా మోగింది. ఐదు రోజులుగా కొనసాగుతున్న ఉత్కంఠకు తెరదించుతూ ఐదు పార్టీలు అందించిన మద్దతుతో చివరకు విజయ్‌ సారథ్యంలోని టీవీకే పార్టీ తొలిసారిగా తమిళనాడులో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతోంది. దీంతో నేటి(ఆదివారం) ఉదయం 10 గంటలకు చెన్నైలోని జవహర్‌లాల్‌ నెహ్రూ ఇండోర్‌ స్టేడియంలో రాష్ట్ర గవర్నర్‌ రాజేంద్ర విశ్వనాథ్‌ అర్లేకర్‌ సమక్షంలో విజయ్‌ ముఖ్యమంత్రిగా ప్రమాణం చేయనున్నారు. 234 మంది సభ్యులున్న శాసనసభలో కనీస మెజారిటీ(118)ని మించి ఎమ్మెల్యేల మద్దతును కూడగట్టడంలో సఫలీ కృతుడుకావడంతో విజయ్‌ను ముఖ్యమంత్రిగా నియమిస్తూ గవర్నర్‌ నిర్ణయం తీసుకున్నారని శనివారం తమిళనాడు లోక్‌భవన్‌ ఒక అధికారిక ప్రకటన విడుదలచేసింది. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని విజయ్‌ను గవర్నర్‌ ఆహ్వానించారు. మే 13వ తేదీ లేదా అంతకన్నాముందే బలనిరూపణకు సిద్ధంగా ఉండాలని అధికారిక ఉత్తర్వులో  విజయ్‌ పార్టీకి గవర్నర్‌ సూచించారు. అధికారిక ఉత్తర్వు వార్త తెలిసి తమిళగ వెట్రి కళగం(టీవీకే) పార్టీ శ్రేణుల్లో సంబరాలు అంబరాన్నంటాయి. తమిళనాడు వ్యాప్తంగా టీవీకే మద్దతుదారులు పెద్దమొత్తంలో బాణసంచా కాల్చారు. మిఠాయిలు పంచి ఆనందాన్నీ పంచుకున్నారు.  

మద్దతుతో ముందుకు... 
తొలుత ఐదుగురు సభ్యులున్న కాంగ్రెస్‌ మాత్రమే టీవీకే పార్టీకి మద్దతు పలకగా తర్వాత సీపీ(2)ఎం, సీపీఐ(2) వెంట నడిచాయి. శనివారం విదుథలై చిరుౖథెగల్‌ కట్చి(వీసీకే), ఇండియన్‌ యూనియన్‌ ముస్లిం లీగ్‌(ఐయూఎంఎల్‌) సైతం కలిసివస్తామని హామీ ఇవ్వడంతో 107 ఎమ్మెల్యేలున్న టీవీకే పార్టీకి మొత్తం బలం ఒకేసారి 120కి పెరిగింది. వెనువెంటనే గవర్నర్‌కు మేజిక్‌ ఫిగర్‌ అంశాన్ని తెలియజేసేందుకు విజయ్‌ లోక్‌భవన్‌కు బయల్దేరగా అపాయింట్‌మెంట్‌ చివరినిమిషంలోనూ ఖరారుకాకపోవడంతో మార్గమధ్యంలోనే నిరాశగా వెనుతిరిగారు. పదేపదే తిప్పుతూ గవర్నర్‌ ఉద్దేశపూర్వకంగా విజయ్‌ను వేధిస్తున్నారని వెంటనే సీపీఐ రాష్ట్ర కార్యదర్శి ఎం.వీరపాండియన్‌ అన్నారు. నిష్క్రమించిన కొద్దిసేపటికే సాయంత్రం ఆరుగంటల తర్వాత గవర్నర్‌ నుంచి విజయ్‌కు పిలుపు వచ్చింది. 

ఈసారి కాంగ్రెస్‌ తమిళనాడు రాష్ట్ర చీఫ్‌ కె.సెల్వపెరుంథగై, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి పి.షణ్ముగం, సీపీఎం ముఖ్య నేత బాలకృష్ణన్, వీసీకే ముఖ్యనేతలతో కలిసి గవర్నర్‌తో సమావేశమయ్యారు. 120 మంది ఎమ్మెల్యేల మద్దతు తనకుందని స్పష్టంచేస్తూ జాబితాను గవర్నర్‌కు విజయ్‌ బృందం అందజేసింది. గంటకుపైగా సుదీర్ఘ భేటీ తర్వాత విజయ్‌ మెజార్టీని అంగీకరిస్తూ తదుపరి ప్రభుత్వ ఏర్పాటుకు ఉన్న అడ్డంకులను గవర్నర్‌ తొలగించారు. తమిళనాడు తదుపరి సీఎంగా మీరే ఉండాలంటూ సంబంధిత లేఖను విజయ్‌కు గవర్నర్‌ అందజేశారు. దీంతో సీఎంగా విజయ్‌ ప్రమాణస్వీకారానికి శ్రీకారం చుట్టినట్లయింది. విజయ్‌ సారథ్యంలోని ప్రభుత్వానికి బేషరతుగా మద్దతు తెలుపుతున్నట్లు వీసీకే, ఐఎంయూఎల్‌ తెలిపాయి. కానీ తాము ఇంకా డీఎంకే సారథ్యంలోని కూటమిలోని కొనసాగుతామని, టీవీకే సర్కార్‌కు బయటి నుంచి మద్దతు ఇస్తామని వీసీకే ప్రకటించడం గమనార్హం.  

వీసీకేతో మారిన పరిణామాలు 
సీపీఎం, సీపీఐలు అధికారికంగా మద్దతు ఇచ్చినా, వీసీకే నేత థోల్‌ తిరుమావళవన్‌ నుంచి ఎలాంటి సమాచారం లేక పోవడంతో శనివారం ఉదయం నుంచి సాయంత్రం వరకు ఉత్కంఠ భరిత వాతావరణం నెలకొంది. కేరళకు గవర్నర్‌ వెళ్లిపోతున్నట్లు సమాచారం రావడంతో మెజార్టీ నిరూపణ, ఆదివారం ప్రమాణస్వీకారంపై నీలినీడలు కమ్ముకున్నాయి. అయితే హఠాత్తుగా వీసీకే చీఫ్‌ వైఖరిలో మార్పువచ్చింది. రాష్ట్రపతిపాలన వంటి ప్రమాదంలేకుండా రాష్ట్రంలో స్థిరప్రభుత్వం ఏర్పడాలనే సుదుద్దేశంతో విజయ్‌కు మద్దతు ఇస్తానని తిరుమావళవన్‌ ప్రకటించడంతో పరిణామాలువేగంగా మారాయి. రెండు స్థానాలున్న వీసీకే మద్దతుతో టీవీకే బలం మరింత పెరిగింది. తర్వాత చిట్టచివరకు ఐయూఎంఎల్‌ సైతం తమ ఇద్దరు ఎమ్మెల్యేలు మీతోనడుస్తారని మాట ఇవ్వడంతో టీవీకే కీలక మేజిక్‌ ఫిగర్‌ను దాటింది. తర్వాత గవర్నర్‌ దగ్గరకు వెళ్లడం, ఇప్పటికే టీవీకే శాసనసభాపక్షనేతగా ఎన్నికయ్యానని విజయ్‌ చెప్పడం, గవర్నర్‌ ఆమోదం చకచకా జరిగిపోయాయి. అయితే మంత్రివర్గ కేటాయింపులో వీసీకే గట్టిగా పట్టుబట్టవచ్చనే సంకేతాలు వెలువడుతున్నాయి. ఐదు పార్టీల మద్దతుతో ఏర్పడుతున్న ప్రభుత్వంలో సామాజిక సమీకరణాలను పరిగణనలోకి తీసుకుని ఏ పార్టీ నేతలకు కీలక శాఖలు అప్పగిస్తారనే ఇంకా చిక్కుముడిగానే ఉంది. 

ప్రమాణస్వీకారానికి రాహుల్‌గాంధీ రాక 
నేడు చెన్నైలో జరిగే ప్రమాణస్వీకారానికి కాంగ్రెస్‌ తరఫున ఆ పార్టీ అగ్రనేత రాహుల్‌గాంధీ హాజరవుతారని విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. సీఎంగా ప్రమాణంచేయబోతున్న విజయ్‌కు రాష్ట్ర కాంగ్రెస్‌ నేత మాణిక్యం ఠాకూర్‌ శుభాకాంక్షలు తెలిపారు. 


ముఖ్య నేతలకు మంత్రి పదవులు! 
టీవీకే ముఖ్య నేతలకు పదవులు ఇవ్వడానికి విజయ్‌ ఇప్పటికే ఒక జాబితా సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. ప్రజా పరిపాలన, హోంశాఖ తన వద్ద అట్టిపెట్టుకుని పార్టీ కచ్చినర్‌ సెంగొట్టయన్‌కు ప్రజా పనులు, పార్టీ ప్రధాన కార్యదర్శి బస్సీ ఆనంద్‌కు మునిసిపల్‌ శాఖ, పార్టీ ప్రచార డిప్యూటీ ప్రధాన కార్యదర్శి ఆధవ్‌ అర్జునకు క్రీడలు, ఎక్సైజ్‌ శాఖ, పార్టీ సంయుక్త కార్యదర్శి సీటీఆర్‌ నిర్మల్‌ కుమార్‌కు విద్యుత్, పార్టీ ముఖ్య నేత అరుణ్‌ రాజ్‌కు రిజిస్ట్రేషన్లు, వాణిజ్య పన్నులు శాఖ, పార్టీ కోశాధికారి వెంకటరామన్‌కు పాఠశాల విద్యాశాఖ, రాజ మోహన్‌కు ఆది ద్రావిడ సంక్షేమం, ముస్తఫాకు మైనారిటీ సంక్షేమ శాఖ అప్పగించే విధంగా తొలి జాబితా సిద్ధమైనట్టుగా తమిళనాడు మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. 

కాంగ్రెస్‌కు ఒక మంత్రి పదవి అప్పగిస్తున్నట్టు పేర్కొంటున్నాయి. సీఎంగా ప్రమాణ స్వీకారం అనంతరం ప్రోటెం స్పీకర్‌ నియామకం తర్వాత బల నిరూపణకు విజయ్‌ వ్యూహ రచన చేస్తున్నట్టు తెలిసింది. అంతకుముందు అమ్మ మక్కల్‌మున్నేట్ర కళగం(ఏఎంఎంకే) ఏకైక ఎమ్మెల్యే ఎస్‌.కామరాజ్‌ సైతం తమకు మద్దతిస్తున్నారని టీవీకే తెలిపింది. ఆయన మద్దతిచ్చే లేఖ ఫోర్జరీది అని ఏఎంఎంకే చీఫ్‌ టీటీవీ దినకరన్‌ ఆరోపించారు. ఈ మేరకు గుండీ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదుచేశారు. దినకరన్‌ ఆరోపణలను టీవీకే కొట్టిపారేసింది. కామరాజ్‌ స్వయంగా రాసిన మద్దతు లేఖ వీడియోను టీవీకే బహిర్గతంచేసింది. 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement