గాలిలో ప్రాణాలు

Jharkhand Cable Car Accident Two Persons lost - Sakshi

జార్ఖండ్‌లో రోప్‌ వే ప్రమాదం

కేబుల్‌ కార్లు ఢీకొని ఒకరు మృతి

హెలికాప్టర్‌ ద్వారా తరలిస్తుండగా మరొకరు

గాయపడిన 12 మంది పర్యాటకులు

సోమవారం రాత్రి ఆగిన సహాయక చర్యలు

కేబుల్‌ కార్లలోనే ఇంకా 15 మంది

దేవగఢ్‌: జార్ఖండ్‌ రాష్ట్రం దేవగఢ్‌ జిల్లాలో ఆదివారం కేబుల్‌ కార్లు ఢీకొన్న ఘటనలో ఒక పర్యాటకురాలు మృతి చెందగా, 12 మంది గాయాలపాలయ్యారు. హెలికాప్టర్‌ ద్వారా తరలిస్తుండగా మరొకరు ప్రాణాలు కోల్పోయారు. ఒకదాని వెంట మరొకటి వెళ్తున్న రెండు కేబుల్‌ కార్లలో మొదటిది కిందకు జారి వచ్చి వెనకున్న రెండో కేబుల్‌ కారును బలంగా ఢీకొట్టింది. దేవగఢ్‌ పట్టణంలోని ద్వాదశ జ్యోతిర్లింగాల్లో ఒకటైన బాబా బైద్యనాథ్‌ ఆలయానికి సమీపంలోనే ఈ ఘటన చోటుచేసుకుంది.

సోమవారం రాత్రి రక్షణ చర్యలు నిలిచే సమయానికి కేబుల్‌ కార్లలోనే మరో 15 మంది ఉన్నారు. చుట్టూ దట్టమైన అడవి, కొండలు, గుట్టలు ఉండటంతో ఆర్మీ హెలికాప్టర్లను రంగంలోకి దించి ఆదివారం రాత్రి 11 మందిని మాత్రమే కాపాడగలిగింది. మిగిలిన వారు రోప్‌వే కేబుల్‌ కార్లలోనే అంత ఎత్తులో రాత్రంతా ప్రాణాలరచేతపట్టుకుని గడపాల్సి వచ్చింది. వారికి అధికారులు డ్రోన్ల ద్వారా ఆహారం, నీరు అందజేశారు. ఎన్‌డీఆర్‌ఎఫ్, ఐటీబీపీ, ఆర్మీ సిబ్బందిని రంగంలోకి దించారు. రక్షణ శాఖకు చెందిన రెండు హెలికాప్టర్లతో సోమవారం తిరిగి సహాయక చర్యలను కొనసాగించారు.

సాయంత్రం సమయానికి కేబుల్‌ కార్లలో చిక్కుబడిపోయిన 32 మంది పర్యాటకులను సురక్షితంగా తీసుకురాగలిగారు. కేబుల్‌ కార్లు ఢీకొనడంతో ఆదివారం తీవ్రంగా గాయపడి ఒక మహిళ చనిపోగా సహాయక చర్యల సమయంలో బెంగాల్‌కు చెందిన ఒక పర్యాటకుడు ప్రమాదవశాత్తు హెలికాప్టర్‌ నుంచి జారి పడి మృతి చెందారని అదనపు డైరెక్టర్‌ జనరల్‌ ఆర్‌కే మాలిక్‌ తెలిపారు. క్షతగాత్రులైన మరో 12 మంది ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారన్నారు. చీకటి పడటంతో సోమవారం రాత్రి సహాయక చర్యలు నిలిపివేశామన్నారు. మరో 15 మంది ఇంకా కేబుల్‌ కార్లలోనే ఉన్నారని చెప్పారు. వారిని సురక్షితంగా తీసుకువచ్చేందుకు మంగళవారం ఉదయమే తిరిగి ప్రయత్నాలు కొనసాగిస్తామని మాలిక్‌ పేర్కొన్నారు.

రోప్‌వే వ్యవస్థలో తలెత్తిన లోపం వల్లే ప్రమాదం జరిగినట్లు భావిస్తున్నామని దేవగఢ్‌ డిప్యూటీ కమిషనర్‌ మంజునాథ్‌ భజంత్రి తెలిపారు. ఆదివారం సాయంత్రం 4 గంటలకు ప్రమాదం చోటుచేసుకోగా ఆ వెంటనే రోప్‌వే నిర్వాహకులు అక్కడి నుంచి పరారైనట్లు బాధితులు తెలిపారు. ఎత్తైన గుట్టలు, దట్టమైన అటవీ ప్రాంతం మీదుగా 1,100 అడుగుల ఎత్తు, 766 మీటర్ల పొడవైన ‘త్రికూట్‌ రోప్‌వే’కు దేశంలోనే పొడవైందిగా పేరుంది. 2019 డిసెంబర్‌లో కశ్మీర్‌లోని గుల్మార్గ్‌లో రోప్‌వే తెగి కేబుల్‌ కార్లలో ఉన్న ఒకే కుటుంబానికి చెందిన నలుగురితోపాటు ముగ్గురు టూరిస్ట్‌ గైడ్‌లు ప్రాణాలు కోల్పోయారు.

(చదవండి: మళ్లీ కరోనా కలకలం.. ఆఫ్‌లైన్‌ క్లాస్‌లు నిలిపివేత)

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top