
విదేశాల్లో చదువు కోవడం అంటే భారత విద్యార్థులకు మోజు.. అందులోనూ అమెరికా, కెనడా, యూకే వంటి దేశాల్లో చదవడం అంటే అది మరింత క్రేజు. మరి ఇప్పుడు భారత విద్యార్థుల అభిరుచి మారిందా? అంటే అవుననక తప్పదు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో విదేశాల్లో చదవడం కష్టతరంగా మారింది. ప్రధానంగా వీసా నిబంధనలు కఠినతరం కావడం, ఖర్చులు పెరగడం వంటి తదితర కారణాలతో భారత విద్యార్థులు విదేశాల్లో చదవాలనే ఆసక్తి తగ్గిపోతోంది. అదే సమయంలో భారతదేశంలోనే మెరుగైన అవకాశాలు లభించడం వంటి కారణాలతో విదేశాల్లో చదువుకు వెనకడుగు వేస్తున్నారు. విదేశాల్లో భారత విద్యార్థుల చదువుల అంశానికి సంబంధించి పలు నివేదికలు ఇదే విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి.
యూఎస్, యూకేను వదిలేద్దాం..!
గత కొన్నేళ్లుగా విదేశాల్లో చదివే భారత విద్యార్థుల సంఖ్య గణనీయకంగా తగ్గింది. 2023 నాటికి విదేశాల్లో చదివే భారత విద్యార్థుల సంఖ్య 8.92 లక్షలు ఉండగా, అది 2024 నాటికి 7.59 లక్షలకు తగ్గింది. దీనికి కారణాలు మాత్రం ప్రధానంగా అగ్రదేశాలైన యూఎస్‌ఏ, యూకే, కెనడాల్లో చదవాలనే కోరిక ఒకటి.
అయితే ఈ దేశాల్లో వీసాల నిబంధనలు కఠినతరంగా మారాయి. దాంతో అమెరికా, యూకే, కెనడాలపై దృష్టి పెట్టడం లేదు. దాంతో విదేశాల్లో చదవాలనుకునే భారత్ విద్యార్థుల సంఖ్య తగ్గడానికి ఇదొక కారణంగా మారింది. ప్రస్తుతం పలువురు విద్యార్థుల మాత్రమే యూఎస్, యూకేలపై దృష్టి సారిస్తుండగా, అధిక శాతం మంది మాత్రం ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తున్నారు. ఇందులో కొంతమంది భారత్‌లోనే ఉన్నత చదువులకు ఆసక్తి చూపిస్తుండగా, మరి కొంతమంది మాత్రం వీసా నిబంధనలు సులభతరంగా ఉండి ఫీజులు తక్కువగా ఉండే దేశాల వైపు మొగ్గు చూపిస్తున్నారు.
కెనడా అసలే వద్దు..!
గతంలో అమెరికాలో చదువు కోవడానికి వీలు లేకపోతే, కెనడా వైపు దృష్టి సారించే వారు అధిక శాతం మంది భారత విద్యార్థులు. అయితే జస్టిన్ ట్రూడో హయాంలో భారత్-కెనడా దౌత్స సంబంధాలు దెబ్బ తినడంతో పాటు అక్కడ వీసా నిబంధనలు కూడా కఠినతరంగా మారాయి.
ట్రూడో హయాంలో వీసా పరిమితులు, ఎస్‌డీఎస్ (Student Direct Stream ప్రోగ్రాం రద్దు, వర్క్ పరిమితులు వంటి మార్పులు భారత విద్యార్థులపై తీవ్ర ప్రభావం చూపించాయి. ఒక విషయాన్ని గమనిస్తే 2023లో 2.33 లక్షల మంది విద్యార్థులు కెనడా వెళ్లగా, 2024లో అది కాస్తా1.37 లక్షలకు పడిపోయింది. అంటే కెనడా అసలే వద్దు అనే నిర్ణయానికి అధిక శాతం భారత విద్యార్థులు వచ్చారనేది ఈ గణాంకాల్ని బట్టి అర్ధమవుతోంది.
బంగ్లా, ఉజ్బెకిస్థాన్‌లో ఉన్నత చదువులు..
విదేశాల్లో చదువాలనుకునే భారత విద్యార్థుల సంఖ్య గణనీయంగా తగ్గడం ఒకటైతే, అభివృద్ధి చెందిన దేశాలకు వెళ్లడానికి వీసా తదితర ఇబ్బందులు ఎదురవుతున్న నేపథ్యంలో బంగ్లదేశ్, ఉజ్భెకిస్తాన్, సింగపూర్, రష్యా వైపు మొగ్గు చూపిస్తున్నారు.
2023లో 20,368 మంది భారత విద్యార్థులు బంగ్లాదేశ్ వైపు మొగ్గు చూపగా, మరుసటి ఏడాదికి అది కాస్త పెరిగి 29,232కు చేరింది. 2023 నాటికి ఉజ్బెకిస్థాన్‌లో చదువుకునే భారత విద్యార్థుల సంఖ్య 6, 601 ఉంగా, అది 2024 నాటికి 9,915 చేరింది. ఇక 2023లో రష్యా వైపు 25,503లో భారత విద్యార్థులు ఆసక్తి చూపగా, 2024 నాటికి 31,444 విద్యార్థులకు చేరింది. ఇక సింగపూర్ విషయానికొస్తే ఏడాదిలో 12,000 నుంచి 14,000 మంది విద్యార్థులకు చేరింది.
ఎందుకీ మార్పు..?
అసలు విదేశాల్లో చదువు అనేది భారీ ఖర్చుతో కూడుకున్నదైతే, అందులో వీసా తదితర నిబంధనల్లో భారీగా మార్పులు చేయడం మరొకటి. ఇది ప్రధానంగా అభివృద్ధి చెందిన దేశాల్లో కనిపిస్తోంది. యూఎస్, యూకే, కెనడాల్లోనే వీసా నిబంధనల్లో కఠినమైన మార్పులు వచ్చాయి. దాంతో ‘ ఎందుకీ తలనొప్పి’ అని భావించే చిన్న దేశాల వైపు చూస్తున్నారు.
తక్కువ ఖర్చుతో మెడికల్, టెక్నికల్ విద్య పూర్తి చేసే అవకాశాలు అధికంగా ఉండటంతో పాటు వీసా ప్రక్రియ సులభతరంగా ఉండటం మరొక కారణం. భారతీయ విద్యార్థులకు అనుకూలమైన కోర్సులు కూడా ఆయా దేశాల్లో ఉండటం కూడా ప్రత్యామ్నాయంగా వాటివైపు చూడటానికి ప్రధానమైన అంశంగా మారింది ఇక భద్రత పరంగా కూడా అక్కడ పెద్దగా ఇబ్బందులు తలెత్తే పరిస్థితులు ఉండవని భావించే బంగ్లాదేశ్, సింగపూర్, రష్యా, ఉజ్బెకిస్థాన్ తదితర దేశాల వైపు చూడటానికి మరొక కారణంగా చెప్పవచ్చు.