అస్సాం: 3జీలను మించిన మామ | Himanta Biswa Sarma, Who Defeated Three Key Parties? | Sakshi
Sakshi News home page

అస్సాం: 3జీలను మించిన మామ

May 5 2026 8:18 AM | Updated on May 5 2026 8:39 AM

Himanta Biswa Sarma, Who Defeated Three Key Parties?

అస్సాంలో బ్రాహ్మణనేతను ఎలాగైనా ఓడించాల్సిందేనన్న ఏకైక నినాదంతో ఎన్నికల బరిలో దిగిన మూడు కీలక పార్టీలు చతికిలపడ్డాయి. కాంగ్రెస్‌ నేత గౌరవ్‌ గొగోయ్‌(జీ), రాయ్‌జోర్‌ దళ్‌ నేత అఖిల్‌ గొగోయ్‌(జీ), అస్సాం జాతీయ పరిషద్‌ నేత లురిన్‌జ్యోతి గొగోయ్‌(జీ) ఇలా అహోం వర్గానికి చెందిన మూడు పార్టీల (జీ) అగ్రనేతల ఎన్నికల వ్యూహాలను బీజేపీ నాయకుడు హిమంత బిశ్వశర్మ మరోసారి పటాపంచలు చేశారు.

ఎగువ అస్సాంలో భారీగా పెరిగిన మద్దతు 
అహోం వర్గీయులు ఎక్కువగా నివసించే ఎగువ అస్సాంలో కాంగ్రెస్‌ హవా కొనసాగేది. ఆ సంస్కృతికి ఈసారీ హిమంత చరమగీతంపాడారు. ఎగువ అస్సాంను హిమంత అభివృద్ధి పథంలో పరుగులుపెట్టించాడు. రాష్ట్రంలో కేంద్రంలో ఒకే పార్టీ అధికారంలో ఉండటం హిమంతకు బాగా కలిసొచి్చంది. ఎన్నో ప్రాజెక్టులను రాష్ట్రానికి ముఖ్యంగా ఎగువ అస్సాంలో అమలుపరిచి అభివృద్ధిఫలాలు స్థానికులకు అందేలాచేశారు. గువాహటి–దిబ్రూగఢ్‌ హైస్పీడ్‌ ఎక్స్‌ప్రెస్‌వే నిర్మాణంతో ఈ మార్గంలో ప్రయాణసమయంలో భారీగా తగ్గింది. పలు జాతీయరహదారుల ప్రాజెక్టులు, నాలుగు లేన్ల రోడ్లు, వంతెనలు పూర్తిచేశారు. దీంతో పొరుగున ఉన్న అరుణాచల్‌ ప్రదేశ్‌తో అనుసంధానం పెరిగింది. అత్యవసర సమయాల్లో యుద్ధవిమానాలు దిగడానికి వీలుగా ల్యాండింగ్‌ స్ట్రిప్‌ నిర్మించారు.

దిబ్రూగఢ్‌లో సర్వతోముఖాభివృద్ధికి కృషి.. 
రాష్ట్రంలో రెండో రాజధానిలా దిబ్రూగఢ్‌ నగరాన్ని హిమంత తీర్చిదిద్దారు. ఇక్కడే నూతనంగా శాసనసభ భవనం, ఎమ్మెల్యే క్వార్టర్స్‌ నిర్మించారు. దీంతో కేవలం ఒక్క నగరంలో పరిపాలన కేంద్రీకృతంకాకుండా వికేంద్రీకరణ సిద్ధాంతాన్ని హిమంత విజయవంతంగా అమలుచేశారు. హిమంత మార్గదర్శకంలో డిస్పూర్, దిబ్రూగఢ్‌లలో అభివృద్ధి కార్యక్రమాలు ఎక్కువయ్యాయి. దిబ్రూగఢ్‌ విశ్వవిద్యాలయం కోసం అత్యధిక నిధులు వెచి్చంచారు. అస్సాం వైద్యకళాశాలను విస్తరించారు. మరో రెండేళ్లలో ఊహించనంత అభివృద్ధిచేసి చూపుతానని హిమంత గతంలోనే చేసిన ప్రకటన ఎన్నికల ఫలితాలపై బాగా ప్రభావం చూపింది. 

అందరూ మెచ్చిన మామ 
మేనమామతో ఉండే ఆతీ్మయానుబంధం అందరికీ చిరపరిచితమే. అంతే మమకారం ప్రజలపై హిమంత చూపారు. అందుకే అస్సాంలో ఆయనను అందరూ మామా అని ఆప్యాయంగా పిల్చుకుంటారు. నేనూ మీలో ఒకడిని, మనందరం ఒకే కుటుంబం అనేభావనను హిమంత విజయవంతంగా ప్రజల మనసుల్లో నాటారు. అందుకే ఎంతో మంది నేరుగా హిమంతకు తమ కష్టసుఖాలను చెప్పుకునేవారు. వాటిని తీరుస్తూ హిమంత ఓటర్లకు మరింత చేరువయ్యారు.

మౌలికసదుపాయాల కల్పనపై ప్రధానంగా దృష్టి
రాష్ట్రంలో మౌలికసదుపాయాల కల్పనకు హిమంత అత్యధిక ప్రాధాన్యతనిచ్చారు. బ్రహ్మపుత్ర నదీ సొరంగం, కజిరంగా ఎలివేటెడ్‌ కారిడార్, సెమీకండక్టర్‌ ప్లాంట్‌ స్థాపన కోసం ఏకంగా 300 కోట్ల డాలర్ల పెట్టుబడులను ఆకర్షించడం వంటివి హిమంత గెలుపునకు దోహదంచేశాయి. బీజేపీ–ఆర్‌ఎస్‌ఎస్‌ మూలాలున్న నేతకావడంతో పక్కా వ్యూహరచన, అమలులో బిశ్వశర్మది రాటుదేలారు. గతంలో కాంగ్రెస్‌లో పనిచేసి అనుభవం, ఆ పార్టీలోని లోటుపాట్లపైనా హిమంతకు బాగా పట్టుంది.

అహోం వర్గీయులను అక్కున చేర్చుకునేందుకు కాంగ్రెస్‌ నేత గౌరవ్‌ గొగోయ్‌(జీ), రాయ్‌జోర్‌ దళ్‌ నేత అఖిల్‌ గొగోయ్‌(జీ), అస్సాం జాతీయ పరిషద్‌ నాయకుడు లురిన్‌జ్యోతి గొగోయ్‌(జీ) చేసిన ప్రయత్నాలను హిమంత వమ్ముచేశారు. బంగ్లాదేశీ చొరబాటుదారులతో యావత్‌ అస్సాంకు ముప్పువాటిల్లుతోందని హిమంత ఎన్నికల్లో చెప్పారు. మియా ముస్లిం వర్గీయులపై హిమంత తీసుకునే చర్యలను ఓటర్లు సమర్థించే పరిస్థితి తీసుకొచ్చారు.

రాష్ట్రంలోని హిందువులను ఏకతాటి మీదకు తీసుకురావడంలో సఫలమయ్యారు. చొరబాటుదారులు స్థానికుల నుంచి భూములు లాక్కుంటున్నారన్న వాదనను బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లారు. తన ప్రభుత్వంలోనే ఈ సమస్యకు పరిష్కారం లభిస్తుందని ఓటర్లు నమ్మేలాచేశారు. ముస్లిం మియాలు స్థానిక గిరిజనులను పెళ్లాడి వాళ్ల గిరిజనభూములను లాక్కుంటున్నారని బీజేపీ నేతలు చేసిన ఆరోపణలకు ఈ ముగ్గురు గొగోయ్‌ల పార్టీల నుంచి దీటైన పరిష్కార స్పందన కరువైంది. అయోధ్య రామాలయం, ఉమ్మడి పౌరస్మృతి, పాకిస్తాన్, బంగ్లాదేశ్, మయన్మార్‌ల నుంచి చొరబాట్ల అంశాలపై మాట్లాడుతూ జాతీయవాదిగా పేరు తెచ్చుకున్నారు.   

Advertisement
 
Advertisement
Advertisement