How Asia Richest Man Gautam Adani Two Times Escaped From Death - Sakshi
Sakshi News home page

Gautam Adani.. అలా 2 సార్లు చావు నుంచి తప్పించుకున్నారు

Nov 27 2021 6:03 PM | Updated on Nov 27 2021 7:41 PM

Gautam Adani Escaped Death Twice Once During 26 11 Mumbai Attack - Sakshi

ఆ రోజు 15 అడుగుల దూరంలో నా మృత్యువు నాకు కనిపించింది

Gautam Adani Escaped Death Twice Once During 26 11 Mumbai Attack సాక్షి, వెబ్‌డెస్క్‌: అదానీ గ్రూప్‌ వ్యవస్థాపకుడు గౌతమ్‌ అదానీ అరుదైన రికార్డు సృష్టించిన సంగతి తెలిసిందే. ఆసియా బిలియనీర్ల జాబితాలో అగ్రస్థానంలో ఉన్న ముకేష్‌ అంబానీని.. వెనక్కు నెట్టి, ఆయన ప్రథమ స్థానంలో నిలిచారు అదానీ. బ్లూమ్‌బెర్గ్ బిలియనీర్ ఇండెక్స్ ఈ విషయాన్ని ప్రకటించింది. ఈ నేపథ్యంలో అదానీకి సంబంధించి ఓ ఆసక్తికర వార్త వెలుగులోకి వచ్చింది. ప్రస్తుతం ఆసియా కుబేరుడిగా నిలిచిన అదానీ గతంలో రెండు సార్లు చావు నోటి నుంచి తప్పించుకున్నారట. టీనేజ్‌లో ఉండగా ఒకసారి.. 2008 ముంబైలో జరిగిన ఉగ్రదాడి సమయంలో మరోసారి అదానీ మృత్యుముఖం నుంచి బయటపడ్డారట. ఆ వివరాలు.. 

​కాలేజీ డ్రాప్‌ఔట్‌..
ప్రస్తుతం ఆసియా కుబేరుడిగా ఖ్యాతి గాంచిన అదానీ కాలేజ్‌ డ్రాప్‌ఔట్‌. చదువు మధ్యలోనే ఆపేసి డైమండ్‌ ట్రేడర్‌గా జీవితాన్ని ప్రారంభించారు. ఈ క్రమంలో ముంబై వెళ్లి అక్కడ మహేంద్ర బ్రదర్స్‌ కంపెనీలో పని చేశారు. అనంతరం 2-3 సంవత్సరాల తర్వాత ఆయన సొంతంగా ముంబై జవేరీ బజార్‌లో డైమండ్‌ బ్రోకరేజీ సంస్థను స్థాపించారు. 
(చదవండి: ఆసియా బిలియనీర్ల జాబితాలో అగ్రస్థానం, అంబానీకి షాక్‌ ఇచ్చిన గౌతమ్‌ అదానీ)

వ్యాపారంలో విజయంతో స్వరాష్ట్రంలో గుర్తింపు
వజ్రాల వ్యాపారంలో విజయం సాధించాక 1981లో అహ్మదాబాద్‌ వెళ్లారు. అక్కడ తన బంధువు స్థాపించిన పీవీసీ వ్యాపారంలో సాయం చేయసాగారు. ఆ తర్వాత అదానీ ఎక్స్‌పోర్ట్స్ కింద కమోడిటీస్ ట్రేడింగ్ వెంచర్‌ను స్థాపించారు. అది కూడా విజయవంతం అయ్యింది. ఫలితంగా స్వరాష్ట్రంలో గుర్తింపు లభించింది. బిజినెస్‌ పేపర్లలో అదానీకి సంబంధించిన వార్తలు రాసాగాయి. 

సక్సెస్‌తో పెరిగిన శత్రువులు.. 
విజయం.. పేరు ప్రఖ్యాతులతో పాటు శత్రువులను కూడా తీసుకొస్తుంది అంటారు. అదానీ విషయంలో ఇది నిజం అయ్యింది. 1990 మధ్య నాటికి అదానీ సక్సెస్‌ఫుల్‌ బిజినెస్‌మ్యాన్‌గా రాణిస్తున్నారు. ఆయన సంపద పెరుగుతున్న కొద్ది శత్రువులు కూడా పెరగసాగారు. ఆయన ఆస్తి మీద ఆశతో కొందరు దుండగులు 1997లో అదానీని కిడ్నాప్‌ చేశారు. 
(చదవండి: అదానీ సంపద.. రోజుకు 1,000 కోట్లు!)

తలకు తుపాకీ గురిపెట్టి.. కిడ్నాప్‌
జనవరి 1, 1998న ఫైల్‌ అయిన పోలీసు రిపోర్ట్‌ ప్రకారం దుండగులు కర్ణావతి క్లబ్‌ నుంచి బయటకు వస్తోన్న అదానీని, ఆయనతో పాటు ఉన్న శాంతిలాల్‌ పటేల్‌ను కిడ్నాప్‌ చేశారు. సుమారు 11 కోట్ల రూపాయలు ఇస్తేనే వారిని విడుదల చేస్తామని డిమాండ్‌ చేశారు. అయితే అదానీని కిడ్నాప్‌ చేసింది అప్పటి అండర్‌ వరల్డ్‌ డాన్‌ ఫజల్-ఉర్-రెహ్మాన్ అలియాస్ 'ఫజ్లు రెహ్మాన్' అని వార్తలు వినిపించాయి. చివరకు అదానీ కిడ్నాపర్ల చెర నుంచి క్షేమంగా బయటపడ్డారు. అలా ఒకసారి మృత్యువు నుంచి తప్పించుకున్నారు అదానీ.

2008 మరో సారి..
నవంబర్‌ 26, 2008న ముంబైలో జరిగిన ఉగ్రదాడిని దేశం ఇంకా మర్చిపోలేదు. ఈ సంఘటన జరిగిన నాడు ఉగ్రవాదులు కాల్పులు జరిపిన తాజ్‌ హోటల్‌లోనే అదానీ ఉన్నారు. ఉగ్రదాడి జరుగుతున్న సమయంలో బేస్‌మెంట్‌లో దాక్కుని ప్రాణాలు కాపాడుకున్నారు.
(చదవండి: పెట్టుబడులను ఆకర్షించడంలో అదానీ  దూకుడు..!)

దీని గురించి అదానీ ఓ సందర్భంలో మాట్లాడుతూ.. ‘ఉగ్రదాడి జరిగిన సమయంలో నేను తాజ్‌ హోటల్‌లో దుబాయ్‌ పోర్ట్‌ సీఈఓ మహ్మద్‌ షరాఫ్‌ని డిన్నర్‌ కోసం కలిశాను. మేం హోటల్‌లో కూర్చుని మాట్లాడుకుంటుండగా.. ఉగ్రదాడి ప్రారంభం అయ్యింది. అందరం తలోదిక్కుకు పరిగెత్తాం. కొందరు సోఫాల వెనక కూర్చుని దాక్కున్నారు. నేను బేస్‌మెంట్‌లో దాక్కుని ఉన్నాను’’ అని తెలిపారు.

‘‘కమాండోలు వచ్చే వరకు అందరం ప్రాణాలు అరచేత పట్టుకుని.. దేవుడిని ప్రార్థిస్తూ ఉన్నాం. ఆ రోజు 15 అడుగుల దూరంలో నా మృత్యువు నాకు కనిపించింది. నవంబర్‌ 26 రాత్రి అంతా బేస్‌మెంట్‌లోనే ఉన్నాను. కమాండోలు మమ్మల్ని కాపాడి.. అక్కడి నుంచి సురక్షిత ప్రాంతానికి తరలించారు. ఆ తర్వాత ప్రైవేట్‌ ఎయిర్‌క్రాఫ్ట్‌లో ఆయన అహ్మదాబాద్‌ చేరుకున్నాను’’ అని తెలిపారు. అలా అదానీ రెండు సార్లు చావు నోటి నుంచి తప్పించుకున్నారు. 

చదవండి: అంబానీ.. అదానీ.. నువ్వా నేనా..!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement