విజయ్‌ వ్యూహం.. డీఎంకే, అన్నాడీఎంకే విలవిల | DMK AIADMK Alert After TVK Vijay Two Weeks Plan | Sakshi
Sakshi News home page

విజయ్‌ వ్యూహం.. డీఎంకే, అన్నాడీఎంకే విలవిల

May 5 2026 1:56 PM | Updated on May 5 2026 2:13 PM

DMK AIADMK Alert After TVK Vijay Two Weeks Plan

టీవీకే అధినేత విజయ్‌ కీలక నిర్ణయం తీసుకున్నారు. టీవీకే తరఫున నెగ్గిన ఎమ్మెల్యేలను రిసార్ట్‌కు తరలించాలని నిర్ణయించారు. ప్రభుత్వ ఏర్పాటు ఆలస్యం అవుతున్నందున ఆయన ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అయితే.. దీని వెనక మరో వ్యూహం  ఉండొచ్చనే చర్చా జోరందుకుంది. 

తమిళనాడు ఎన్నికల్లో విజయ్‌ టీవీకే పార్టీ 108 సీట్ల విక్టరీతో సంచలన విజయం నమోదు చేసింది తెలిసిందే. డీఎంకే 59, అన్నాడీఎంకే 47 స్థానాలకు పరిమితం అయ్యాయి. అయితే ప్రభుత్వ ఏర్పాటునకు కావాల్సిన మెజారిటీకి టీవీకే దగ్గర్లోనే ఆగిపోయింది. అయినప్పటికీ తమ పార్టీకి పూర్తి మెజారిటీ ఉందని.. ప్రభుత్వ ఏర్పాటునకు రెండు వారాల గడువు ఇవ్వాలని విజయ్‌ తమిళనాడు గవర్నర్‌ను కోరారు. ఆ వెంటనే.. 

నెగ్గిన వాళ్లందరినీ పార్టీ ప్రధాన కార్యాలయానికి రప్పించిన ఆయన.. అటు నుంచి అటే పూంజేరీలోని ఓ స్టార్‌ హోటల్‌కు తరలించాలని నిర్ణయించారు. టీవీకే ప్రభుత్వం ఏర్పాటు అయ్యేదాకా అక్కడే వాళ్లకు బస ఏర్పాటు చేయాలని పార్టీ కీలక నేతలను ఆయన ఆదేశించారు. అయితే..

విజయ్‌ మాస్టర్‌ ప్లాన్‌?
టీవీకేకు ప్రభుత్వ ఏర్పాటునకు మరో 10 సీట్లు అవసరం. ఇప్పటికే కాంగ్రెస్‌, వామపక్ష పార్టీలు, ఒకట్రెండు సీట్లు నెగ్గిన పార్టీలు విజయ్‌ పార్టీతో అధికారంలో భాగమయ్యేందుకు ముందుకు వచ్చాయి. మద్దతు అంశం పరిశీలిస్తామని బహిరంగంగా ప్రకటనలు సైతం చేస్తున్నాయి. అయితే ఆయన ఈ విషయంలో ఆచితూచీ అడుగేయాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఎవరితో పొత్తు పెట్టుకోవాలనే పూర్తిగా ఆయన నిర్ణయమేనని.. అందులో తమ పాత్ర ఏదీ ఉండబోదని టీవీకే శ్రేణులు చెబుతున్నాయి. ఈ తరుణంలో.. 

రెండు వారాల గడువు కోరడం వెనుక వేరే ఉద్దేశం ఉండొచ్చన్న విశ్లేషణ నడుస్తోంది. ఈలోపు సమీకరణాలు ఎలాగైనా మారొచ్చని ఆయన లెక్కేస్తున్నట్లు లీకులు అందుతున్నాయి. చిన్న చిన్న పార్టీలతో ప్రభుత్వం ఏర్పాటు చేస్తే ఎప్పటికైనా రిస్క్‌ ఉండొచ్చు. అందుకే పెద్ద చేపలకే ఆయన గాలం వేసి ఉంటారనే విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ గ్యాప్‌లో డీఎంకే లేదంటే అన్నాడీఎంకే నుంచి పలువురు బయటకు వచ్చి విజయ్‌కు మద్దతు ప్రకటించే అవకాశం లేకపోలేదు(అసలే అన్నాడీఎంకేలో ఆ అసంతృప్తుల సంఖ్య మరీ ఎక్కువగా ఉంది). 

ఇందుకు అవకాశం ఉండడంతోనే.. డీఎంకే, అన్నాడీఎంకేలు అప్రమత్తం అయ్యాయి. ఇవాళ చెన్నైలో ఆ పార్టీలు కీలక సమావేశాలు పెట్టుకున్నాయి. ఎమ్మెల్యేలంతా చెన్నైకు తరలి రావాలని ఆదేశించాయి. అటు నుంచి అటే వాళ్లను కూడా రిసార్ట్‌లకు తరలించవచ్చనే చర్చా అక్కడ జోరందుకుంది. మొత్తానికి విజయ్‌ మాస్టర్‌ స్ట్రోక్‌కు తమిళనాట దిగ్గజ పార్టీలు విలవిలలాడిపోతున్నాయి.

Advertisement
 
Advertisement
Advertisement