ఉచిత వ్యాక్సినేషన్, రేషన్‌.. కేంద్రంపై రూ.1.45 లక్షల కోట్ల భారం

Centre To Spend Rs 1.45 Lakh Crore For Free COVID Vaccination, Ration Scheme - Sakshi

వ్యాక్సినేషన్‌కు ఇప్పటికే బడ్జెట్‌ కేటాయింపులు రూ.35,000 కోట్లు 

ప్రధాని భరోసాతో మరో   రూ.15,000 కోట్ల అదనపు భారం 

ఇక రూ.80 కోట్ల మందికి రేషన్‌ ఖర్చు రూ.1.3లక్షల కోట్లు 

నిపుణుల విశ్లేషణ

న్యూఢిల్లీ: ఉచిత వ్యాక్సినేషన్‌ అలాగే కరోనా సెకండ్‌ వేవ్‌తో తీవ్రంగా నష్టపోయిన పేద ప్రజలకు ఆహార ధాన్యాల పంపిణీల విషయంలో కేంద్రంపై రూ.1.45 లక్షల కోట్ల అదనపు భారం పడనుందని మంగళవారం నిపుణులు విశ్లేషించారు. 18 ఏళ్లు దాటిన వయోజనులందరికీ వ్యాక్సిన్‌ ఖర్చును కేంద్రమే భరిస్తుందని సోమవారం ప్రధాని నరేంద్రమోదీ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నెల 21 నుంచి దేశ వ్యాప్తంగా దీనిని అమలు చేయనున్నట్లు ప్రధాని తెలిపారు. ఇక పేదలకు నవంబర్‌ వరకూ ఉచిత రేషన్‌ను ఇవ్వనున్నట్లూ జాతినుద్దేశించి చేసిన ప్రసంగంలో ఆయన పేర్కొన్నారు. ప్రధాని ప్రకటనకు సంబంధించి ఈ అంశంతో సంబంధం ఉన్న ఉన్నత స్థాయి నిపుణుల విశ్లేషణలో కొన్ని ముఖ్యాంశాలను పరిశీలిస్తే... 

వయోజనులకు ఉచిత వ్యాక్సినేషన్‌ వ్యయం రూ.45,000 కోట్ల నుంచి రూ.50,000 కోట్ల మధ్య ఉంటుంది. కేంద్రం 2021–22 బడ్జెట్‌లో కేటాయించిన రూ.35,000 కోట్లకన్నా ఇది అధికం. అంటే వ్యాక్సినేషన్‌పై ప్రధాని తాజా ప్రకటనతో పడే అదనపు భారం దాదాపు రూ.15,000 కోట్లన్నమాట.  
ఇక ఐదు కేజీల గోధుమలు లేదా బియ్యం, కేజీ పప్పు ధాన్యాలు నెలనెలా నవంబర్‌ వరకూ దాదాపు 80 కోట్ల మంది లబ్దిదారులకు అందిస్తే, ఈ వ్యయం దాదాపు రూ.1.1 లక్షల కోట్లు రూ.1.3 లక్షల కోట్ల మధ్య ఉంటుంది. నిజానికి ఉచిత రేషన్‌ జూన్‌ వరకూ అమలు జరుగుతోంది. దీనిని నవంబర్‌ వరకూ పొడిగిస్తున్నట్లు ప్రధాని తెలిపారు.  
పై రెండు ప్రయోజనాలనూ పరిగణనలోకి తీసుకుంటే కేంద్రంపై బడ్జెట్‌ కేటాయింపులు కాకుండా అదనంగా రూ.1.45 లక్షల కోట్ల వ్యయ భారం పడుతుంది.  
ప్రభుత్వ ఆదాయాలకు సంబంధించి జరుగుతున్న విశ్లేషణలను పరిశీలిస్తే, కఠిన ద్రవ్య పరిస్థితులతో తీవ్ర ఇబ్బందుల్లో ఉన్న కేంద్రానికి ఆర్‌బీఐ రూ.99,122 కోట్ల డివిడెండ్‌ బదలాయింపులు ఇప్పటికే పెద్ద ఊరట. అంచనాలకన్నా ఇది అదనం.  ఆర్‌బీఐ, ప్రభుత్వ రంగ బ్యాంకులు, ఫైనాన్స్‌ సంస్థల నుంచి కేవలం రూ.53.511 కోట్లు అందుబాటులోకి వస్తాయని 2021–22 బడ్జెట్‌ అంచనావేసింది. అంచనాలకు భిన్నంగా  మార్చి 31వ తేదీతో ముగిసిన తొమ్మిది నెలల ‘అకౌంటింగ్‌ కాలంలో’ మార్కెట్‌ ఆపరేషన్లు, పెట్టుబడులు తాను పొందిన మొత్తంలో వ్యయాలుపోను మిగులును కేంద్రానికి ఆర్‌బీఐ బదలాయించాలని సెంట్రల్‌ బ్యాంక్‌ ఇప్పటికే నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఇక పెట్రోల్, డీజిల్‌ రికార్డు పన్నుల నుంచి కేంద్రానికి భారీ ఆదాయం ఒనగురుతోంది. ఈ రెండింటి ద్వారా వచ్చే ఆదాయాలు ఉచిత వ్యాక్సినేషన్, ఆహార ధాన్యాల పంపిణీ వ్యయాలకు దాదాపు సరిపోతుందని అంచనా.  
వ్యాక్సినేషన్లు ఎలా, ఎక్కడ నుంచి పొందుతారన్న విషయంలో ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. ప్రస్తుతం భారత్‌ సిరమ్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియా ఉత్పత్తి చేస్తున్న ఆస్ట్రాజనికా వ్యాక్సిన్‌ను, అలాగే దేశీయంగా భారత్‌ బయోటెక్‌ అభివృద్ధి చెందిన మరో వ్యాక్సిన్‌ను వినియోగిస్తోంది. దీనికితోడు  రష్యా అభివృద్ధి చేసిన స్పూత్నిక్‌ వీ వ్యాక్సినేషన్‌ను కూడా ఈ నెల్లో దేశంలో ప్రారంభించనున్నారు. అదనపు వ్యాక్సిన్ల కొనుగోలుకు కేంద్రం ఇతర విదేశీ వ్యాక్సిన్‌ తయారీ కంపెనీలతో చర్చిస్తోంది. దేశంలో జనవరి 16న వ్యాక్సినేషన్‌ కార్యక్రమం ప్రారంభమైంది. తొలుత పూర్తి నత్తనడకగా ప్రారంభమైన వ్యాక్సినేషన్‌ కార్యక్రమం సెకండ్‌ వేవ్‌ ఆందోళనలతో ప్రస్తుతం కొంత ఊపందుకుంది. 23 కోట్ల డోస్‌ల వ్యాక్సినేషన్లు జరిగాయి.  
సెకండ్‌ వేవ్‌లో మే 7న 4,14,188 కేసుల గరిష్టాన్ని తాకిన కేసులు తాజాగా లక్ష దిగువకు పడిపోయాయి. దేశ వ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో కర్ఫ్యూలు, లాక్‌డౌన్లు విధించడం దీనికి కారణం. ఈ పరిస్థితుల్లో భారత్‌ ఎకానమీ వృద్ధి 2021–22 ఆర్థిక సంవత్సరంలో 7.9 శాతం నుంచి 9.5 శాతం మధ్య పరిమితం అవుతుందని అంచనాలు ఉన్నాయి. మూడవ వేవ్‌ ఆందోళనల నేపథ్యంలో ప్రస్తుత లాక్‌డౌన్ల... ఆన్‌లాకింగ్‌ ప్రక్రియపై ఆచితూచి వ్యవహరించాలని రాష్ట్రాలకు సూచనలు అందుతున్నాయి.  
మహమ్మారి సెకండ్‌వేవ్‌ విజృంభించడానికి కేవ లం కొద్ది వారాల ముందు మార్చిలో  ‘కోవిడ్‌– 19 మహమ్మారికి భారత్‌లో –ఎండ్‌గేమ్‌– పడుతు న్నట్లే’ అంటూ కేంద్రం ఆర్థిక మంత్రి హర్‌‡్షవర్థన్‌ చేసిన ప్రకటన అలాగే ఈ ప్రకటన ద్వారా భారత్‌ ఇతర దేశాలకు వైద్య వనరుల ఎగుమతులు, ప్రత్యేకించి 19.3 కోట్ల డోస్‌లను ఇతర దేశాలకు ఎగుమతులు తీవ్ర విమర్శకు కారణమైంది.  
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఆహార సబ్సిడీ రూ.2.42 లక్షల కోట్లపైగా ఉంటుందని అంచనా. సవరిత అంచనాల ప్రకారం 2020– 21లో ఈ పరిమాణం రూ.4.22 లక్షల కోట్లు.  

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top