CBSE 12th board Exams 2021: జూన్‌ 1లోగా నిర్ణయం

Centre and majority of States opt to hold Class 12 board exams - Sakshi

సీబీఎస్‌ఈ క్లాస్‌ 12 పరీక్షలపై కేంద్రం వెల్లడి

25లోగా రాష్ట్రాలు సూచనలు ఇవ్వాలి

పరీక్షల నిర్వహణకే మెజారిటీ రాష్ట్రాల మొగ్గు

విద్యార్థులకు టీకాలు వేశాకే పరీక్షలన్న ఢిల్లీ

రెండు ప్రతిపాదనలు చేసిన సీబీఎస్‌ఈ

న్యూఢిల్లీ: కోవిడ్‌ సంక్షోభం నేపథ్యంలో.. సీబీఎస్‌ఈ క్లాస్‌ 12 పరీక్షల నిర్వహణపై జూన్‌ 1వ తేదీలోగా నిర్ణయం తీసుకుంటామని కేంద్రం వెల్లడించింది. పరీక్షల నిర్వహణపై రాష్ట్రాల్లో కొంతవరకు ఏకాభిప్రాయం వ్యక్తమైందని కేంద్ర విద్యాశాఖ మంత్రి రమేశ్‌ పోఖ్రియాల్‌ నిషాంక్‌ తెలిపారు. రాష్ట్రాలు తమ అభిప్రాయాలు, సూచనలను సమగ్రంగా మే 25 లోగా తమకు పంపించాలని కోరారు. క్లాస్‌ 12 పరీక్షల నిర్వహణపై ఆదివారం కేంద్ర రక్షణమంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ అధ్యక్షతన ఉన్నతస్థాయి సమావేశం జరిగింది.

రాష్ట్రాలు తమ అభిప్రాయాలను ఈ సమావేశంలో వ్యక్తం చేశాయి. పరీక్షలు నిర్వహించకూడదనే ప్రతిపాదనను పరిగణనలోకి తీసుకోవాలని మహారాష్ట్ర, పరీక్షలకు ముందే విద్యార్థులకు వ్యాక్సినేషన్‌ చేయాలని ఢిల్లీ, కేరళ సూచించాయి. మరోవైపు, జూలై 15 నుంచి ఆగస్ట్‌ 26 మధ్య పరీక్షలు నిర్వహించి, సెప్టెంబర్‌లో ఫలితాలను విడుదల చేయాలని సెంట్రల్‌ బోర్డ్‌ ఆఫ్‌ సెకండరీ ఎడ్యుకేషన్‌ (సీబీఎస్‌ఈ) సూచించింది. పరీక్షల నిర్వహణకు సంబంధించి సీబీఎఎస్‌ఈ రెండు ప్రతిపాదనలు చేసినట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. అవి

1) కొన్ని ఎంపిక చేసిన కేంద్రాల్లో మొత్తం 19 మేజర్‌ సబ్జెక్టుల్లో పరీక్షలు నిర్వహించాలి. మైనర్‌ సబ్జెక్టుల ఫలితాలను మేజర్‌ సబ్జెక్టుల్లో ఫలితాల ఆధారంగా నిర్ణయించాలి. మూడునెలల్లో మొత్తం ప్రక్రియను ముగించాలి. తొలినెలలో ప్రీ ఎగ్జామ్‌ యాక్టివిటీ, రెండోనెలలో పరీక్షలు, మూడోనెలలో ఫలితాలు వెల్లడించాలి.

2) మూడు గంటలు కాకుండా, గంటన్నర పాటే, వారి పాఠశాలలోనే పరీక్షలు జరపాలి. పరిస్థితిని బట్టి రెండుసార్లు పరీక్షలను నిర్వహించవచ్చు. జూలై 15 నుంచి ఆగస్ట్‌ 1 మధ్య ఫస్ట్‌ ఫేజ్, ఆగస్ట్‌ 8–26 మధ్య సెకండ్‌ ఫేజ్‌ పరీక్షలను నిర్వహించవచ్చు. కరోనా కారణంగా ఏ విద్యార్థి అయినా పరీక్ష రాయలేనట్లయితే.. ఆ విద్యార్థికి మరో అవకాశం ఇవ్వాలి. ఆబ్జెక్టివ్, షార్ట్‌ ఆన్సర్‌ తరహాలో ప్రశ్నపత్రం ఉండాలి. ఒక లాంగ్వేజ్, మూడు ఎలెక్టివ్‌ సబ్జెక్టుల్లో విద్యార్థి పరీక్ష రాయాల్సి ఉంటుంది.  

రాష్ట్రాల్లో భిన్నాభిప్రాయం
సీబీఎస్‌ఈ మొదటి ప్రతిపాదనను కొన్ని రాష్ట్రాలు, రెండో ప్రతిపాదనను మెజారిటీ రాష్ట్రాలు సమర్ధించినట్లు సమాచారం. 10వ తరగతి పరీక్షలను సీబీఎస్‌ఈ  ఇప్పటికే రద్దు చేసింది. ఏప్రిల్‌–మేలో నిర్వహించాల్సిన జేఈఈ మెయిన్స్‌ కూడా వాయిదా పడిన విషయం తెలిసిందే. సమావేశం ఫలవంతంగా జరిగిందని, రాష్ట్రాల నుంచి విలువైన సూచనలు అందాయని రమేశ్‌ పోఖ్రియాల్‌ పేర్కొన్నారు. ‘సలహాలు, సూచనలతో సమగ్ర నివేదికను మే 25లోపు పంపించాలని రాష్ట్రాలను కోరాం. ఆ తరువాత సాధ్యమైనంత త్వరగా ఒక నిర్ణయం తీసుకుని, అనిశ్చితికి తెరవేస్తాం’ అని వెల్లడించారు.

కేంద్ర మంత్రులు స్మృతి ఇరానీ, ప్రకాశ్‌ జవదేకర్, సంజయ్‌ ధాత్రే, పలు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల విద్యాశాఖ మంత్రులు, కార్యదర్శులు ఈ వర్చువల్‌ సమావేశానికి హాజరయ్యారు. మరోవైపు, విద్యార్థులు, తల్లిదండ్రుల నుంచి పరీక్షలను రద్దు చేయాలన్న డిమాండ్‌ కూడా గట్టిగా వినిపిస్తోంది. ‘క్యాన్సిల్‌బోర్డ్‌ఎగ్జామ్స్‌’ హ్యాష్‌ట్యాగ్‌ ట్విట్టర్‌లో ట్రెండింగ్‌లో ఉంది. 

పరీక్షల నిర్వహణకు తాము వ్యతిరేకమని, టీకాలు వేయకుండా విద్యార్థులను పరీక్షలు రాయమనడం పెద్ద పొరపాటవుతుందని ఢిల్లీ ఉపముఖ్యమంత్రి మనీశ్‌ సిసోడియా వ్యాఖ్యానించారు. దేశవ్యాప్తంగా 1.5 కోట్ల మంది క్లాస్‌ 12 విద్యార్థులున్నారని, వారిలో 90% 17 ఏళ్లు పైబడినవారేనని ఆయన వివరించారు. వారికి కోవిడ్‌ టీకా ఇవ్వడానికి వీలవుతుందేమో నిపుణులతో చర్చించాలని సూచించారు. పరీక్షల నిర్వహణకు సుముఖమే కానీ, కరోనా పరిస్థితులు సద్దుమణిగిన తరువాత పరీక్షలు జరిపితే మంచిదని భావిస్తున్నట్లు తమిళనాడు పేర్కొంది. ఈ పరీక్షలు విద్యార్థుల కెరీర్‌కు ఎంతో ముఖ్యమంది.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top