Farm Laws: రద్దు’ ఇప్పుడే ఎందుకు?

Center decided to repeal farm laws now for 5 stattes polls, Public opposition - Sakshi

ముంచుకొస్తున్న ఎన్నికలు

ప్రజా వ్యతిరేకతను తగ్గించుకోవడం

అన్నదాతలను శాంతింపజేయడం

విపక్షాలకు అస్త్రాలు లేకుండా చేయడం

బీజేపీ ఆశించిన లక్ష్యాలివే

Reason Behind Farm Law Repeal In Telugu: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మూడు వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకోవడానికి ఈ సమయాన్నే ఎంచుకోవడం వెనుక పెద్ద వ్యూహం దాగి ఉన్నట్లు స్పష్టమవుతోంది. మూడు సాగు చట్టాలకు వ్యతిరేకంగా రైతు ఆందోళనలు మొదలై ఈ నెల 26తో ఏడాది పూర్తవుతుంది. ఈలోగా తమ డిమాండ్లకు ప్రభుత్వం తలొగ్గకపోతే ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని సంయుక్త కిసాన్‌ మోర్చా (40 రైతు సంఘాల సమాఖ్య) ప్రకటించింది. మరోవైపు ఈ నెల 29 నుంచి పార్లమెంట్‌ శీతాకాల సమావేశాలు ప్రారంభం కానున్నాయి.

సాగు చట్టాలు, పెగాసస్‌ స్పైవేర్‌ అంశంపై అనునిత్యం పార్లమెంట్‌ ఉభయ సభలు అట్టుడికి వర్షాకాల సమావేశాలు దాదాపుగా తుడిచిపెట్టుకుపోయిన విషయం తెలిసిందే. మరో నాలుగు నెలల్లో ఐదు రాష్ట్రాల (ఉత్తరప్రదేశ్, పంజాబ్, ఉత్తరాఖండ్, గోవా, మణిపూర్‌) అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ప్రజా వ్యతిరేకతను మరింతగా పెంచుకోవాలని ఏ రాజకీయ పార్టీ కూడా కోరుకోదు. డిసెంబర్‌ 23 దాకా పార్లమెంట్‌ సమావేశాలు కొనసాగుతాయి. రైతుల నిరసనలు, నల్ల చట్టాల అంశమే నిత్యం వార్తల్లో ఉంటే.. ఎన్నికలు జరిగే రాష్ట్రాల్లో విపక్షాలూ ఎలాగూ దీన్ని అందిపుచ్చుకొని ప్రధానాస్త్రంగా చేసుకుంటాయి.

వెరసి కాషాయ పార్టీపై ప్రజావ్యతిరేకత ప్రబలుతుంది. అందుకే బీజేపీ వ్యూహకర్తలు పట్టువిడుపులు ప్రదర్శించారు. రాబోయే పార్లమెంట్‌ సమావేశాల్లో విపక్షాలు సాగు చట్టాలు, పెట్రోధరల లాంటి అంశాలను హైలైట్‌ చేస్తూ పతాక శీర్షికలకు ఎక్కితే అది కచ్చితంగా ప్రజల్లో కేంద్ర ప్రభుత్వ విధానాల పట్ల ప్రతికూల సంకేతాలను పంపుతుంది. ఇది కాషాయ దళానికి అభిలషణీం కాదు. ఏడాది కాలంగా ఏమీ పట్టించుకోకున్నా ఇప్పుడిక ‘సమయం’ లేదు కాబట్టే సాగు చట్టాల ఉపసంహరణకు కేంద్రం మొగ్గుచూపింది. పార్లమెంట్‌ శీతాకాల సమావేశాల్లో విపక్షాల ప్రధానాస్త్రాలు మూడింటి విషయంలోనూ ఇప్పుడు కేంద్రం ప్రభుత్వానికి ‘దాటవేత’ ధోరణిని అధిగమించి ఎదురునిలిచి బదులిచ్చే వెసులుబాటు కలిగింది.

ఎదురుదాడి
ఇటీవల పలు రాష్ట్రాల్లో ఉప ఎన్నికల ఫలితాల్లో తేడాకొట్టిన వెనువెంటనే కేంద్ర ప్రభుత్వం పెట్రోల్‌పై రూ.5, డీజిల్‌పై రూ.10 చొప్పున సెంట్రల్‌ ఎక్సైజ్‌ డ్యూటీని తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. ముందస్తు ప్రణాళిక ప్రకారమే అన్నట్లుగా బీజేపీ, ఎన్డీయేపాలిత రాష్ట్రాలు సైతం పెట్రో ఉత్పత్తులపై వ్యాట్‌ను తగ్గిస్తూ గంటల వ్యవధిలో పోటీలు పడి ప్రకటనలు విడుదల చేశాయి. ఇప్పుడిదే అంశాన్ని పట్టుకొని బీజేపీ పార్లమెంట్‌ శీతాకాల సమావేశాల్లో విపక్షాల నోరునొక్కడానికి ప్రయత్నిస్తుందనడంలో సందేహం లేదు. మీ రాష్ట్రాల్లో వ్యాట్‌ను ఎందుకు తగ్గించట్లేదని ఎదురుదాడికి దిగుతుంది. ఇతర ఏ అంశాన్ని విపక్షాలు ప్రస్తావించినా బీజేపీ మాత్రం వ్యాట్‌ ఎందుకు తగ్గించలేదనే అంశాన్నే తెరపైకి తెస్తూ తప్పించకోజూస్తుంది.

కేంద్రం వసూలు చేస్తున్న ఎక్సైజ్‌ డ్యూటీని సెంట్రల్‌ పూల్‌ కింద తక్కువగా చూపుతూ సెస్‌ల రూపంలో అధికంగా పిండుకుంటోంది. అసలే రాష్ట్రాలకు ఆదాయ వనరులు తక్కువని, కోవిడ్‌–19 వ్యాప్తితో రాబడి మరింత దెబ్బతిందని, ఈ నేపథ్యంలో వ్యాట్‌ తగ్గింపు సాధ్యం కాదని పశ్చిమ బెంగాల్‌ సీఎం మమతా బెనర్జీ, తెలంగాణ సీఎం కేసీఆర్, తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్, ఇతర విపక్ష పాలిత రాష్ట్ర ప్రభుత్వాలు వాదిస్తున్నాయి. 

వ్యాట్‌ తగ్గింపు అంశాన్ని ప్రతిరోజూ హైలైట్‌ చేయడం ద్వారా ఇతర అంశాలను మరుగున పడేయడానికి పార్లమెంట్‌ సమావేశాల్లో  బీజేపీ తప్పకుండా ప్రయత్నం చేస్తుందనడంలో సందేహం లేదు. అంతిమంగా ప్రజా వ్యతిరేకతను వీలైనంత తగ్గించుకొని, విపక్షాలకు అస్త్రాలేవీ లేకుండా చేయాలని, తద్వారా అసెంబ్లీ ఎన్నికల్లో గట్టెక్కాలని బీజేపీ లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలుస్తోంది.

ఆలస్యమైనా ఉపశమనం
సదుద్దేశంతో రైతుల మేలుకోరి మూడు కొత్త వ్యవసాయ చట్టాలను తెచ్చినా కొందరినీ ఒప్పించలేక వీటిని వెనక్కి తీసుకుంటున్నట్లు ప్రధాని మోదీ ఈనెల 19న ప్రకటించారు. దేశానికి క్షమాçపణ చెప్పారు. ఉపసంహరణ æప్రక్రియను పార్లమెంట్‌ శీతాకాల సమావేశాల్లోనే పూర్తి చేస్తామన్నారు. రైతు ఆందోళనల్లో కీలక భూమిక పోషిస్తున్న జాట్‌లు 136 స్థానాలున్న పశ్చిమ యూపీలో బీజేపీయేతర ఓటును ఏకతాటిపైకి చేర్చకుండా చూసుకోవాలంటే రైతు చట్టాలను రద్దు చేయాలి.

పంజాబ్‌ జనాభాలో 21 నుంచి 25 శాతం జాట్‌ సిక్కులు ఉన్నారు. ఇతర సిక్కుల్లోనూ రైతులే అధికం. వీరి ఆగ్రహాన్ని చల్లార్చాలి. ఈ రెండింటినీ బీజేపీ ఆశించింది. ఇప్పుడిక కాంగ్రెస్, మిగతా విపక్షాలు రైతు ఎజెండాపై ఇదివరకటిలా మోదీ సర్కారుపై ముప్పేట దాడికి దిగలేవు. ‘కనీస మద్దతు ధర’ అంశం ఇకపై ఇరుపక్షాల నడుమ సంఘర్షణకు కేంద్ర బిందువు అయ్యే అవకాశాలున్నాయి.

ప్రస్తుతానికి ఊరట
విపక్ష నేతలు, జర్నలిస్టులు, సామాజిక కార్యకర్తలపై పెగాసస్‌ స్పైవేర్‌తో (ఇజ్రాయెల్‌ సంస్థ ఎన్‌ఎస్‌ఓ తయారీ) నిఘా పెట్టారని, ఫోన్లను ట్యాప్‌ చేశారని, దీనిపై ప్రభుత్వం విస్పష్టమైన సమాధానం ఇవ్వాలని విపక్షాలు పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాలను స్తంభింపజేశాయి. సీనియర్‌ జర్నలిస్టులు కొందరు సుప్రీంకోర్టుకు ఎక్కారు. చట్టవిరుద్ధంగా తామేమీ నిఘా పెట్టలేదని, దేశ భద్రతకు సంబంధించిన అంశం కాబట్టి ఇంతకు మించి వివరాలను వెల్లడించలేమని మోదీ సర్కా రు సుప్రీంకోర్టులో వాదించింది. ఇందులోని నిజా నిజాలను నిగ్గుతేల్చడానికి మాజీ జడ్జి ఆర్‌.వి.రవీంద్రన్‌ నేతృత్వంలో ముగ్గురు సాంకేతిక నిపుణులతో కమిటీని సుప్రీంకోర్టు నియమించింది. అంటే పెగాసస్‌పై కేంద్రానికి తాత్కాలిక ఊరట లభించినట్లే. విపక్షాలు దీన్ని లేవదీసినా అంశం కోర్టు పరిధిలో ఉందని, ఏమైనా ఉంటే సాంకేతిక కమిటీకి విన్నవించుకోవాలంటూ కేంద్రం చేతులు దులుపుకునే అవకాశం ఉంటుంది.

– నేషనల్‌ డెస్క్, సాక్షి  

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top