Uttar Pradesh: మాఫియాపై ఉక్కుపాదం..ఉమేష్‌ పాల్ హత్య కేసు నిందితుల నివాసాలు బుల్‌డోజర్లతో కూల్చివేత

Bulldozers Property Of Atiq Ahmed Close Aide Up - Sakshi

లక్నో: మాఫియాపై మరోసారి ఉక్కుపాదం మోపారు ఉత్తర్‌ప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్. ప్రయాగ్‌రాజ్‌లో పట్టపగలే జరిగిన ఉమేష్ పాల్‌ హత్య కేసుతో సంబంధం ఉన్న నిందితుల నివాసాలను బుల్‌డోజర్లతో కూల్చివేశారు. ప్రయాగ్‌రాజ్‌  డెవలప్‌మెంట్ అథారిటీ అధికారులు, పోలీసులు మొత్తం 20 మంది నిందితులను గుర్తించి వారిపై చర్యలు తీసుకున్నారు.

2005లో జరిగిన బీఎస్పీ ఎమ్మెల్యే రాజు పాల్‌ హత్య కేసులో ఉమేష్‌ పాల్ ప్రత్యక్ష సాక్షి.  గ్యాంగ్‌స్టర్ అతిఖ్ అహ్మద్, అతని భార్య, కొడుకుతో పాటు బీఎస్పీ నేత శైష్ఠ పర్వీన్ ఈ కేసులో ప్రధాన నిందితులు. అయితే ప్రస్తుతం జైలులో ఉన్న అతిఖ్.. ఉమేశ్‌ పాల్‍ను కోర్టులో వాంగ్మూలం ఇవ్వకుండా హత్య చేయించాడు. పట్టపగలే తన ఇంటిముందే ఉమేష్‌ పాల్‌ను దుండగులు కాల్పిచంపడం ప్రయాగ్‌రాజ్‌లో కలకలం రేపింది. 

దీంతో రంగంలోకి దిగిన పోలీసులు మొత్తం 20 మంది నిందితులను గుర్తించారు. ప్రయాగ్‌రాజ్‌లో వారి ఆస్తులను బుల్‌డోజర్లతో కూల్చివేస్తున్నారు. ఈ కూల్చివేత దృశ్యాలను కొందరు సామాజిక మాధ్యమాల్లో షేర్ చేసి యోగి ప్రభుత్వంపై ప్రశంసలు కురిపిస్తున్నారు.

ఇటీవల అసెంబ్లీలో సమాజ్‌వాదీ పార్టీ గురించి మాట్లాడుతూ.. మాఫియాను మట్టికరిపిస్తామని యోగి అదిత్యనాథ్ హెచ్చరించారు.  నేరారోపణలు ఎదుర్కొంటున్న వారికి ఎస్పీ ఎంపీ టికెట్ ఇచ్చి గెలిపించింది నిజం కాదా? అని ప్రశ్నించారు.  నేరస్థులను మీరు ప్రోత్సహించి, వారికి మూలమాలలు వేసి సత్కరించి.. నేరం జరిగినప్పుడు మాత్రం ప్రభుత్వాన్ని నిందించడమేంటని మండిపడ్డారు.

అయితే యోగి ఆదిత్యనాథ్ బుల్‌డోజర్‌ పాలసీపై విమర్శలు కూడా వస్తున్నాయి. ఓ వర్గం వారిని లక్ష‍్యంగా చేసుకునే ఈ కూల్చివేతలు జరుగుతున్నాయని పలువురు ఆరోపిస్తున్నారు.
చదవండి: మందుబాబులకు గుడ్‌ న్యూస్‌.. ఉదయం 3 వరకు బార్లు ఓపెన్.. ఎక్కడంటే?

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top