జైహింద్‌ స్పెషల్‌.. నిప్పుకణం నేతాజీ

Azadi Ka Amrit Mahotsav: Indian Nationalist Netaji Subhas Chandra Bose - Sakshi

యుద్ధంలో రేగిన దుమ్ము కుదురుకోక ముందే బ్రిటన్‌ చేతుల్లోంచి ఫ్రీడమ్‌ని లాగేసుకునేందుకు బోస్‌ కాచుక్కూర్చున్నారు. బ్రిటన్‌ సతమతం అవుతున్నప్పుడే దానిని చావుదెబ్బ తియ్యాలని బోస్‌ ఆలోచన. గారిబాల్డీ, మేజినీ అతడిని లోలోపల  రాజేస్తున్నారు. 1939. భారత జాతీయ కాంగ్రెస్‌ పైకి కలిసే ఉంది కానీ, లోపల రెండుగా విడిపోయింది. గాంధీజీ–నేతాజీ వర్గాలవి! పార్టీ అధ్య ఎన్నికల్లో.. ‘‘బోస్‌.. ఈసారి నువ్వు పోటీ చేయకు’’ అన్నారు గాంధీజీ. కానీ నేతాజీ విన్లేదు! మీ మాట మీద నాకు ఎంత గౌరవం ఉందో, నా సిద్ధాంతం మీద నాకు అంతే గౌరవం ఉంది అన్నాడు. ముత్తురామలింగం దేవర్‌ ముందుకొచ్చి బోస్‌ వైపు నిలబడ్డారు. సౌత్‌ ఇండియా ఓట్లన్నీ బోస్‌కి పడ్డాయి. నేతాజీ గెలిచారు. వరుసగా రెండోసారి నేషనల్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడయ్యారు. 

విజేత నిష్క్రమణ!
ప్రజలు సాయుధ పోరాటాన్ని కోరుకుంటున్నారా? గాంధీజీని వద్దనుకుంటున్నారా? లేదు. గాంధీజీ చేతిలో తుపాకీని చూడాలనుకుంటున్నారు! సర్వసభ్య సమావేశంలో కల్లోలం మొదలైంది. ఎవరు అంత మాట అన్నది?! మహాత్ముడిని మామూలు మనిషిగా చూడాలనుకుంటున్నారా? ఆ మాట అన్నదెవరో ముందుకు రండి. 
‘‘ఇంకెవరు? బోస్‌ ముఠా!’’–  శాంతి ప్రియుల సహనం చచ్చిపోతోంది. పళ్లు పటపటలాడిస్తున్నారు.
‘‘పార్టీ నుంచి వెళ్లగొట్టండి పొగురుబోతుల్ని’’ – పెద్దగా అరుపులు. 
‘‘అవునవును. వెళ్లగొట్టాలి’’ 
బోస్‌ని పిలిపించారు గాంధీజీ. ‘‘వింటున్నావా?’’ అన్నారు. 
పార్టీ నుంచి బయటికి వచ్చేశారు నేతాజీ! వచ్చి, ‘ఫార్వర్డ్‌ బ్లాక్‌’ పార్టీ పెట్టారు. దేవర్‌ కూడా ఆయనతో పాటు వచ్చేశారు. మొదటి బహిరంగ సభ మధురైలో. వీధులు చాల్లేదు. ఆకాశం కావలసి వచ్చింది. జనం మేడలు మిద్దెలు ఎక్కి కూర్చున్నారు. 
‘‘ఎవరు వచ్చింది గాంధీజీనా?’’ వృద్ధ మూర్తులెవరో అడుగుతున్నారు. 
‘‘కాదు, నేతాజీ సుభాస్‌ చంద్రబోస్‌.’’

ఇంగ్లండ్‌కు పయనం
రెండో ప్రపంచ యుద్ధం మొదలైంది. 
యుద్ధం ముగిశాక బ్రిటన్‌ మనకు ఫ్రీడమ్‌ ఇచ్చేస్తుందని గాంధీ, నెహ్రూ, కాంగ్రెస్‌లోని పెద్దలు నిరీక్షిస్తూ ఉన్నారు.
యుద్ధంలో రేగిన దుమ్ము కుదురుకోక ముందే బ్రిటన్‌ చేతుల్లోంచి ఫ్రీడమ్‌ని లాగేసుకునేందుకు బోస్‌ కాచుక్కూర్చున్నారు. బ్రిటన్‌ సతమతం అవుతున్నప్పుడే దానిని చావుదెబ్బ తియ్యాలని బోస్‌ ఆలోచన. గారిబాల్డీ, మేజినీ అతడిని లోలోపల  రాజేస్తున్నారు. 
కటక్‌ స్టివార్డ్‌ స్కూల్లో చదువుకుంటున్నప్పుడు మొదటిసారిగా గ్యారీ, మేజినీల గురించి విన్నాడు బోస్‌. అక్కడే రేవన్‌షా కాలేజియేట్‌ స్కూల్లో వాళ్ల గురించి చదివాడు. ఇద్దరూ ఇటాలియన్‌ లీడర్స్‌. కొత్త ఆలోచనలతో దేశానికి కొత్త రక్తం ఎక్కించినవారు. ఒకరు నేషనల్‌ హీరో. ఇంకొకరు సోల్‌ ఆఫ్‌ ఇటలీ! వాళ్లు అవహించారు బోస్‌ని. బ్రిటన్‌ని తరిమికొట్టాక ఇండియాని కొన్నాళ్లయినా ఇటలీలా, టర్కీలా సోషలిస్టు నియంతృత్వంలోకి నడిపించాలని అతడి కల. బ్రిటన్‌ డిసిప్లీన్‌ కూడా  బోస్‌కి నచ్చుతుంది! కానీ ఆ జులుం! దాన్నే భరించలేకపోతున్నాడు. 

బ్రిటన్‌ లేబర్‌ పార్టీలో థింకర్స్‌ కొందరు ఉన్నారు. లార్డ్‌ హాలిఫాక్స్, జార్జి లాన్స్‌బరీ, క్లెమెంట్‌ అట్లీ, గిల్బర్ట్‌ ముర్రే, సర్‌ స్టాఫోర్డ్‌ క్రిప్స్‌... వీళ్లందరితోనూ ఇంగ్లండ్‌ వెళ్లి తన ఆలోచనల్ని పంచుకున్నాడు బోస్‌. కన్సర్వేటివ్‌ పార్టీ నాయకులు మాత్రం బోస్‌ని దగ్గరకు రానివ్వలేదు. బ్రిటన్‌ అప్పుడు ఉన్నది కన్సర్వేటివ్‌ల చేతుల్లోనే. వలస దేశీయుడితో మాటలేమిటని వాళ్లంతా మొహం చాటేశాడు. బోస్‌ ఇండియా వచ్చేశాడు.  

తిరిగి ఇండియాకు
వచ్చీరాగానే వార్త! బ్రిటన్‌ తరఫున ఇండియా కూడా ప్రపంచ యుద్ధంలోకి వచ్చేస్తోందని వైశ్రాయ్‌ లిన్‌లిత్‌గో ప్రకటించాడని!! ఇండియన్‌ నేషనల్‌ కాంగ్రెస్‌తో ఒక్కమాటైనా చెప్పకుండా తీసుకున్న ప్రకటన అది. బోస్‌ తిరగబడ్డాడు! మనది కాని యుద్ధాన్ని మనం చేయడం ఏమిటని గాంధీజీతో అన్నారు. కాంగ్రెస్‌ అయోమయంలో ఉంది. ‘‘నాకైతే క్లారిటీ ఉంది’’ అన్నాడు బోస్‌. మొత్తం కలకత్తాని వెనకేసుకుని వీధివీధీ తిరిగాడు.

గో బ్యాక్‌ అని గర్జించాడు. జైల్లో పడ్డాడు. వారం రోజులు అన్నం నీళ్లూ ముట్టకుండా జైల్లో హంగర్‌ స్ట్రైక్‌ చేసి విడుదలయ్యాడు. బోస్‌ దేశం దాటకుండా బ్రిటిష్‌ ప్రభుత్వం కలకత్తాలో అతడు ఉంటున్న ఇంట్లోనే అతడిని బంధించింది. చుట్టూ నిఘా పెట్టింది.
బోస్‌ దేశం దాటితే ఏమౌతుంది? దాటకుండానే ఏడు చెరువుల నీళ్లు తాగిస్తున్నాడు. దాటితే ఏడు ఖండాల శత్రువుల్ని పోగేస్తాడు. రష్యా, జర్మనీ, జపాన్, ఇటలీ, క్రొయేషియా, థాయ్‌లాండ్, బర్మా, ఫిలిఫ్పీన్స్‌... ఇవన్నీ బ్రిటన్‌కి వ్యతిరేకం. అన్నిటినీ కలుపుకుని  భ్రిటన్‌ని ఒక ఆట ఆడుకుంటాడు.

బోస్‌ ప్లాన్లు వేస్తున్నాడు. అతడికి ఒక విషయం స్పష్టమయింది. యుద్ధం పూర్తయ్యేవరకు తనను వదిలిపెట్టరు. యుద్ధం పూర్తయితే దేశాన్ని వదిలిపెట్టరు. ఈలోపే పొగపెట్టాలి. జర్మనీతో ‘టై–అప్‌’ అయితే బ్రిటన్‌ని ఇంటికి పంపడం తేలిక. ఓం శాంతి అంటే లాభం లేదు. మిలట్రీ ట్రక్కుల నుంచి ఇండియాలోకి జర్మన్‌ సైన్యాన్ని దింపాలి. 
బోస్‌ జంప్‌! ది గ్రేట్‌ ఎస్కేప్‌!

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top