జైహింద్‌ స్పెషల్‌: యుద్ధతంత్రం.. శాంతిమంత్రం | Sakshi
Sakshi News home page

జైహింద్‌ స్పెషల్‌: యుద్ధతంత్రం.. శాంతిమంత్రం

Published Sat, Aug 6 2022 1:14 PM

Azadi Ka Amrit Mahotsav: Indian Nationalist Subhas Chandra Bose - Sakshi

పాఠం మొదలైంది. అది ఫస్టియర్‌ బి.ఎ. హిస్టరీ క్లాస్‌. కలకత్తా ప్రెసిడెన్సీ కాలేజ్‌. ప్రొఫెసర్‌ ఇ.ఎఫ్‌.ఆటెన్‌ క్లాస్‌ మొదలు పెట్టారు. అంతకుముందే అతడు స్టాఫ్‌ రూమ్‌లో కూర్చొని ఉన్నప్పుడు.. ఇండియన్‌ స్టూడెంట్స్‌కి బుద్ధీజ్ఞానం లేవన్నాడు! చిన్న ఈక్వేషన్‌ తెలుసుకోలేకపోతే ఎలా అన్నాడు.. క్లాస్‌లోకి వచ్చి, కొనసాగింపుగా. హిస్టరీ ప్రొఫెసర్‌కు సమీకరణాలతో ఏం పని? అయితే ఆయన మాట్లాడుతున్నది కూడా చరిత్ర సమీకరణాల గురించే!
చదవండి: ఆగస్టు 15న ఓలా మరో సంచలనం: బీ రడీ అంటున్న సీఈవో

ఒకే ఆత్మ.. ఒకే ఆగ్రహం
‘‘చూడండి, అధికులదే ఎప్పుడూ అధికారం. ఇండియన్స్‌ కన్నా బ్రిటిషర్లు మోరల్లీ సుపీరియర్స్‌. ఇది రియాలిటీ. దీన్ని యాక్సెప్ట్‌ చెయ్యకుండా ఎన్నాళ్లని నినాదాలిస్తారు?’’ ఆశ్చర్యంగా అడిగారు ఆటెన్‌. తోటి ప్రొఫెసర్లు మౌనంగా ఉండిపోయారు. ఇక్కడ... క్లాస్‌రూమ్‌లో స్టూడెంట్స్‌ ఉడికిపోయారు. ఆత్మగౌరవం దెబ్బతిన్నప్పుడు ఎవరైనా గౌరవ మర్యాదలు పాటిస్తున్నారూ అంటే వారు ఇంకోచోట ఎక్కడో తేల్చుకోవాలనుకున్నారని అర్థం. అయితే స్టూడెంట్స్‌లో అంత కుట్ర ఉండదు. స్టూడెంట్స్‌కి అంత నిగ్రహం ఉండదు. స్టూడెంట్స్‌కి విడివిడి ఆత్మలు ఉండవు. ఒకే దేశంలా అందరిదీ ఒకే ఆత్మ. ఒకరికి దెబ్బతగిలితే ఇంకొకరి చర్మం కములుతుంది. ఒకరికి మనసుకు గాయం అయితే ఇంకొకరి పిడికిలి బిగుసుకుంటుంది. ప్రొఫెసర్‌ ఆటెన్‌... ఒకరి మనసునే గాయపరచలేదు. 

ముందున్న కుర్రాడు
నూరేళ్ల ప్రెసిడెన్సీ కాలేజీలో ఇలాంటిది జరగలేదు! భారతదేశ చరిత్రలోనే ఇలాంటిది జరగలేదు! ఏమైంది? ఏమైందీ?! ప్రొఫెసర్‌ ఆటెన్‌పై చెయ్యి చేసుకుంటున్నారు.  ఎవరు చేసుకుంటున్నారు?.. బి.ఎ. ఫస్టియర్‌ స్టూడెంట్స్‌. ఎందుకు అని వైస్‌ ఛాన్స్‌లర్‌ అడగలేదు. ‘‘ఎవరు?’’ అని అడిగాడు. ఎవరో ఎవరినో చూపించారు. ‘‘నేనడుగుతున్నది... చెయ్యి చేసుకున్నవారి వెనుక ఉన్నది ఎవరూ అని?’’ అన్నాడు. ఎవరూ చెప్పలేదు. చెప్పకుండానే తెలుసుకున్నాడు ఛాన్స్‌లర్‌.
సు–భా–స్‌... చంద్రబోస్‌!! కానీ, బోస్‌... వెనుక లేడు. అందరికన్నా ముందు ఉన్నాడు. ఆటెన్‌ని అందరికన్నా ముందు కొట్టింది కూడా అతడేనేమో తెలీదు. ఆటెన్‌కు ‘బ్రిటిష్‌ ఇండియా’ క్షమాపణ చెప్పింది. కాలేజ్‌ రిజిష్టర్‌లో బోస్‌ పేరు ‘తొలగించడమైనది’.

గమ్యం ఒకటే.. దారులే వేరు!
హీరో అయ్యాడు బోస్‌. ‘‘వయసు?’’ ‘‘ఇరవై.’’ ‘‘కాలేజ్‌ నుంచి ఎందుకు పంపించారు?’’ ‘‘ప్రొఫెసర్‌ ఆటెన్‌ ఇండియన్స్‌ని తిట్టాడు. ప్రొఫెసర్‌ ఆటెన్‌ని మేము...’’ ‘‘అర్ధమైంది! యు ఆర్‌ ఆడ్మిటెడ్‌’’
‘‘.......’’
‘‘కానీ బోస్‌... గుర్తుంచుకో. ఆటెన్‌ని నువ్వేదో చేసినందుకు కాదు, నీ ఫ్యూచర్‌ పాడవకూడదని.’’ బోస్‌ ‘స్కాటిష్‌ చర్చెస్‌ కాలే జ్‌’ లో ఏకంగా బి.ఎ. థర్డ్‌ ఇయర్‌లో చేరాడు. ఫస్ట్‌ క్లాస్‌లో పాసై íఫిలాసఫీ పట్టాతో బయటికి వచ్చాడు. కానీ అతడికి గాంధీజీ ఫిలాసఫీ ఏమిటో అంతుబట్టడం లేదు! అహింస అంటున్నారు గాంధీజీ. దూకుడు మీదుండే ఇరవై రెండేళ్ల కుర్రాడికి.. రెణ్ణాళ్లకే సివిల్‌ సర్వీసు ఉద్యోగాన్ని కాలితో తన్నొచ్చిన జాతీయవాదికి.. బెంగాల్‌ అతివాద బెబ్బులి చిత్తరంజన్‌దాస్‌ దగ్గర పంజాకు పదును పెట్టుకున్న చిరుతకు.. యుద్ధ తంత్రాన్ని రచించకుండా శాంతిమంత్రాన్ని జపిస్తే రుచిస్తుందా?! ముళ్లదారిలో నడుస్తూ గులాబీ గుత్తుల సందేశాలను మోసుకెళ్లడం ఏమిటి? గాంధీజీ సిద్ధాంతం బోస్‌కి నచ్చలేదు. బోస్‌ దూకుడుని గాంధీజీ మెచ్చలేదు. ఇద్దరిదీ ఒకే గమ్యం. దారులు వేరు! శత్రువుకు కోసం గాంధీజీ చెంపను చూపిస్తే, నేతాజీ చూపుడు వేలిని చూపిస్తున్నాడు. అరె! కుర్ర బోస్‌... హఠాత్తుగా నేతాజీ ఎప్పుడయ్యాడు?! 

‘కాంగ్రెస్‌’కు పోటీ!
బోస్‌ హఠాత్తుగా ‘నేతాజీ’ అవలేదు. ముందు ఆలిండియా యూత్‌ కాంగ్రెస్‌ ప్రెసిడెంటు అయ్యాడు. ‘ఫార్వర్డ్‌’ న్యూస్‌పేపర్‌కి ఎడిటర్‌ అయ్యాడు. కలకత్తా మున్సిపల్‌ కార్పొరేషన్‌ సి.ఇ.వో. అయ్యాడు. చుట్టుముట్టిన పోలీసులకు చిక్కి అరెస్ట్‌ అయ్యాడు. మాండలే జైలులో ఖైదీ అయ్యాడు. రెండేళ్ల తర్వాత జైలు నుంచి విడుదలై మళ్లీ హీరో అయ్యాడు. కాంగ్రెస్‌పార్టీ జనరల్‌ సెక్రెటరీ అయ్యాడు. కలకత్తా మేయర్‌ అయ్యాడు. నెహ్రూకి దగ్గరయ్యాడు.

సహాయ నిరాకరణ చేసి మళ్లీ అరెస్టయ్యాడు. ఐరోపా వెళ్లాడు. అక్కడి భారతీయ విద్యార్థుల్ని, ఐరోపా రాజకీయ నాయకులని, ముస్సోలినీని కలిశాడు. కమ్యూనిజాన్ని, ఫాసిజాన్ని స్టడీ చేశాడు. తిరిగొచ్చాక కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్ష పదవికి పోటీ చేశాడు.  గాంధీజీకి నచ్చలేదు. స్వరాజ్యం కోసం తుపాకీ పట్టాల్సిందేనని అన్నవాడెవడూ ఆయనకు సహజంగానే నచ్చరు. పైగా ఇప్పుడు బోస్‌... ది గ్రేట్‌ ఇండియన్‌ నేషనల్‌ కాంగ్రెస్‌కి పోటీ పడేందుకు వచ్చాడు. అసలే నచ్చడు. 

గాంధీజీ ఒప్పుకోలేదు!
పార్టీలో గాంధీజీకి ఎంతమంది ఉన్నారో, బోస్‌కి అంతమంది ఉన్నారు. ఎటువైపు ఎంతమంది ఉన్నా, అందరం కలిసే ఉందాం అన్నాడు బోస్‌. కలిసి ఉండి దేశాన్ని ఏం చేద్దామని? గాంధీజీకి అర్థంకావడం లేదు. బోస్‌ గెలిచాడు. మళ్లీ ఏడాది కూడా నిలబడ్డాడు.
‘‘నో’’ అన్నారు గాం«ధీజీ! ఆయనకు తెలుసు. చేత్తో తుపాకీ పట్టుకుని ఆవేశంగా తిరగేవాడు ఎప్పుడో కొంప ముంచేస్తాడు. ఇంత శ్రమా వృథా అవుతుంది. ఇంత శాంతీ బూడిదవుతుంది. ‘‘అవును నిజమే’’ అన్నారు నెహ్రూ. పెద్దాయనకు ఇంకో పెద్దాయన సపోర్ట్‌. ఎవరూ మాట్లాడలేదు. గాంధీజీ తన క్యాండిడేట్‌గా పఠాభి సీతారామయ్యను నిలబెట్టారు. ‘‘బోస్‌... నువ్వు పోటీ చేయకు’’ అనే సంకేతం కూడా పంపారు.

Advertisement
 
Advertisement