Gulab Kaur Life History Telugu: నడిచింది ముళ్ల దారి.. ఎంచుకుంది ఏరికోరి!

Azadi Ka Amrit Mahotsav: Indian Freedom Fighter Gulab Kaur Profile - Sakshi

యంగ్‌ ఇండియన్‌ కపుల్‌. అమెరికా వెళ్లిపోవాలని అనుకున్నారు. ఇంతలో ఫ్రీడమ్‌ ఫైట్‌. ‘నేనిక్కడే ఉంటాను’ అంది భార్య. ‘నేనెళ్తున్నా మరి..’ అన్నాడు భర్త. ఆమె ఒంటరి పోరాటం మొదలైంది. ఆ పోరాటం తనకోసం కాదు. తన మాతృభూమి కోసం. స్వాతంత్య్రోద్యమానికి తనూ ఒక ఆయుధం అయింది. ఆమె.. గులాబ్‌ కౌర్‌. ఆమె నడిచింది ముళ్ల దారి ఎంచుకుంది ఏరికోరి!

భారత స్వాతంత్య్ర చరిత్ర అంటే కేవలం గొప్ప నాయకుల విశేషాలే కాదు! ‘నేను సైతం’ అంటూ సామాన్యులనేకులు స్వేచ్ఛ కోసం పోరాడారు. కులాలు, మతాలు, జాతుల భేదాల్లేకుండా అనేకమంది వీరోచిత పోరాటం చేయడం వల్లనే నేటి భారతం స్వేచ్ఛా వాయువులు పీలుస్తోంది. అలాంటి ప్రచ్ఛన్న వీరులలో ఒకరు బీబీ గులాబ్‌ కౌర్‌.  స్వాతంత్య్రోద్యమంలో పురుషులకు తీసిపోకుండా పోరాడిన ప్రసిద్ధ మహిళా యోధుల గురించి అందరికీ తెలుసు, కానీ సాయుధ పోరాటంలో మాత్రం చాలా కొద్దిమంది స్త్రీలు పురుషులతో సమానంగా పాలుపంచుకున్నారు.

ఆ వీరరత్నాల్లో గులాబ్‌ ముందంజలో ఉంటారు. దేశ స్వాతంత్య్రం కోసం వ్యక్తిగత జీవితాన్ని సైతం త్యాగం చేసిన ఆమె చరిత్ర ఆదర్శప్రాయం. గులాబ్‌ కౌర్‌ 1890లో పంజాబ్‌లోని బక్షివాలా గ్రామంలో జన్మించారు. చాలా చిన్నవయసులోనే ఆమెకు మాన్‌ సింగ్‌తో వివాహమైంది. వివాహానంతరం అమెరికా వెళ్లి స్థిరపడాలని ఆ దంపతులు కలలు కన్నారు. కానీ పరిస్థితులు అనుకూలించకపోవడంతో ముందు వీరు ఫిలిప్పీన్స్‌లోని మనీలా నగరానికి పయనమయ్యారు.
 
జర్నలిస్టులా నటిస్తూ..!
మనీలాలో జీవిస్తున్న కాలంలో గులాబ్‌ పలుమార్లు గదర్‌ పార్టీ సమావేశాలకు హాజరయ్యారు. బ్రిటీష్‌ పాలన నుంచి భారత్‌కు విముక్తిని సాధించడం కోసం పంజాబీ సిక్కులు ఈ సంస్థను నెలకొల్పారు. అప్పట్లో మనీలాలో గదర్‌ పార్టీ తరఫున బాబా హఫీజ్‌ అబ్దుల్లా, బాబా బంతా సింగ్, బాబా హర్నామ్‌ సింగ్‌ నాయకులుగా వ్యవహరించేవారు. గులాబ్‌ కౌర్‌పై వీరి ప్రభావం ఎంతో ఉంది. 1913–14లో ఈ పార్టీ భారతీయుల విముక్తి కోసం విదేశాల్లో గదర్‌ మూవ్‌మెంట్‌ను ఆరంభించింది. అమెరికా, కెనడా, ఫిలిప్పీ¯Œ ్స, హాంకాంగ్, సింగపూర్‌ తదితర దేశాల్లో పలువురు భారతీయులు నివసించేవారు. వీరిలో స్వాతంత్య్ర కాంక్షను రగిల్చేందుకు గదర్‌ మూవ్‌మెంట్‌ ప్రయత్నించింది. గదర్‌ పార్టీ తరఫున గులాబ్‌ కౌర్‌ కూడా పలు కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనేవారు. మనీలాలో సంచరించేందుకు ఆమె జర్నలిస్టులా నటించారు. చేతిలో ప్రెస్‌ పాస్‌ తో జర్నలిస్ట్‌ గా నటిస్తూ, ఆమె గదర్‌ పార్టీ సభ్యులకు ఆయుధాలు పంపిణీ చేసేవారు. స్వాతంత్య్రోద్యమ సాహిత్యాన్ని పంపిణీ చేయడం, ఓడల్లో భారతీయ ప్రయాణీకులకు స్ఫూర్తిదాయక ప్రసంగాలు చేయడంతో పాటు  గదర్‌ పార్టీలో చేరమని గులాబ్‌ కౌర్‌ ఎంతోమందిని ప్రోత్సహించారు.

జైలు నుంచీ పోరాటం..!
స్వాతంత్య్ర పోరాటాన్ని స్వదేశంలో కొనసాగించే ఉద్దేశంతో గులాబ్‌తోపాటు 50మంది వరకు పార్టీ సభ్యులు ఎస్‌ఎస్‌ కొరియా బాచ్‌ నౌకలో ఇండియాకు బయలుదేరారు. భారత్‌ వచ్చాక హోషియార్‌పూర్, జలంధర్, కపుర్తలా తదితర జిల్లాల గ్రామాల్లో ఆమె విస్తృతంగా పర్యటించారు. చాలామందిని సాయుధ పోరాటం దిశగా నడిపించారు. గులాబ్‌ ప్రయత్నాలు గమనించిన బ్రిటీష్‌ ప్రభుత్వం ఆమెను లాహోర్‌ షాహి కిలాలో అరెస్టు చేసింది. అయితే ఈ అరెస్టులకు భయపడని గులాబ్‌ జైలు నుంచి తన కార్యక్రమాలను కొనసాగించారు. ఈ నేపథ్యంలో అమెరికా కలను కూడా ఆమె వదులుకున్నారు. గులాబ్‌ను వదిలి మా¯Œ సింగ్‌ ఒక్కరే అమెరికా పయనమయ్యారు. అయినా బాధపడని ఆమె స్వతంత్ర పోరాటం కొనసాగించారు. కానీ జైల్లో బ్రిటీషర్ల హింస కారణంగా ఆమె ఆరోగ్యం దెబ్బతిని చివరకు తన యాభై ఏళ్ల వయసులో 1941లో కన్నుమూశారు.
 – దుర్గరాజు శాయి ప్రమోద్‌ 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top