జైహింద్‌ స్పెషల్‌: చంద్రయ్య, జగ్గయ్య.. రంపలో రఫ్ఫాడించారు..

Azadi Ka Amrit Mahotsav: Freedom Fighters Chandraya And Jaggayya - Sakshi

‘‘భారత స్వాతంత్య్ర సంగ్రామంలో అమరులైన వారి వివరాలతో కూడిన ఒక నిఘంటువు తయారు కావాలి. దేశ చరిత్రలో ఒక ముఖ్య భాగమైన వారిని గురించి లేదా చరిత్రను సృష్టించిన వారిని స్మరించుకోని, గౌరవించుకోని దేశానికి భద్రమైన భవిష్యత్తు ఉండదు’’ అని ప్రధాని నరేంద్ర మోడీ ‘ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌’ కార్యక్రమాల ఆరంభ సందర్భంలో అన్నారు. స్వాతంత్య్ర ఉద్యమ వీర ఘట్టాలను, స్వాతంత్య్ర సమరయోధుల అసమాన ధైర్య సాహసాలను స్మరించుకోవాలి, అలాంటి విలువలను పెంపొందించుకోవాలి. మన స్వాతంత్య్ర ఉద్యమ పోరాటంలో భాగస్వాములైన ఆదివాసీ నాయకుల అసమాన ధైర్య సాహసాలను సైతం స్మరించుకొంటూ భవిష్యత్‌ తరాలకు స్ఫూర్తిని నింపాలి. 

అడవి బిడ్డలపై బ్రిటిష్‌ దౌర్జన్యం
తూర్పు గోదావరి, ఖమ్మం, విశాఖ జిల్లాలలో మన్యం అటవీ ప్రాంతం విస్తరించి వుంది. అక్కడ సాగు చేసుకుంటున్న రైతులను ముఠాదార్లు, భూస్వాములూ, జమీందార్లూ, బ్రిటిష్‌ ప్రభుత్వం దౌర్జన్యంగా, పోడు వ్యవసాయం చేయరాదని, అటవీ వస్తువులను సేకరించరాదనీ, అడవి జంతువులను వేటాడరాదనీ, కాయలూ, పండ్లూ, కట్టెలూ ఏరుకోరాదనీ అటవీ చట్టం అమలు చేసింది ఎవరైనా వీటిని అతిక్రమిస్తే శిక్షార్హులని హెచ్చరించింది. అడవిని ఆధారంగా చేసుకుని బ్రతికే అడవి బిడ్డలు అమాయకులు. ఎక్కడికి పోగలరు? ఎలా బ్రతకగలరు? వీరిని దౌర్జన్యంగా అణగతొక్కుతూ పంటలను దోచుకుంటూ ఉండేవారు. దానితో అన్ని విధాలా విసిగిపోయి.. నాటి బ్రిటిష్‌ వారికి వ్యతిరేకంగా 1879 లో ద్వారబంధాల చంద్రయ్య లేదా చంద్రారెడ్డి నాయకత్వం లో ఆదివాసీలు తిరుగుబాటు చేశారు. ఆ తిరుగుబాటును బ్రిటిష్‌ అధికారులు ‘రంపా పితూరీ‘ ఉద్యమం అని పిలిచారు.

అడుగో... చంద్రయ్య! 
ద్వారబంధాల లక్ష్మయ్య, లక్ష్మమ్మల కుమారుడే ద్వారబంధాల చంద్రారెడ్డి లేక ద్వారబంధాల చంద్రయ్య, తూర్పు గోదావరి జిల్లా శంఖవరం మండలం, నెల్లిపూడిలో తన మేనమామల ఇంట పెరిగాడు. ఆరు అడుగుల ఆజానుబాహువు, తేనె రంగు శరీర ఛాయ, ఉంగరాల జుత్తూ, వెనక జులపాలు కలిగి గుర్రంపై తుపాకీతో కూర్చుని వీపుమీద కత్తి, మొలలో బాకు, చేతిలో గండ్ర గొడ్డలితో సంచారం చేసేవాడు. ఖమ్మం జిల్లాలోని భద్రాచలం, రేఖపల్లి నుండి విశాఖపట్నం జిల్లాలోని గొలుగొండ ప్రాంతం వరకూ తన ఆధిపత్యంలో ఉండేది.

ఈయనకు సహచరులుగా పులిచింత సాంబయ్య, బాదులూరి అంబుల్రెడ్డి, ఎలుగూరి జగ్గయ్య, జంపా పండయ్య, కోడుం  నరసయ్యలు ఉండేవారు. వారి సహాయంతో చంద్రయ్య పెద్ద సైన్యాన్ని తయారు చేశాడు. నాటి బ్రిటిష్‌ అధికారులలో గిరిజన ఆడపిల్లల పై అత్యాచారం చేసిన వారి తలలు తెగనరికేవాడు. బ్రిటిష్‌ వారికి దొరక్కుండా ముప్పుతిప్పలు పెడుతూ అడవి లో దాక్కునేవాడు. 1879 ఏప్రిల్‌ లో అడ్డతీగల పోలీస్‌ స్టేషన్‌ ను ధ్వంసం చేసి అక్కడి నుండి అనేక ఆయుధాలను స్వాధీనం చేసుకున్నాడు. అయితే అదే సంవత్సరం నవంబర్‌ లో ఇతని అనుచరులను 79మందిని అత్యంత నేర్పుతో వలపన్ని పట్టుకుని ‘విల్లాక్‌‘ అనే పోలీసు అధికారి ఉరి తీయించాడు.  అప్పటికే లాగరాయి కేంద్రంగా దుచ్ఛేర్తి దగ్గర ద్వారబంధాల చంద్రయ్య తిరుగుబాటు చేస్తున్నాడు. ఈ గొడవలన్నీ చూశాక సైన్యాన్ని రప్పించాలని ప్రయత్నాలు మొదలయ్యాయి. సెంట్రల్‌ ప్రావిన్స్‌ నుండి ‘కల్నల్‌ లోబ్‌’ నాయకత్వం లో పోలీసు బలగాలు వచ్చాయి. పిఠాపురం సంస్థానం నుంచి 500 మంది గైడ్లను దింపారు.

ద్వారబంధాల చంద్రయ్యను పట్టించిన వారికి 2000 రూపాయలు బహుమానం ప్రకటించారు. బ్రిటిష్‌ వారు తనకు నమ్మకస్థుడు, అనుయాయుడుగానున్న జంపా పండయ్యను ఉసిగొల్పితే, 1880 ఫిబ్రవరి 12న గుర్తేడు లో అతడు చంద్రయ్యను పట్టించాడు. ద్వారబంధాల చంద్రయ్యను కాల్చి చంపారు. అయినా రంపా పితూరీ (ఉద్యమం) ఆగలేదు. ఆ ఉద్యమాన్ని ఎలుగూరి జగ్గయ్య కొనసాగించాడు. 

అడుగడుగో.. జగ్గయ్య!
ఎలుగూరి జగ్గయ్య తూర్పుగోదావరి జిల్లా రంపచోడవరం మండలం వెడ్ల గెడ్డ వాసి. 1879 లో ద్వారబంధాల చంద్రయ్యకు కుడిభుజంగా పని చేశాడు. ఇతను అడవి పక్షులను, జంతువులను వేటాడి తన పొట్ట పోసుకునేవాడు. అడవి పక్షులను చంపడం నేరమని అలా చేస్తే శిక్షార్హమవుతుందని అధికారులు హెచ్చరించారు. పైగా అతనిపై వేటకు వెళ్లకుండా నిఘా పెట్టారు బ్రిటిష్‌ వారు. తద్వారా తన జీవనోపాధిని కోల్పోయాడు. ద్వారబంధాల చంద్రయ్య తో కలసి పోరాటం ప్రారంభించాడు. అడ్డతీగల పోలీస్‌ స్టేషన్‌ ను రెండు సార్లు తగలబెట్టడానికి మూలకారకుడు ఎలుగూరి జగ్గయ్యే.

ఈయన్ని పట్టుకోవడానికి ఇన్‌స్పెక్టర్‌ ఎంగ్లిడో ను నియమించారు బ్రిటిష్‌ వారు. జడ్డంగిలో క్యాంపు ను ఏర్పాటు చేసుకుని ప్రణాళికలు రచించారు. ఎలుగూరి జగ్గయ్య ఆచూకీ చెప్పిన వారికి 2000 రూపాయల బహుమానం ప్రకటించి ‘కొటుమ్‌ నరసయ్య‘ అనే తన అనుచరుడికి డబ్బుపై ఆశ చూపారు, ఎన్నో కానుకలు ఇచ్చారు. ఎలుగూరి జగ్గయ్య వెలగలపాలెం అడవిలో దాక్కున్న సంగతి నరసయ్యకు తప్ప మరెవ్వరికీ తెలియదు. డబ్బుకు ఆశపడి వెలగలపాలెం ఎలా వెళ్లాలో మార్గం కూడా చెప్పాడు కొటుమ్‌ నరసయ్య.

కొటుమ్‌ నరసయ్య ఇచ్చిన ప్రణాళిక ప్రకారం ఇన్‌స్పెక్టర్‌ ఎంగ్లిడో 10 మంది శిక్షణ పొందిన కానిస్టేబుల్స్‌ను తీసుకుని వెలగలపాలెం లో తిరుగుబాటుదారులు దాక్కున్న స్థావరానికి నేరుగానే వెళ్లి చుట్టుముట్టాడు. అక్టోబర్‌ 31, 1880 సరిగ్గా సాయంత్రం నాలుగు గంటలకు ఎలుగూరి జగ్గయ్యను కాల్చగా అది సరిగ్గా బొడ్డు కింద భాగంలో తగిలింది, పారిపోవాల నుకున్నాడు. ఓ 100 గజాలు పరుగెత్తి కింద పడిపోయాడు. కొన ఊపిరితో ఉన్న అతన్ని ఓ పెద్ద కర్రకు కట్టి తమ ‘జడ్డంగి క్యాంపు‘ కు తీసుకు వస్తూండగా దారిలోనే చనిపోయాడు. ఇలా ఎందరో అడవి బిడ్డలు తమ ప్రాణాలను తృణప్రాయంగా దేశం కోసం త్యాగం చేశారు. జాతీయోద్యమంలో సైతం ఆటవికులు చురుగ్గా పాల్గొని తమ దేశభక్తి ని చాటుకున్నారు. స్వాతంత్య్రం కొరకు, మాతృదేశ దాస్య విముక్తికై పోరాడి అసువులు బాసారు.
– కాశింశెట్టి సత్యనారాయణ విశ్రాంత ఆచార్యుడు 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top