మహోజ్వల భారతి: సిరాజుద్దౌలాను హతమార్చేందుకు రాబర్ట్‌ క్లైవ్‌ బయల్దేరిన రోజు

Azadi Ka Amrit Mahotsav: The day Robert Clive left to assassinate Sirajuddaula - Sakshi

వ్యక్తులు ::: ఘటనలు ::: సందర్భాలు ::: స్థలాలు :: సమయాలు (ప్రీ–ఫ్రీడమ్, పోస్ట్‌ ఫ్రీడమ్‌)

1757లో ప్లాసీ వద్ద జరిగిన యుద్ధంలో బెంగాల్‌ యువ నవాబు సిరాజుద్దౌలా ఈస్టిండియా కంపెనీకి పట్టుబడి, హతుడు కావడంతో ఇండియాలో బ్రిటిష్‌ ఈస్టిండియా కంపెనీ పాలన మొద లైంది. సిరాజుద్దౌలాపై యుద్ధానికి రాబర్ట్‌ క్లైవ్‌ ఆ ఏడాది జూన్‌ 13 న ముర్షిదాబాద్‌ బయలుదేరి వెళ్లాడు. బ్రిటిషు ఈస్ట్‌ ఇండియా కంపెనీ.. బెంగాలు నవాబు, అతడి ఫ్రెంచి మిత్రుల కూటమిపై నిర్ణయా త్మక విజయం సాధించిన ఆ యుద్ధం చరిత్రలో ప్లాసీ యుద్ధంగా ప్రసిద్ధి చెందింది. 1757 జూన్‌ 23 న జరిగిన ఈ యుద్ధం, బెంగాల్లో కంపెనీ స్థానాన్ని సుస్థిరపరచింది. తరువాతి వంద సంవత్సరాల్లో కంపెనీ తమ ప్రాబల్యాన్ని భారత్‌ అంతటా విస్తరించింది.

బెంగాల్‌లో భాగీరథి నదీ తీరంలోని ప్లాసీ (ప్రస్తుత పలాషి) వద్ద ఆనాటి యుద్ధం జరిగింది. ఈ ప్రదేశం కలకత్తాకు ఉత్తరాన 150 కిమీ వద్ద, అప్పటి బెంగాలు రాజధాని ముర్షిదాబాదుకు దక్షిణాన ఉంది. బెంగాలు నవాబు సిరాజుద్దౌలా, ఇస్ట్‌ ఇండియా కంపెనీ ఈ యుద్ధంలో ప్రధాన ప్రత్యర్థులు. సిరాజుద్దౌలా అంతకు ఏడాది ముందే బెంగాలు నవాబయ్యాడు. వెంటనే అతడు ఇంగ్లీషు వారిని వారి కోటల విస్తరణను ఆపమని ఆదేశించాడు. బెంగాల్‌ ప్రెసిడెన్సీకి బ్రిటిష్‌ గవర్నర్‌ అయిన రాబర్టు క్లైవ్, సిరాజుద్దౌలా సర్వ సైన్యాధ్యక్షుడైన మీర్‌ జాఫరును లంచంతో లోబరచుకుని, అతణ్ణి బెంగాలు నవాబును చేస్తానని ఆశ గొలిపి, తన పక్షానికి తిప్పుకున్నాడు. సిరాజుద్దౌలాను ఓడించారు.

ఈ యుద్ధానికి ముందు సిరాజుద్దౌలా బ్రిటిషు వారి నియంత్రణలో ఉన్న కలకత్తాపై దాడి చెయ్యడం, చీకటి గది మారణకాండ చేయించడం జరిగాయి. బ్రిటిషు వారు రాబర్టు క్లైవ్‌ నాయక త్వంలో మద్రాసు నుండి అదనపు బలగాలను పంపించి కలకత్తాను తిరిగి తమ అధీనంలోకి తెచ్చుకున్నారు. ఆ వెంటనే క్లైవ్‌ ఫ్రెంచి వారి అధీనంలో ఉన్న చందర్‌నగర్‌ కోటను వశపరచుకు న్నాడు. బ్రిటిషువారికీ, సిరాజుద్దౌలాకూ మధ్య తలెత్తిన ఉద్రిక్తతలు, పరస్పర అనుమానాలు ప్లాసీ యుద్ధానికి దారితీశాయి. సంఖ్యపరంగా సిరాజు ద్దౌలా సైన్యం, బ్రిటిషు సైన్యం కంటే చాలా పెద్దది. ఈ విషయమై ఆందోళన చెందిన క్లైవ్‌.. మీర్‌ జాఫరు, మరికొంతమందితో కలిసి కుట్ర పన్నాడు. ఆ ప్రకారం వాళ్లంతా యుద్ధభూమికి తమ సైన్యాలతో వచ్చినప్పటికీ సిరాజుద్దౌలా తరఫున యుద్ధంలో పాల్గొనలేదు. ఫలితంగా 18,000 మందితో కూడిన సిరాజుద్దౌలా సైన్యం, కేవలం 3,000 క్లైవ్‌ సైన్యం చేతిలో పరాజయం పొందింది. యుద్ధం కేవలం 40 నిముషాల్లో ముగిసి పోయింది. తర్వాత సిరాజుద్దౌలాను బ్రిటిష్‌ వాళ్లు హతమార్చారు. 

గణేశ్‌ దామోదర్‌ సావర్కర్‌


గణేష్‌ దామోదర్‌ సావర్కర్‌ స్వాతంత్య్ర సమర యోధుడు. 1879 జూన్‌ 13న జన్మించారు. ‘అభినవ్‌ భారత్‌ సంఘం’ వ్యవస్థాపకులు. భారతదేశంలో బ్రిటిష్‌ వలస ప్రభుత్వానికి వ్యతిరేకంగా సాయుధ ఉద్యమానికి నాయ కత్వం వహించారు. ఫలితంగా ఆయన జీవితాంతం బహిష్కరణ శిక్ష గురయ్యారు. అందుకు ప్రతీకారంగానే అప్పటి నాసిక్‌ కలెక్టర్‌ జాక్సన్‌ను గణేష్‌ సన్నిహిత అనుచరుడు అనంత లక్ష్మణ్‌ కన్హేర్‌ హత్య చేశాడు. కన్షేర్‌ బ్రాహ్మణ కుటుంబంలో జన్మించి స్వాతంత్య్రం కోసం సాయుధ పోరాటాన్ని ఆశ్రయించిన సమర యోధుడు. ప్రముఖ హిందుత్వ వాది వినాయక్‌ దామోదర్‌ సావర్కర్‌.. గణేశ్‌ తమ్ముడే.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top