పుదుచ్చేరి రిసార్ట్ ఖాళీ.. చెన్నైకి అన్నాడీఎంకే ఎమ్మెల్యేల పరుగు! | AIADMK MLAs Flee Puducherry Resort Amid Poaching Fears | Sakshi
Sakshi News home page

పుదుచ్చేరి రిసార్ట్ ఖాళీ.. చెన్నైకి అన్నాడీఎంకే ఎమ్మెల్యేల పరుగు!

May 9 2026 11:00 AM | Updated on May 9 2026 11:21 AM

AIADMK MLAs Flee Puducherry Resort Amid Poaching Fears

చెన్నై: తమిళనాడు రాజకీయాలు రోజుకో మలుపు తిరుగుతున్నాయి. అసెంబ్లీ ఎన్నికల ఫలితాల అనంతరం ఎమ్మెల్యేల కొనుగోళ్ల భయం పట్టుకోవడంతో అన్నాడీఎంకే అప్రమత్తమైంది. ఎవరూ చేజారిపోకుండా ఉండేందుకు క్యాంపు రాజకీయాలకు తెరలేపింది. ఇందులో భాగంగా పుదుచ్చేరిలోని ఓ విలాసవంతమైన రిసార్ట్‌లో 40 మందికి పైగా అన్నాడీఎంకే ఎమ్మెల్యేలకు బస ఏర్పాట్లుచేసింది. అయితే శనివారం ఉదయం వారిని హుటాహుటిన అక్కడి నుంచి వేరే ప్రాంతానికి తరలించడం తీవ్ర ఉత్కంఠ కలిగిస్తోంది.

ఉత్కంఠ రేపుతున్న తరలింపు
పుదుచ్చేరిలోని ఒక లగ్జరీ రిసార్ట్‌లో గత కొద్ది రోజులుగా బస చేస్తున్న 40 మందికి పైగా అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు ఆకస్మికంగా అక్కడి నుంచి బయలుదేరారు. ఎమ్మెల్యేలంతా ఒకేసారి గ్రూపులుగా రిసార్ట్ నుంచి బయటకు వస్తున్న దృశ్యాలు తమిళ రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. పార్టీ అధిష్ఠానం ఆదేశాలతో ముందుస్తు జాగ్రత్తగా, కట్టుదిట్టమైన భద్రత నడుమ వారిని అక్కడి నుంచి తరలించినట్లు సమాచారం.

గమ్యంపై గోప్యత
రిసార్ట్ నుంచి బయటకు వస్తున్న సమయంలో మీడియా ప్రతినిధులు ఎమ్మెల్యేలను పలకరించే ప్రయత్నం చేశారు. ‘మిమ్మల్ని ఎక్కడికి తీసుకువెళ్తున్నారు?' అని ప్రశ్నించగా.. చాలా మంది నేతలు సమాధానం దాటవేశారు. తమకు ఏమీ తెలియదంటూ చేతులతో సైగ చేస్తూ వేగంగా వెళ్లిపోయారు. అన్నాడీఎంకే అగ్రనేతలు ఎమ్మెల్యేల కదలికలపై డేగకన్ను వేశారు. సమాచారం బయటకు పొక్కకుండా పూర్తి గోప్యత పాటిస్తూ ఈ ఆపరేషన్ కొనసాగిస్తున్నారు.

చెన్నైకే మకాం మార్పు?
ప్రత్యర్థి పార్టీలు తమ ఎమ్మెల్యేలను ప్రలోభపెట్టి తమవైపు తిప్పుకుంటాయన్న భయమే ఈ తాజా పరిణామాలకు ప్రధాన కారణమని రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. క్రాస్ ఓటింగ్ లేదా పార్టీ ఫిరాయింపులు జరగకుండా ఎమ్మెల్యేలందరినీ ఒకే గొడుగు కింద ఉంచేందుకే ఈ వ్యూహం పన్నారు. శనివారం మధ్యాహ్నానికి వీరందరినీ చెన్నైలోని మరో సురక్షిత ప్రాంతానికి తరలించే అవకాశం ఉందని విశ్వసనీయ వర్గాల సమాచారం.

Advertisement
 
Advertisement
Advertisement