Gujarat Riots: గుజరాత్‌ అల్లర్ల వెనుక షాకింగ్‌ నిజాలు.. మోదీని గద్దె దింపేందుకే కాంగ్రెస్‌ ప్లాన్‌!

Ahmed Patel Plotted Against Narendra Modi In Gujarat Riots - Sakshi

గుజరాత్‌ అల్లర్లపై సంచలన విషయాలు బయటకు వస్తున్నాయి. 2002 నాటి అల్లర్ల కేసులో అప్పటి గుజరాత్‌ ముఖ్యమంత్రి నరేంద్ర మోదీని ఇరికేంచేందుకు దివంగత కాంగ్రెస్‌ నేత అహ్మద్‌ పటేల్‌ కుట్ర పన్నారనే విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ మేరకు సిట్‌ వెల్లడించింది. ఈ కుట్రలో సామాజిక కార్యకర్త తీస్వా సెతల్వాద్‌కు హ్యాండ్‌ ఉందని సిట్‌ పేర్కొంది. ఈ మేరకు సెషన్స్‌ కోర్టులో అఫిడవిట్‌ను దాఖలు చేసింది. 

అయితే, 2002 గుజరాత్ అల్లర్ల కేసుకు సంబంధించి కల్పిత సాక్ష్యాలు, తప్పుడు సమాచారం ఆరోపణలపై పోలీసు శాఖకు చెందిన సిట్‌ దర్యాప్తు జరుపుతోంది. విచారణలో భాగంగా.. సామాజిక కార్య‌క‌ర్త తీస్తా సెత‌ల్వాద్‌, మాజీ డీజీపీ ఆర్‌బీ శ్రీకుమార్‌, ఐపీఎస్ ఆఫీస‌ర్ సంజీవ్ భ‌ట్‌ల‌కు అహ్మ‌ద్ ప‌టేల్ 30 ల‌క్ష‌లు ఇచ్చార‌ని సిట్‌ తెలిపింది. అలాగే, అల్ల‌ర్ల కేసులో మోదీని ఇరికించాలానే ఉద్దేశంతో ప‌టేల్ ఆ డ‌బ్బులు ఇచ్చిన‌ట్లు సిట్ త‌న రిపోర్ట్‌లో పేర్కొన్న‌ది. సెత‌ల్వాద్‌, శ్రీకుమార్‌లు నేర కుట్ర‌కు, ఫోర్జ‌రీకి పాల్ప‌డిన‌ట్లు సిట్ వెల్ల‌డించింది.

ఇదిలా ఉండగా.. జూలై రెండ‌వ తేదీన సెతల్వాద్‌, శ్రీకుమార్‌ల‌ను 14 రోజుల పాటుకు రిమాండ్‌కు త‌ర‌లిస్తూ అహ్మ‌దాబాద్ మెట్రోపాలిట‌న్ కోర్టు పోలీసులను ఆదేశించింది. గుజ‌రాత్ అల్ల‌ర్ల కేసుతో లింకు ఉన్న డాక్యుమెంట్ల‌ను ఫోర్జ‌రీ చేసిన కేసులో మాజీ ఐపీఎస్ సంజీవ్ భ‌ట్‌ను అహ్మ‌దాబాద్ క్రైం బ్రాంచీ పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. 

మరోవైపు.. సిట్‌ నివేదికను, దివంగత అహ్మాద్‌ పటేల్‌పై ఆరోపణలను కాంగ్రెస్‌ పార్టీ ఖండించింది. నరేంద్ర మోదీ ప్రభుత్వం మరణించిన వారిని కూడా వదలడం లేదని విరుచుకుపడింది. రాజకీయ పెద్దలు ఆడించినట్లుగా సిట్ ఆడుతోందని, వారు ఏది చెబితే అది చేస్తోందని విమర్శించింది. ఈ క్రమంలోనే ఆరోపణలపై అహ్మాద్‌ పటేల్ కుమార్తె స్పందించారు. సిట్‌ ఆరోపణలను కొట్టిపారేశారు. ఈ కుట్రలో నిజంగా తన తండ్రికి పాత్ర ఉంటే కేంద్రం ఇప్పటి వరకు ఎందుకు విచారించలేదని ఆమె ప్రశ్నించారు. కాగా అహ్మాద్‌ పటేల్ 2020లో మరణించిన విషయం తెలిసిందే.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top