బోనస్‌ అందేనా..? | - | Sakshi
Sakshi News home page

బోనస్‌ అందేనా..?

Apr 17 2026 1:32 PM | Updated on Apr 17 2026 1:32 PM

నారాయణపేట: గతేడాది యాసంగి వరిధాన్యాన్ని ప్రభుత్వానికి విక్రయించిన రైతులు బోనస్‌ కోసం వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్నారు. ఏడాది దాటినా ప్రభుత్వం యాసంగి బోనస్‌ ఊసెత్తకపోవడంతో కొందరు ఆశలు వదులుకుంటున్నారు. గతేడాది మార్చి నెలాఖరు నుంచే ధాన్యం కొనుగోళ్లు ప్రారంభించిన ప్రభుత్వం.. జూన్‌ మొదటి వారం వరకు 1.98 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్ని సేకరించింది. అందులో 1,40,983 ఎంటీఎస్‌ సన్నరకాలు, 57,299 ఎంటీఎస్‌ దొడ్డు రకాల ధాన్యాన్ని రైతులు విక్రయించారు.

కొనుగోళ్లకు సన్నద్ధం

జిల్లాలో సన్నరకం వరిసాగుపై ఈ సారి యాసంగిలోనూ రైతులు మక్కువ చూపారు. జిల్లావ్యాప్తంగా 1.80 లక్షల ఎకరాల్లో వరిసాగు చేశారు. సన్నరకం 1,81,998 మెట్రిక్‌ టన్నుల దిగుబడి, దొడ్డు రకం 62,815 మెట్రిక్‌ టన్నుల దిగుబడి వస్తుందని వ్యవసాయశాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ మేరకు రైతుల నుంచి ధాన్యం సేకరణ కోసం 160 కొనుగోలు కేంద్రాల ఏర్పాటుకు జిల్లా యంత్రాంగం కసరత్తు చేస్తోంది. మొత్తం 2.45 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం సేకరించేందుకు ప్రణాళికలు రూపొందించింది. ఈ నెల మొదటి వారం నుంచే వరికోతలు ప్రారంభం కావడంతో రైతుల నుంచి ధాన్యాన్ని సేకరించేందుకు సివిల్‌ సప్లయ్‌, వ్యవసాయశాఖ అధికారులు సమన్వయంతో అన్ని ఏర్పాట్లు పూర్తిచేశారు. ఇప్పటికే జిల్లాలో నాలుగు కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు.

245 క్వింటాళ్లు విక్రయించా..

నేను వరిధాన్యం విక్రయించి ఏడాది అవుతుంది. ఇంతవరకు బోనస్‌ పడలేదు. యాసంగి సీజన్‌లో పది ఎకరాల్లో వరిసాగు కోసం దాదాపు రూ. 3లక్షలు ఖర్చుచేశా. 245 క్వింటాళ్ల వరిధాన్యం కొనుగోలు కేంద్రంలో విక్రయించా. ఇప్పటివరకు బోనస్‌ డబ్బులు రూ.1,22,500 రాలేదు. ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు రైతులకు బోనస్‌ అందించాలి.

– నర్సింహారెడ్డి, రైతు, మక్తల్‌

రూ.25వేలు రావాల్సి ఉంది..

గతేడాది యాసంగిలో 50 క్వింటాళ్ల సన్నరకం వరిధాన్నాన్ని ప్రభుత్వ కొనుగోలు కేంద్రంలో విక్రయించా. అందుకు సంబంధించి రూ. 25వేల బోనస్‌ అందాల్సి ఉంది. మళ్లీ యాసంగి వరికోతలు ప్రారంభమయ్యాయి. ప్రభుత్వం బోనస్‌ అందించడంలో జాప్యం చేయడం సరికాదు. – శ్రీనివాస్‌గౌడ్‌, రైతు, మరికల్‌

ఎదురుచూస్తున్నా..

పోయిన యాసంగిలో 3 ఎకరాల్లో వరిసాగు చేసి, పండించిన 58 క్వింటాళ్ల సన్నరకం వడ్లను పీఏసీఎస్‌ కొనుగోలు కేంద్రంలో అమ్మినా. క్వింటాకు రూ. 500 చొప్పున రూ. 29వేల బోనస్‌ ఇప్పటి వరకు అకౌంట్‌లో జమ కాలేదు. ప్రభుత్వం సన్నరకం ధాన్యానికి ఇస్తామన్న బోనస్‌ అందించి రైతులను ఆదుకోవాలి.

– కె.బాల్‌రాజ్‌, రైతు, మద్దెల్‌బీడ్‌

ఈసారి ధాన్యం డబ్బులతో పాటే

గతేడాది వానాకాలం బోనస్‌ డబ్బులను రైతు లు ఖాతాల్లో జమచేశాం. యాసంగి డబ్బులు రావాల్సి ఉంది. ఈ ఏడాది యాసంగి ధాన్యం కొనుగోలుకు కార్యాచరణ రూపొందించాం. ఇప్పటికే 4 కొనుగోలు కేంద్రాలను ప్రారంభించాం. వారం రోజుల్లో 156 కేంద్రాలను ప్రారంభిస్తాం. ఈ సారి ధాన్యం డబ్బులతోపాటు బోనస్‌ జమయ్యే అవకాశం ఉంది. రైతులు కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం విక్రయించాలి.

– సైదులు, జిల్లా సివిల్‌సప్లయ్‌ అధికారి

ఒక్క రూపాయి రాలే..

గతేడాది యాసంగి సీజన్‌లో సేకరించిన సన్నాలకు సంబంధించి క్వింటాకు రూ.500 చొప్పున రూ. 70.44కోట్ల బోనస్‌ చెల్లించాల్సి ఉంది. అయితే ఇప్పటి వరకు రైతులకు ఒక్క రూపాయి కూడా అందలేదు. యాసంగి కొనుగోళ్లు ముగిసి ఏడాది కావొస్తున్నా బోనస్‌ చెల్లించకపోవడంతో రైతులు అసంతృప్తి వ్యక్తంచేస్తున్నారు. ప్రధానంగా కౌలు రైతులకు సకాలంలో బోనస్‌ రాక.. ఎప్పుడు వస్తుందో తెలియక ఆందోళనకు గురవుతున్నారు. మళ్లీ ఈ ఏడాది యాసంగి వరిధాన్యం కొనుగోళ్లు చేపట్టేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తుండగా.. రైతులు మాత్రం అసంతృప్తిని వ్యక్తంచేస్తున్నారు. కాగా, కొనుగోలు కేంద్రాల్లో రైతులు విక్రయించిన ధాన్యానికి పౌరసరఫరాల సంస్థ రూ. 460,01,65,600 జమచేసింది. అయితే ఆర్థికశాఖ ద్వారా నేరుగా ప్రభుత్వమే విడుదల చేసే సన్నరకం ధాన్యం బోనస్‌ డబ్బులు మాత్రం పెండింగ్‌లోనే ఉన్నాయి.

Advertisement
 
Advertisement
Advertisement