‘చమ్మగిల్లిన’ ఖాన్‌దొడ్డి..! | - | Sakshi
Sakshi News home page

‘చమ్మగిల్లిన’ ఖాన్‌దొడ్డి..!

Apr 17 2026 1:32 PM | Updated on Apr 17 2026 1:32 PM

గట్టు: ఊరి కోసం ఊరంతా ఏకమయ్యారు.. ఊరిని ఖాళీ చేయించేందుకు వచ్చిన వారిని గట్టిగానే ప్రతిఘటించారు. కానీ, ఎప్పుడు ఎవరు వచ్చి తమను ఖాళీ చేయిస్తారోనని చమ్మగిల్లిన కళ్లతో బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు గద్వాల జిల్లా గట్టు మండలంలోని చమన్‌ఖాన్‌దొడ్డి గ్రామస్తులు. గ్రామాన్ని ఖాళీ చేయించేందుకు ఉత్తర్వులతో కోర్టు సిబ్బంది, యజమానుల తరఫున వచ్చిన బంధువులను ఘటన గ్రామస్తులను కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. గ్రామంలోకి కొత్తగా ఎవరు వచ్చినా గ్రామస్తులు ఉలిక్కిపడే పరిస్థితి నెలకొంది. బుధవారం కోర్టు ఉత్తర్వులతో కోర్టు ఫీల్డ్‌ అసిస్టెంట్లు గ్రామానికి చేరుకుని గ్రామాన్ని ఖాళీ చేయాలని ప్రయత్నించిన సంఘటన ప్రజలకు ఆగ్రహాన్ని తెప్పించింది. గ్రామస్తులంతా కలిసి కోర్టు సిబ్బందితో పాటు భూ యజమానులుగా చెప్పుకొంటున్న బంధువులపై రాళ్లు, రప్పలు, కర్రలతో దాడికి ప్రయత్నించడంతో గ్రామంలో తీవ్ర ఉద్రిక్తతలకు దారి తీసిన విషయం తెలిసిందే. పోలీసుల జోక్యంతో వివాదం సద్దుమణిగింది. అయితే గ్రామంలో ఎక్కడ చూసినా ఇదే సంఘటనను తలుచుకుని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎన్నో ఏళ్లుగా ఇక్కడ ఇళ్లు నిర్మించుకుని జీవనం సాగిస్తున్న తాము ఇప్పుడు ఉన్నదంతా వదిలి ఎక్కడికి వెళ్లాలి.. ఎలా బతకాలని ఆందోళన చెందుతున్నారు.

పరస్పర కేసుల నమోదు..

కోర్టు ఉత్తర్వులతో చమన్‌ఖాన్‌దొడ్డి గ్రామానికి వెళ్లిన కోర్టు ఫీల్డ్‌ అసిస్టెంట్లను గ్రామస్తులు కొట్టడం, విధులకు ఆటంకం కలిగించడం, భయబ్రాంతులకు గురి చేసిన ఘటనపై కోర్టు ఫీల్డ్‌ అసిస్టెంట్‌ సంధ్యారాణి ఫిర్యాదు మేరకు చమన్‌ఖాన్‌దొడ్డికి చెందిన 8 మందితో పాటు మరి కొంత మందిపై కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ శేఖర్‌గౌడ్‌ తెలిపారు. మరోవైపు తమ ఇళ్లను కూలగొట్టడానికి వచ్చిన వారిపై గ్రామానికి చెందిన పూజారి భీమయ్య ఫిర్యాదు చేయగా, భూమి యజమానులతో పాటు మరి కొంతమందిపై కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ శేఖర్‌గౌడ్‌ చెప్పారు.

ఇక్కడే పుట్టి పెరిగినం..

ఎన్నో ఏళ్లుగా ఇక్కడే ఉంటున్నాం, ఇప్పు డు ఈ స్థలం మాది, ఖాళీ చేయమంటే ఎక్కడికి పోవాలి.. ఎలా బతకాలి. మా పెద్దల నుంచి ఇప్పటి పిల్లల దాకా ఇక్కడే పుట్టి పెరిగాం. మమ్మల్ని బలవంతంగా ఇక్కడి నుంచి ఖాళీ చేయించేందుకు ప్రయత్నిస్తున్నారు. మాకు న్యాయం చేయాలి.

– ఆంజనేయులు, చమన్‌ఖాన్‌దొడ్డి

ఎక్కడికి పోవాలి..

మా తాతలకాలం నుంచి ఇక్కడే పుట్టి, ఇక్కడే పెరిగాం. ఇప్పుడు ఎవరో వచ్చి.. ఈ జాగ మాది.. ఖాళీ చేయాల్సిందే అంటే మేం ఎక్కడికి పోవాలి. ఇదే జాగలో కొత్తగా ఇళ్లు కట్టుకుని జీవనం సాగిస్తున్నాం. ఇన్నాళ్లు లేనిది ఇప్పుడు ఖాళీ చేయమంటే ఎట్లా. మాకు న్యాయం చేయాలి. మేం ఎక్కడికి పోం. ఇక్కడే ఉంటాం.

– మల్లేష్‌, చమన్‌ఖాన్‌దొడ్డి

ఊరిని ఖాళీ చేయించేందుకు వచ్చిన ఘటనను తలుచుకుని ఆందోళన

బిక్కుబిక్కుమంటున్న ప్రజలు.. వీడని ఉత్కంఠ

ఎట్టి పరిస్థితుల్లోనూ ఊరుని మాత్రం వదులుకోమని ప్రతిన

పరస్పర ఫిర్యాదులతో గ్రామస్తులు.. భూ యజమాని, బంధువులపై కేసుల నమోదు

Advertisement
 
Advertisement
Advertisement