హత్యల కంటే రోడ్డు మరణాలే ఎక్కువ | - | Sakshi
Sakshi News home page

హత్యల కంటే రోడ్డు మరణాలే ఎక్కువ

Apr 17 2026 1:32 PM | Updated on Apr 17 2026 1:32 PM

అరైవ్‌–అలైవ్‌ అవగాహన సదస్సులోడీజీపీ శివధర్‌రెడ్డి

జడ్చర్ల: హత్యల సంఖ్య కంటే రోడ్డు ప్రమాదాల బారిన పడి మరణించిన వారి సంఖ్యనే ఎక్కువగా ఉంటుందని, పెరుగుతున్న రోడ్డు ప్రమాదాలు అత్యంత ఆందోళన కలిగిస్తోందని డీజీపీ శివధర్‌రెడ్డి పేర్కొన్నారు. గురువారం జడ్చర్లలోని ఓ ఫంక్షన్‌ హాల్‌లో జరిగిన అరైవ్‌–అలైవ్‌ అవగాహన సదస్సుకు ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. రాష్ట్రంలో గత ఏడాది 800 మంది హత్యల కారణంగా మరణిస్తే 7,500 మంది రోడ్డు ప్రమాదాల వల్ల మృత్యువాత పడ్డారని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి సీఎం రేవంత్‌రెడ్డి రోడ్డు భద్రతకు సంబంధించి ఈనెల 13 నుంచి 18 వరకు అరైవ్‌ అలైవ్‌ ద్వారా క్షేత్రస్థాయి వరకు అవగాహన కల్పించాలన్న సదుద్దేశంతో కార్యక్రమాన్ని చేపట్టారని తెలిపారు. పోలీస్‌, రోడ్డు రవాణా శాఖల ద్వారానే కాకుండా అందరి భాగస్వామ్యంతో ప్రజలకు అవగాహన కల్పించేందుకు కృషి చేస్తున్నట్లు చెప్పారు. రోడ్డు ప్రమాదాలపై సరైన అవగాహన లేకపోవడం కారణంగానే విలువైన ప్రాణాలను పోగొట్టుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మోటార్‌ బైక్‌లు నడిపేవారు, రోడ్లపై నడుచుకుంటూ వెళ్లే వారే ఎక్కువగా ప్రమాదాలకు గురవుతున్నారని అన్నారు. హెల్మెట్‌ ధరించకపోవడ వల్లే ప్రమాదాలు జరిగినప్పుడు మరణాలు సంభవిస్తున్నాయని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే అనిరుధ్‌రెడ్డి, డీఐజీ ఎల్‌ఎస్‌ చౌహాన్‌, కలెక్టర్‌ ఖుష్బూ గుప్తా, తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement