డిఫెన్స్‌ డ్రైవింగ్‌తో ప్రమాదాల నివారణ | - | Sakshi
Sakshi News home page

డిఫెన్స్‌ డ్రైవింగ్‌తో ప్రమాదాల నివారణ

Apr 17 2026 1:32 PM | Updated on Apr 17 2026 1:32 PM

నారాయణపేట: రోడ్డు ప్రమాదాల నివారణలో డ్రైవర్ల పాత్ర అత్యంత కీలకమని.. డిఫెన్స్‌ డ్రైవింగ్‌తో రోడ్డు ప్రమాదాలను నివారించవచ్చని ఎస్పీ డా.వినీత్‌ అన్నారు. రోడ్డు ప్రమాదాల నివారణే లక్ష్యంగా చేపట్టిన ఆరైవ్‌..అలైవ్‌ కార్యక్రమంలో భాగంగా గురువారం జిల్లా పోలీసుశాఖ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని ఓ ఫంక్షన్‌హాల్‌లో డ్రైవర్లకు ఉచిత కంటివైద్య శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. డ్రైవర్ల వయసు పెరుగుతున్న కొద్దీ కంటి చూపు మందగించడం.. కలర్‌ బ్లైండ్‌ వంటి సమస్యలు రావొచ్చన్నారు. డ్రైవర్లు తరచుగా కంటి పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. కంటిచూపు స్పష్టంగా ఉంటేనే ట్రాఫిక్‌ సిగ్నల్స్‌, రహదారి సూచనలను గుర్తించి, సురక్షితంగా వాహనాలు నడపగలరని అన్నారు. వేగ పరిమితులను మించకుండా వాహనాలు నడపాలని డ్రైవర్లకు సూచించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ మద్యం తాగి వాహనం నడపకూడదన్నారు. కారులో సీట్‌ బెల్ట్‌, ద్విచక్ర వాహనంపై హెల్మెట్‌ తప్పనిసరిగా ధరించాలని తెలిపారు. డ్రైవింగ్‌ సమయంలో సెల్‌ఫోన్‌ వినియోగించరాదన్నారు. అలసట లేదా నిద్రలేమి ఉన్నప్పుడు వాహనం నడపవద్దని హెచ్చరించారు. అదే విధంగా వాహనాలకు సంబంధించిన లైసెన్స్‌, ఇన్సూరెన్స్‌, ప్యూసీ, రిజిస్ట్రేషన్‌ పత్రాలు చెల్లుబాటు అయ్యేలా చూసుకోవాలని.. వాహనం బ్రేకులు, లైట్లు, టైర్లు సరిగా ఉన్నాయో లేదో నిరంతరం పరిశీలించాలని ఎస్పీ సూచించారు. కాగా, జిల్లా పోలీసుశాఖ ఆధ్వర్యంలో గతంలో కంటి పరీక్షలు చేయించుకున్న కొందరు డ్రైవర్లకు కళ్లద్దాలు అందించడం జరిగిందని.. ప్రస్తుతం 100 మందికి పైగా కంటి పరీక్షలు చేయించుకున్నట్లు తెలిపారు. కంటిచూపు సమస్యతో బాధపడుతున్న వారికి కళ్లద్దాలు అందించడంతో పాటు తగిన చికిత్సలు అందించే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు. కార్యక్రమంలో డీఎస్పీ నల్లపు లింగయ్య, ఆర్డీఓ రాంచందర్‌, డీఎంహెచ్‌ఓ జయచంద్రమోహన్‌, ఆర్టీఓ మేఘాగాంధీ, ఆర్టీఓ మెంబర్‌ పోశాల్‌ రాజేష్‌, సీఐ శివశంకర్‌, లయన్స్‌ క్లబ్‌ సభ్యులు హరినారాయణ భట్టడ్‌, కంటివైద్య నిపుణులు డాక్టర్లు సునీల్‌, మల్లిక, సాయి ఆదిత్య, ఎస్‌ఐలు వెంకటేశ్వర్లు, రాజు, ట్రాఫిక్‌ ఎస్‌ఐ కృష్ణచైతన్య తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement