ప్రజాపాలన వారోత్సవాలకు సీఎం రేవంత్‌రెడ్డి
● డిసెంబర్ 1న మక్తల్‌లో బహిరంగ సభ
● ఏర్పాట్లను పరిశీలించిన మంత్రి వాకిటి శ్రీహరి
నారాయణపేట/మక్తల్: ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి డిసెంబర్ 1న మక్తల్ పట్టణానికి రానున్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తయిన సందర్భంగా నిర్వహించే ప్రజాపాలన వారోత్సవాల్లో సీఎం పాల్గొననున్నారు. అయితే పంచాయతీ ఎన్నికల కోడ్ నేపథ్యంలో మక్తల్ మండలంలో నిర్వహించాల్సిన సభను మక్తల్ పట్టణంలోని బీసీ వెల్ఫేర్ గురుకుల పాఠశాల మైదానానికి మార్పు చేశారు. సీఎం పర్యటన ఏర్పాట్లను శుక్రవారం రాష్ట్ర మత్స్య, పశుసంవర్ధకశాఖ మంత్రి వాకిటి శ్రీహరి, ఎస్పీ డా.వినీత్ పరిశీలించారు. సభా వేదిక, హెలీప్యాడ్, పార్కింగ్ తదితర ఏర్పాట్లపై అధికారులకు పలు సూచనలు చేశారు. అన్నిశాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి సీఎం పర్యటనకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని మంత్రి ఆదేశించారు. ప్రజల భద్రత, ట్రాపిక్ నియంత్రణ, అత్యవసర సేవల్లో ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని సూచించారు. వారి వెంట డీఎస్పీ లింగయ్య, సీఐ రాంలాల్, మున్సిపల్ కమిషనర్ శ్రీరామ్, ఎస్‌ఐ భాగ్యలక్ష్మీరెడ్డి, కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు ఉన్నారు.


