సీనియర్ సిటిజన్లసంక్షేమానికి కృషి
నారాయణపేట: జిల్లా కేంద్రంలోని బారంబావి సమీపంలో ఉన్న వృద్ధాశ్రమం, బాలసదనం హోమ్స్‌ను శనివారం ప్రిన్సిపాల్ జ్యుడీషియల్ మెజిస్ట్రేట్ ఆఫ్ ఫస్ట్ క్లాస్ కోర్టు న్యాయమూర్తి బి.సాయిమనోజ్ అకస్మాత్తుగా తనిఖీ చేశారు. హాజరు పట్టికను పరిశీలించి, సీనియర్ సిటిజన్ల సంక్షేమానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని సిబ్బందికి సూచించారు. వారి ఆరోగ్య సమస్యలు గురించి ఆరా తీశారు. సిబ్బందితో మాట్లాడుతూ.. వృద్ధులకు, చిన్నారులకు ఎలాంటి సమస్యలు ఉన్నా సంబంధిత అధికారికి వెంటనే సమాచారం అందించాలని ఆదేశించారు. నిత్యవసర వస్తువులు, ఆహార ధాన్యాల నాణ్యత, తాగునీరు, పరిశుభ్రత, రిజిస్టర్ల నిర్వహణ, సీసీ పుటేజీలను, మూమెంట్ రిజస్టర్, ఆఫీస్ ఆర్డర్స్ ప్రకారం అడ్మిషన్ తీసుకుంటున్నారా అని వివరాలు సేకరించారు. కార్యక్రమంలో చీఫ్ లీగల్ డిఫెన్స్ కౌన్సిల్ లక్ష్మీపతిగౌడ్, పోలీస్ అధికారులు పాల్గొన్నారు.
ప్రజావాణి రద్దు
నారాయణపేట: ప్రతి సోమవారం కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించే ప్రజావాణి కార్యక్రమాన్ని రాష్ట్రంలో 2వ సాధారణ పంచాయతీ ఎన్నికలు, 2025 నిర్వహిస్తున్నందున డిసెంబర్ 1, సోమవారం రద్దు చేసినట్లు కలెక్టర్ సిక్తా పట్నాయక్ శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఎన్నికల అనంతరం ప్రజావాణి కార్యక్రమం తిరిగి కొనసాగిస్తామని, వివరాలను పత్రికా ప్రకటన ద్వారా తెలియజేస్తామని తెలిపారు. ప్రజలు, దరఖాస్తుదారులు ఈ విషయాన్ని గమనించి సహకరించాలని కోరారు.
మక్తల్ ‘నో ఫ్లయింగ్ జోన్’
నారాయణపేట: మక్తల్ పట్టణాన్ని రెండు రోజులు పాటు నో ఫ్లయింగ్ జోన్‌గా ప్రకటించినట్లు ఎస్పీ యోగేష్ గౌతమ్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. మక్తల్‌కు డిసెంబర్ 1న వీవీఐపీలు, వీఐపీలు రానుండడంతో భద్రతా కారణాల వల్ల ఆదివారం నుంచి సోమవారం వరకు మక్తల్ పరిధిలో డ్రోన్లు, యూఏఐలు, రిమోట్ కంట్రోల్ ఫ్లయింగ్ పరికరాలు వాడటం పూర్తిగా నిషేధించినట్లు తెలిపారు. నిబంధనలను ఉల్లంఘించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రజల భద్రత కోసం ప్రతి ఒక్కరూ పోలీసులకు సహకరించాలని ఎస్పీ విజ్ఞప్తి చేశారు.
కాంగ్రెస్ ప్రజా విశ్వాసం కోల్పోయింది
మక్తల్: కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజలకు ఏమాత్రం నమ్మకం లేదని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు కొండయ్య అన్నారు. శనివారం మండలంలో బీజేపీ కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి గ్రామ పంచాయతీకి కేంద్రం నిధులు మంజూరు చేస్తుందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హమీలను మరిచిపోయి ప్రజలను మోసం చేసిందని ఆరోపించారు. ఇప్పుడు కాంగ్రెస్ నాయకులు ఏ ముఖం పెట్టుకొని సర్పంచ్ ఎన్నికల ప్రచారానికి వస్తారని ఎద్దేవా చేశారు. బీజేపీ మద్దతుతో పోటీ చేసే అభ్యర్థులు ప్రభుత్వ వైఫల్యాలను ఇంటింటికి తీసుకెళ్లి స్థానిక ఎన్నికల్లో బీజేపీ సత్తా చాటాలని సూచించారు. కార్యక్రమంలో బీజేపీ నాయకులు సోంశేఖర్‌గౌడ్, లక్ష్మణ్, శేఖర్‌గౌడ్, ప్రతాప్‌రెడ్డి, అశోక్‌గౌడ్, కృష్ణయ్య, బ్యాటరి రాజు, రాజుగౌడ్, కుర్వలింగం, నరేశ్, సూరి, ఉసేనప్ప పాల్గొన్నారు.
సీనియర్ సిటిజన్లసంక్షేమానికి కృషి


