జిల్లాలో ఆరు ఏకగ్రీవాలు
సాక్షి, నెట్‌వర్క్: సర్పంచ్‌కు ఎన్నికలకు సంబంధించి మొదటి విడత నామినేషన్ల పర్వం శనివారంతో ముగిసింది. సర్పంచ్ స్థానానికి ఒకటే నామినేషన్ వచ్చిన అభ్యర్థి ఎన్నికను లాంఛనప్రాయమే అయినా.. నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసిన తర్వాత అధికారులు అధికారికంగా ప్రకటిస్తారు.
● గుండుమాల్ మండలంలోని అప్పాయపల్లితండా, పెద్దతండా గ్రామ పంచాయతీలను ఆయా గ్రామ పెద్దల సమక్షంలో ఏకగ్రీవం చేసుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఏకగ్రీవ పంచాయతీలకు ప్రభుత్వం రూ.10 లక్షల నజరాన ప్రకటించడంతో గ్రామస్థుల సహకారంతో ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. అప్పాయపల్లితండా సర్పంచ్‌గా రాజేందర్‌నాయక్, ఉప సర్పంచ్‌గా వెంకట్రాములు నాయక్‌ను, పెద్దతండా సర్పంచ్‌గా శ్రీకృష్ణ, ఉప సర్పంచ్‌గా రవీందర్‌నాయక్‌ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. రెండు పంచాయతీల్లో ఉన్న 8 వార్డులకు ఒక్కొక్క నామినేషన్లే దాఖలయ్యాయి.
● మద్దూరు మండలంలోని నాలుగు పంచాయతీలకు సర్పంచ్‌లకు ఒక్కొక్క నామినేషన్ రావడంతో వీరు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. పెదిరిపాడ్ ఎస్టీ మహిళకు రిజర్వ్ కావడంతో కోతులగుట్టతండాకు చెందిన అనుసూయ తారాసింగ్ ఒక నామినేషన్ దాఖాలు చేశారు. పర్సపూర్ ఎస్సీ జనరల్ కావడంతో సర్పంచ్‌గా అభ్యర్థిగా మ్యాతరి అంజిలమ్మ, వార్డులకు ఒకటే నామినేషన్ దాఖలు చేశారు. అప్పిరెడ్డిపల్లి సర్పంచ్‌గా మల్లీశ్వరీ ఒక్కరే నామినేషన్ వేశారు. దామ్లతండాలో కూడా సర్పంచ్, వార్డు సభ్యులకు ఒకే నామినేషన్ దాఖలు చేశారు.


