నారాయణపేట: ప్రత్యేక అవసరాలు గల పిల్లలకు పునరావాసం కల్పించేందుకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సిక్తా పట్నాయక్ సంబంధిత అధికారులను ఆదేశించారు. జిల్లా మహిళా, శిశు సంక్షేమశాఖ ఆధ్వర్యంలో శుక్రవారం కలెక్టరేట్‌లో అదనపు కలెక్టర్ సంచిత్ గంగ్వార్‌తో కలిసి ‘మాతృత్వం ఒక వరం – అందుకు దత్తత మరో మార్గం‘ కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్లను విడుదల చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాల మేరకు ప్రతి సంవత్సరం నవంబర్‌ను దత్తత తీసుకునే నెలగా జరుపుకుంటున్నట్లు చెప్పారు. చట్టప్రకారం పిల్లలను దత్తత తీసుకునే విధానంపై అందరికీ సంపూర్ణ అవగాహన కల్పించాలని సూచించారు. పిల్లలు పుట్టిన తర్వాత వద్దు అనుకునే వారు మహిళా, శిశు సంక్షేమశాఖ కార్యాలయాన్ని సంప్రదించాలని సూచించారు. ఈ ఏడాది ప్రత్యేక అవసరాలు గల పిల్లల సంస్థాగత పునరావాసం అనే థీమ్‌తో ప్రత్యేకంగా ప్రచార కార్యక్రమాలు చేపట్టాలన్నారు. ప్రత్యేక అవసరాలు గల పిల్లలను దత్తత తీసుకోవడాన్ని ప్రోత్సహించడంతో పాటు దత్తతపై ఉన్న అపోహలు, అపార్థాలను తొలగించాలని వివరించారు. కార్యక్రమంలో డీఎంహెచ్‌ఓ డా.జయచంద్రమోహన్, డీసీపీ కరిష్మా, ఆరోగ్యశాఖ అధికారి బిక్షపతి పాల్గొన్నారు.


