రూ.558 కోట్ల అభివృద్ధి పనులకు శ్రీకారం
● నేడు సీఎం చేతుల మీదుగా
శంకుస్థాపనలు
● మంత్రి వాకిటి శ్రీహరి పర్యవేక్షణలో పకడ్బందీ ఏర్పాట్లు
నారాయణపేట/మక్తల్: కాంగ్రెస్ ప్రభుత్వ రెండేళ్ల ప్రజాపాలన వారోత్సవాల్లో భాగంగా సోమవారం ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మక్తల్‌లో పర్యటించనున్నారు. వాకిటి శ్రీహరి మంత్రి అయిన తర్వాత సీఎం మక్తల్‌కు రావడం ఇదే తొలిసారి కావడంతో భారీ ఏర్పాట్లు చేశారు. ఈమేరకు రూ.558 కోట్లతో పెద్ద ఎత్తున అభివృద్ధి పనులను సీఎం చేతుల మీదుగా ప్రారంభించనున్నారు. జూరాల కొత్తపల్లి గ్రామాల మధ్య కృష్ణా నదిపై రూ.123 కోట్లతో బ్రిడ్జి నిర్మాణానికి శంకుస్థాపన, మక్తల్ మండలం గొల్లపల్లి శివారులో 25 ఎకరాల భూమిలో రూ.200 కోట్లతో ఇంటిగ్రేటెడ్ పాఠశాల నిర్మాణానికి శంకుస్థాపన, మక్తల్ – నారాయణపేట నుంచి నాలుగు లైన్ల రోడ్డు పనులు రూ. 210 కోట్లతో, మక్తల్‌లో స్పోర్ట్స్ కాంప్లెక్స్ రూ.25 కోట్లతో ప్రారంభించనున్నారు. ఎప్పుడెప్పుడా అని మక్తల్ – నారాయణపేట – కొడంగల్ పథకంలో భూములు కోల్పోతున్న రైతులకు ఎకరానికి రూ.20 లక్షల చొప్పున ఇస్తామని చెప్పిన పరిహారం చెక్కులను సీఎం చేతుల మీదుగా అందజేసేందుకు మంత్రి ఏర్పాట్లు చేయించారు. అనంతరం బీసీ బాలుర గురుకుల పాఠశాల ఆవరణలో ఏర్పాటుచేసిన బహిరంగ సభలో సీఎం పాల్గొని ప్రజలనుద్దేశించి ప్రసంగించనున్నారు.
కలెక్టర్, ఎస్పీ పరిశీలన
సీఎం మక్తల్ పర్యటన నేపథ్యంలో సభావేదిక వద్ద ఏర్పాట్లను ఆదివారం కలెక్టర్ సిక్తా పట్నాయక్, ఎస్పీ వినీత్ పరిశీలించారు. ఎక్కడా నిర్లక్ష్యం వహించవద్దని, సభకు వచ్చే ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని ఆదేశించారు.


