రెండో విడత తొలి రోజు 59 నామినేషన్లు
నారాయణపేట: జిల్లాలో గ్రామ పంచాయతీ సర్పంచు, వార్డు సభ్యులకు జరుగుతున్న రెండో విడత నామినేషన్ల ప్రక్రియ ప్రశాంతంగా సాగింది. ఆదివారం ఆయా కేంద్రాల వద్ద అధికారులు నామినేషన్ల స్వీకరణ చేపట్టారు. జిల్లాలోని నారాయణపేట నియోజకవర్గంలోని దామరగిద్ద, ధన్వాడ, నారాయణపేట, మరికల్ మండలాల్లోని 35 క్లస్టర్లలో 95 గ్రామ పంచాయతీలకు గాను సర్పంచుకు 59 మంది, 900 వార్డులకు గాను 59 మంది నామినేషన్లు దాఖలు చేశారు. ఇలా సరిసమానంగా నామినేషన్లు దాఖలు కావడం గమనార్హం. తొలి రోజు నామినేషన్లు మందకొడిగా కొనసాగాయి. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీస్‌శాఖ ఆధ్వర్యంలో నామినేషన్ కేంద్రాల వద్ద బందోబస్తును ఏర్పాటు చేశారు. మరో రెండు రోజుల్లో నామినేషన్లు ఊపందుకోనున్నాయి. సీఎం ఇలాఖాలో 6 గ్రామ పంచాయతీలు ఏకగ్రీవం కావడంతో నారాయణపేట నియోజకవర్గంలో సైతం ఏకగ్రీవం చేయించేందుకు ఎమ్మెల్యే వ్యూహరచన చేస్తున్నారు. అధికార పార్టీ ఏకగ్రీవం చేసేందుకు పావులు కదుపుతుండడంతో ప్రధాన విపక్షాలైన బీఆర్‌ఎస్, బీజేపీ తమ అభ్యర్థులను రంగంలోకి దింపి సత్తాచాటేందుకు వ్యూహాలు పన్నుతున్నారు.
జిల్లాలో తొలిరోజు నామినేషన్ల వివరాలిలా..
మండలం సర్పంచు వార్డు
దామరగిద్ద 17 20
ధన్వాడ 14 12
నారాయణపేట 15 7
మరికల్ 13 20


