నామినేషన్లు షురూ
మొదటి రోజు సర్పంచ్‌కు 69, వార్డు స్థానాలకు 38 దాఖలు
నారాయణపేట/కోస్గి/మద్దూరు: జిల్లాలో పంచాయతీ ఎన్నికల కీలక ఘట్టం ప్రారంభమైంది. మొదటి విడతగా డిసెంబర్ 11న జరిగే ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల ప్రక్రియ గురువారం నుంచి చేపట్టారు. కోస్గి, మద్దూర్, గుండుమాల్, కొత్తపల్లి మండలాల పరిధిలో 67 సర్పంచ్, 572 వార్డు స్థానాలకు అధికారులు నామినేషన్లు స్వీకరించారు. మొదటి రోజు సర్పంచ్ స్థానాలకు 69, వార్డులకు 38 నామినేషన్లు దాఖలయ్యాయి. కోస్గి మండలంలో 14 జీపీలకు గాను 5 క్లస్టర్లు ఏర్పాటుచేయగా.. మొదటి రోజు నామినేషన్లు అంతంత మాత్రంగానే దాఖలయ్యాయి. చెన్నారం, నాచారం, పీసీ తండా పంచాయతీల్లో ఒక్క నామినేషన్ కూడా దాఖలు కాలేదు. మద్దూర్, కొత్తపల్లి, గుండుమాల్ మండలాల్లోనూ పెద్దగా నామినేషన్లు దాఖలు కాలేదు. జి ల్లావ్యాప్తంగా నామినేషన్ల పర్వం సాఫీగా సాగింది.
పటిష్ట బందోబస్తు..
నామినేషన్ కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. కొత్తపల్లి, గుండు మాల్, మద్దూర్, కోస్గి మండలాల్లోని పలు నామినేషన్ కేంద్రాలను సీఐ సైదులు, ఎస్‌ఐ బాల్‌రాజ్ సందర్శించి.. పోలీసు బందోబస్తును పర్యవేక్షించారు. ఎలాంటి వివాదాలు తలెత్తకుండా భద్రతా చర్యల ను కట్టుదిట్టం చేసినట్లు చెప్పారు. ఎన్నికల ప్రక్రియ ముగిసే వరకు అప్రమత్తంగా ఉండాలని సిబ్బందికి సూచించారు.
పల్లెల్లో కోలాహలం..
గ్రామాల్లో పంచాయతీ ఎన్నికల కోలాహలం మొదలైంది. సర్పంచ్‌గా పోటీ చేయాలనుకునే ఆశావహులు అందరి మద్దతు కూడగట్టే పనిలో నిమగ్నమయ్యారు. రాష్ట్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ మేరకు మొదటి విడతగా ఎన్నికలు జరుగుతున్న గ్రామపంచాయతీల్లో నామినేషన్ల దాఖలకు అతి తక్కువ సమయం ఉండటంతో అందరితో ముమ్మర చర్చలు సాగిస్తున్నారు. అందులో భాగంగానే మొదటి రోజు నామినేషన్ దాఖలుపై పెద్దగా దృష్టిసారించలేదని తెలుస్తోంది. రానున్న రెండు రోజుల్లో నామినేషన్ల పర్వం ఊపందుకునే అవకాశం ఉంది.
29వ తేదీ వరకు గడువు
అందరి మద్దతు కూడగడుతున్న
ఆశావహులు
సజావుగా ఎన్నికల ప్రక్రియ..
జిల్లాలో గ్రామపంచాయతీ ఎన్నికలు సజావుగా, ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు ప్రత్యేక శ్రద్ధతో పనిచేయాలని జిల్లా ఎన్నికల సాధారణ పరిశీలకురాలు ఎ.సీతాలక్ష్మి అధికారులకు సూచించారు. గురువారం కలెక్టరేట్‌కు వచ్చిన పరిశీలకురాలికి స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ సంచిత్ గంగ్వార్ పూలమొక్క అందజేసి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా కలెక్టరేట్‌లో ఏర్పాటుచేసిన మీడియా సెంటర్, కంట్రోల్ రూంను ఆమె పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. అనంతరం కొత్తపల్లి మండలం నిడ్జింత, మద్దూరు మండలంలోని నాగిరెడ్డిపల్లి పంచాయతీల్లో ఏర్పాటుచేసిన నామినేషన్ కేంద్రాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. నామినేషన్ ప్రక్రియలో ఎలాంటి పొరపాట్లు లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. నామినేషన్లు దాఖలు చేసే క్రమంలో కావాల్సిన ధ్రువపత్రాలను సమర్పించడం లాంటి విషయాలను అభ్యర్థులకు తెలియజేయాలని సూచించారు. నామినేషన్ ఫారాలను స్పష్టంగా చూసి.. వాటిలో ఏవైనా తప్పులు ఉంటే సరిచేసుకునే విధంగా సహకరించాలని తెలిపారు. ఆమె వెంట ట్రెయినీ కలెక్టర్ ప్రణయ్‌కుమార్, డీవైఎస్‌ఓ శెట్టి వెంకటేశ్ ఉన్నారు.
నామినేషన్లు షురూ


