యంత్రాంగం సిద్ధం
నారాయణపేట: రాష్ట్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ ప్రకారం జిల్లాలోని 13 మండలాల్లో పంచాయతీ ఎన్నికలను పకడ్బందీగా నిర్వహించేందుకు అధికార యంత్రాంగం సిద్ధమైంది. కలెక్టర్ సిక్తా పట్నాయక్ దిశానిర్దేశంతో ఎన్నికల నిర్వహణకు అవసరమైన అధికారుల నియామకంతో పాటు ప్రత్యేక నిఘా బృందాల ఏర్పాటు పూర్తయింది. డిసెంబర్ 11, 14, 17 తేదీల్లో మూడు విడతలుగా జరిగే ఎన్నికలను పక్కాగా నిర్వహించేందుకు జిల్లా పంచాయతీ అధికారి సుధాకర్‌రెడ్డి నేతృత్వంలో జిల్లా యంత్రాంగం ఉరుకులు, పరుగులు పెడుతోంది.
ఎఫ్‌ఎస్‌టీ, ఎస్‌ఎస్ బృందాల ఏర్పాటు..
జిల్లాలోని 272 జీపీల్లో జరిగే ఎన్నికల పరిశీలన, ఆకస్మిక తనిఖీల కోసం 26 ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలతో పాటు 10 స్టాటిక్ సర్వేలైన్స్ బృందాలను కలెక్టర్ నియమించారు. ప్రతి మండలంలో ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలను రెండు చొప్పున ఏర్పాటుచేయగా.. కర్ణాటక సరిహద్దులో వాహనాల తనిఖీలు చేపట్టేందుకు గాను 10 ఎస్‌ఎస్ బృందాలను ఏర్పాటుచేశారు. అందులో నారాయణపేట, దామరగిద్ద, మాగనూర్, ఊట్కూర్, కృష్ణా మండలాల్లోని సరిహద్దు గ్రామాల్లో తనిఖీల నిమిత్తం ఒక్కో బృందంలో ముగ్గురు అధికారులను నియమించారు.
ఎంసీపీ అధికారులుగా తహసీల్దార్లు..
అన్ని మండలాల్లో ఎన్నికల ప్రవర్తన నియమావళిని సమర్థవంతంగా అమలు చేసేందుకు గాను తహసీల్దార్లను ఎంసీసీ అధికారులగా నియమించారు. వీరు గ్రామపంచాయతీ ఎన్నికల నిర్వహణ తీరును పక్కాగా పర్యవేక్షిస్తారు. దామరగిద్దకు తిరుపతయ్య, ధన్వాడకు సింధూజ, గుండుమాల్‌కు భాస్కర్‌గౌడ్, కోస్గికి శ్రీను, కృష్ణాకు శ్రీనివాస్, కొత్తపల్లికి జయరాములు, మక్తల్‌కు సతీశ్, మరికల్‌కు రాంకోటి, మాగనూరుకు సురేశ్, మద్దూరుకు మహేశ్‌గౌడ్, నారాయణపేటకు అమరేందర్ కృష్ణ, నర్వకు మల్లారెడ్డి, ఊట్కూర్‌కు రవిని నియమించారు. అదే విధంగా వివిధ శాఖల్లో పనిచేస్తున్న 77మందిని జోనల్ అధికారులుగా నియమించారు. వీరు తమ పరిధిలోని పోలింగ్ ప్రాంతాన్ని కనీసం రెండుసార్లు సందర్శిస్తారు. పోలింగ్ ప్రక్రియ, ఓటింగ్ శాతంపై సంబంధిత అధికారులకు ఎప్పటికప్పుడు నివేదికలు సమర్పిస్తారు.
పంచాయతీ ఎన్నికల నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు
వివిధ స్థాయిల్లో అధికారుల నియామకం
నిఘా బృందాల ఏర్పాటు
కలెక్టర్ దిశానిర్దేశంతో ముందుకు..


