ధన్వాడ కేజీబీవీ ఎస్‌ఓ తొలగింపు
నారాయణపేట రూరల్: జిల్లాలోని ధన్వాడ కస్తూర్బా గాంధీ గురుకుల పాఠశాల స్పెషల్ ఆఫీసర్ (ఎస్‌ఓ) జి.గంగమ్మను విధుల నుంచి తొలగిస్తూ డీఈఓ గోవిందరాజు బుధవారం ఆదేశాలు జారీ చేశారు. సాక్షి దినపత్రికలో బుధవారం ‘కస్తూర్బాలు.. అక్రమాలకు నిలయాలు’ అనే శీర్షికతో ప్రచురితమైన కథనంపై అధికారులు స్పందించారు. జిల్లావ్యాప్తంగా కేజీబీవీలో జరుగుతున్న అక్రమాలపై ప్రచురితమైన కథనం విద్యాశాఖలో తీవ్ర సంచలనం సృష్టించింది. అవినీతి విషయంలో పలుమార్లు అధికారుల దృష్టికి వచ్చినా ఎలాంటి చర్యలు చేపట్టలేదు. గతంలో కలెక్టర్ సిక్తా పట్నాయక్ కస్తూర్బాలో తనిఖీ సమయంలో రిజిస్టర్లలో గుర్తించిన తేడాలపై విచారణకు ఆదేశించింది. జీఈసీఓ నర్మద, ఎఫ్‌ఏఓ యాదగిరి బృందం విచారణ చేసి 2024 జూన్ నుంచి మెస్ ఇన్‌చార్జీని నియమించకపోవడం, విద్యార్థుల సంఖ్యకు భోజన బిల్లుకు సరిలేకపోవడం, ఈ ఏడాది జనవరి నుంచి మార్చి వరకు రూ.25వేలు నిధులు దుర్వినియోగం చేసినట్లు గుర్తించి రిపోర్ట్ అందించారు. దీనిపై ధన్వాడ ఎస్‌ఓ గంగమ్మకు మెమో ఇచ్చి వివరణ కోరగా.. సంతృప్తికర సమాధానం రాకపోవడంతో కలెక్టర్ ఆదేశాల మేరకు ఆమెను ఉద్యోగంలో నుంచి తొలగిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఆమె స్థానంలో అదే పాఠశాలలో సీనియర్ ఉపాధ్యాయురాలు పీజీసీఆర్టీ (గణితం) వి.కల్పనకు ఇన్‌చార్జి ఎస్‌ఓ బాధ్యతలు అప్పగిస్తూ బుధవారం ఆదేశాలు జారీచేశారు.


