పోరాటాలతోనే సమస్యల పరిష్కారం
నారాయణపేట రూరల్: పోరాటాలతోనే విద్యారంగ సమస్యలను పరిష్కరించుకుందామని ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం రాష్ట్ర సహా కార్యదర్శి సాయికుమార్ స్పష్టం చేశారు. జిల్లా 3వ మహాసభల విజయవంతం, నూతన జిల్లా కమిటీ ఎన్నికలపై సోమవారం ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. విద్యార్థులు కేవలం ఉన్నత విద్య మాత్రమే కాక, సమాజంలోని అసమానతలు, అన్యాయాలపై కూడా పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. పేట అన్ని రంగాల్లో వెనుకబడినప్పటికీ, అభివృద్ధిపై ఏ ప్రభుత్వానికీ నిజమైన ఆసక్తి లేదన్నారు. కార్పొరేట్‌కు కొమ్ము కాస్తూ పేదలను విద్యను దూరం చేస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. గురుకుల పాఠశాల, సంక్షేమ వసతి గృహాలకు సొంతభవనాలు ఏర్పాటు చేయాలని, జిల్లా కేంద్రంలో పాలిటెక్నిక్, బీఈడీ, ఇంజినీరింగ్, పీజీ కళాశాలలు నెలకొల్పాలని డిమాండ్ చేశారు.
నూతన కమిటీ..
ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం జిల్లా నూతన అధ్యక్షుడిగా బి.వెంకటేష్, ప్రధాన కార్యదర్శిగా బి.మహేష్, ఉపాధ్యక్షుడిగా హోపి, సహ కార్యదర్శిగా రాజు, కోశాధికారిగా గణేష్‌తో పాటు 15మంది కార్యవర్గ సభ్యులుగా నియమించారు.


