నిర్వాసితులకు అండగా ఉంటా
● తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు,
ఎమ్మెల్సీ కవిత
కొత్తకోట రూరల్: ముంపు గ్రామ నిర్వాసితులకు న్యాయం జరిగే వరకు అండగా ఉంటానని తెలంగాణ జాగృతి అధ్యక్షరాలు, ఎమ్మెల్సీ కవిత అన్నారు. తెలంగాణ జాగృతి– జనంబాట కార్యక్రమంలో భాగంగా ఆదివారం జాగృతి వనపర్తి జిల్లా యువజన విభాగం అధ్యక్షుడు దాసరి విజయ్ ఆధ్వర్యంలో మండలంలోని కానాయపల్లి ముంపు నిర్వాసితులతో ఆమె మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. అనంతరం గ్రామ సమీపంలోని శంకరసముద్రం రిజర్వాయర్‌ను పరిశీలించారు. 2005లో నాటి ముఖ్యమంత్రి దివంతగ నేత వైఎస్ రాజశేఖరరెడ్డి పాలనలో ముంపు గ్రామంగా ప్రకటించగా.. ఇప్పటికీ పరిహారం అందకపోవడంతో భూములు, ఇళ్లు కోల్పోయిన గ్రామస్తులు పాలకుల తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. గ్రామంలో ఢిల్లీ స్థాయి రాజకీయ నాయకులు ఉన్నప్పటికీ తమకు న్యాయం జరగడం లేదని గ్రామస్తులు ఆమె దృష్టికి తీసుకొచ్చారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ.. తనను ఆశీర్వదించి పంపిస్తే అందరి సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తానని గ్రామస్తులకు భరోసానిచ్చారు. అధికార, ప్రతిపక్షంలో తాను లేనని, చేస్తున్న పోరాటంలో అందరూ భాగస్వాములు కావాలని, అవసరం ఉన్నప్పుడు పిలిస్తే అందరూ కలిసికట్టుగా రావాలని కోరారు.
చేనేత కార్మికులను ఆదుకోవాలి..
చేనేత కార్మికులను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆదుకోవాలని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కవిత డిమాండ్ చేశారు. ఆదివారం మండలంలో ఆమె సుడిగాలి పర్యటన చేశారు. మొదట పట్టణంలోని అంబభవానీ ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అక్కడి నుంచి వీవర్స్‌కాలనీలో చేనేత కార్మికులు కుమార్, చంద్రకళ, రాములు, వెంకటమ్మ ఇళ్లకు వెళ్లి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. కార్మికులతో కలిసి మగ్గం వేశారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ.. చేనేత కార్మికులు దేశవ్యాప్తంగా దుర్భర జీవనం సాగిస్తున్నారన్నారు. ప్రత్యేక రాష్ట్రంలో కేసీఆర్ ఆలోచనలతో నేతన్నలకు పింఛన్లు, నూలుకు సబ్సిడీ ఇచ్చినట్లు చెప్పారు. రెండేళ్ల కాంగ్రెస్ పాలనలో రాయితీ నిలిపివేయడంతో పింఛన్లు తప్ప ఎలాంటి ఆదరణ లేదన్నారు. బీసీల్లో అత్యధికంగా పద్మశాలీలు, ముదిరాజ్‌లు ఉంటారని.. వీరిని అన్ని రాజకీయ పార్టీలు ఓటుబ్యాంకుగా చూస్తున్నాయని తెలిపారు. రానున్న రోజుల్లో చేనేత కార్మికుల పక్షాన నిలబడేందుకు తెలంగాణ జాగృతి ముందుంటుందన్నారు. జాగృతి రాష్ట్ర అధికార ప్రతినిధి శ్రీకాంత్‌గౌడ్, మహిళా అధ్యక్షురాలు మర్రిపల్లి మాధవి, ఉపాధ్యక్షురాలు లలితాయాదవ్, బీసీ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు సురేంద్రయాదవ్, రాష్ట్ర వైద్య విభాగం కన్వీనర్ వెంకటరమణమూర్తి, మహబూబ్‌నగర్ జిల్లా కన్వీనర్ శ్రీదేవి, కరాటే శ్రీనివాస్, వనపర్తి జిల్లా కో–కన్వీనర్ మాలతి, బీర్ల ఎల్లయ్యయాదవ్, స్వామి, రవిసాగర్, మనోహర్‌గౌడ్ తదితరులు ఉన్నారు.


